Vinjamur: ఎస్సీ బాలుర హాస్టల్‌లో ఐటీడీఏ మేనేజర్ ఆకస్మిక తనిఖీలు!

Vinjamur: నెల్లూరు జిల్లా వింజమూరు ఎస్సీ బాలుర హాస్టల్ లో అక్రమ హాజరుపై జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఐటీడీఏ ప్రాజెక్టు మేనేజర్ కే.శ్రీనివాసరావు విచారణ జరిపారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 23 July 2026 10:20 PM IST
Vinjamur
X

Vinjamur: ఎస్సీ బాలుర హాస్టల్‌లో ఐటీడీఏ మేనేజర్ ఆకస్మిక తనిఖీలు!

వింజమూరు: నెల్లూరు జిల్లా వింజమూరు బాలుర ఎస్సీ హాస్టల్‌లో వార్డెన్ వ్యవహార శైలిపై విద్యార్థులు చేసిన ఫిర్యాదులు తీవ్ర చర్చకు దారితీశాయి. ఈ ఫిర్యాదుల నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు నెల్లూరు ఐటీడీఏ ప్రాజెక్టు మేనేజర్ కే. శ్రీనివాసరావు హాస్టల్‌ను సందర్శించి సమగ్ర విచారణ చేపట్టారు.

ముందుగా విద్యార్థులతో ప్రత్యేకంగా ముఖాముఖి సమావేశం నిర్వహించిన ప్రాజెక్టు మేనేజర్ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వార్డెన్ తరచూ దూషిస్తున్నారని, భోజనం, స్నానాల సదుపాయాలు, హాస్టల్ నిర్వహణలో పలు సమస్యలు ఉన్నాయని విద్యార్థులు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.

అనంతరం వార్డెన్ భాస్కరరావును వివరణ కోరగా, పాఠశాల నుంచి సమయానికి రాకపోవడం, చెప్పకుండా బయటకు వెళ్లడం వంటి క్రమశిక్షణా లోపాలపై మందలించినందుకే కొందరు విద్యార్థులు తనపై ఫిర్యాదు చేశారని ఆయన వివరించినట్లు తెలిపారు.విచారణలో హాస్టల్ హాజరు రికార్డులపై కూడా అనుమానాలు వ్యక్తమయ్యాయి.

గత వార్డెన్ హయాంలో హాజరు పట్టికలో 72 మంది విద్యార్థులు నమోదు ఉండగా, ప్రస్తుతం ఆ సంఖ్య 52 మాత్రమే ఉన్నట్లు గుర్తించామని ప్రాజెక్టు మేనేజర్ తెలిపారు. వాస్తవానికి కంటే ఎక్కువ మంది విద్యార్థులు ఉన్నట్లు రికార్డుల్లో నమోదు చేసినట్లు ప్రాథమికంగా గుర్తించినట్లు చెప్పారు.

ఈ విషయాన్ని కొందరు విద్యార్థులు కూడా ధృవీకరించారని, "20 మంది ఉన్నా 30 మంది ఉన్నట్లు హాజరు నమోదు చేసేవారు" అని తమకు తెలిపారని వెల్లడించారు.

హాస్టల్ నిర్వహణ, విద్యార్థుల ఫిర్యాదులు, హాజరు రికార్డుల్లో తేడాలు తదితర అంశాలపై పూర్తిస్థాయిలో విచారణ నిర్వహించి సమగ్ర నివేదికను జిల్లా కలెక్టర్‌కు అందజేస్తామని కే. శ్రీనివాసరావు తెలిపారు.ఈ విచారణలో ఏఎస్‌డబ్ల్యూ గీతాదేవి, ఇన్‌చార్జ్ వార్డెన్ భారతి తదితరులు పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story