Nellore: సొమ్మొకరిది.. సోకొకరిది.. చంద్రబాబు పర్యటనపై కాకాణి సెటైర్స్

Nellore: చంద్రబాబు కావలి తుమ్మలపెంట పర్యటనపై వైఎస్సార్సీపీ నేత కాకాణి గోవర్ధన్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

V. Narasimhulu, Nellore
Published on: 20 May 2026 12:30 PM IST
Nellore
X

Nellore: సొమ్మొకరిది.. సోకొకరిది.. చంద్రబాబు పర్యటనపై కాకాణి సెటైర్స్ 

నెల్లూరు: చంద్రబాబు నెల్లూరు జిల్లా కావలి పర్యటనలో మత్సకారుల సేవలో కార్యక్రమం పెట్టి నిస్సిగ్గుగా, నిర్లజ్జగా పచ్చి అబద్దాలు మాట్లాడారని, వారిని అన్ని విధాలుగా ముంచిన చరిత్ర ఆయనదే అని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి స్పష్టం చేశారు. చంద్రబాబు ఇచ్చిన మత్సకారుల భరోసా మొత్తం, డీజిల్ సబ్సిడీ, గల్లంతైన మత్సకార కుటుంబాలకు సాయం పెంచి ఇచ్చిన చరిత్ర జగన్మోహన్ రెడ్డిదే అన్నారు.

చివరికి జగన్మోహన్ రెడ్డి పూర్తి చేసిన జువ్వల దిన్నె ఫిషింగ్ హార్బర్ విషయంలోనూ చంద్రబాబు కోతలకే పరిమితం అయ్యారని కాకాణి గోవర్ధన్ రెడ్డి తెలిపారు. చంద్రబాబు కోతలకు ఎన్నికలు ఎప్పుడొచ్చినా మత్సకారులు వాతలు పెట్టడం ఖాయమని కాకాణి హెచ్చరించారు.

ప్రెస్ మీట్లో కాకాణి గోవర్ధన్ రెడ్డి ఇంకేమన్నారంటే..

"కావలి సభలో చంద్రబాబు అబద్ధాలు"

చంద్రబాబు నెల్లూరు జిల్లా కావలి పర్యటనకు వచ్చి మత్సకారుల సేవలో కార్యక్రమం ప్రారంభించారు. విజనరీ చంద్రబాబు తన ప్రసంగంలో ఎక్కడా మత్సకారులకు భరోసా కల్పించలేకపోయారు. ఇటీవల జగన్మోహన్ రెడ్డి కావలి పర్యటన తాలూకు వణుకు చంద్రబాబులో కనిపించింది. కావలిలో ఓ కార్యక్రమం పెట్టుకుని జగన్మోహన్ రెడ్డిని విమర్శించాలనే ఉద్దేశం తప్ప మత్సకారులకు ఏం చేశాడు, ఏం చేయాలనుకుంటున్నాడు, మత్సకారులకు ఏం అన్యాయం జరిగిందన్న దానిపై ఎక్కడా మాట్లాడలేదు. చంద్రబాబు ప్రసంగంలో జగన్మోహన్ రెడ్డి చెప్పిన అన్ని అంశాలు పరిగణనలోకి తీసుకుని, తమకు న్యాయం చేస్తారని మత్సకారులంతా ఆశించారు.

చంద్రబాబు కార్యక్రమానికి ఎంపిక చేసుకున్న మత్సకారుల్ని మాత్రమే అనుమతించారు. చంద్రబాబు గతంలో ఇక్కడ బహిరంగసభ పెట్టలేకపోయారు కాబట్టే, స్థానిక టీడీపీ కార్యకర్తల్ని తరలించి మమా అనిపించేందుకు ప్రయత్నించారు. చంద్రబాబు తన వయసు, హోదా, ఉనికి అన్నీ మర్చిపోయి కావలిలో కోతలరాయుడు అవతారం ఎత్తారు. నిస్సిగ్గుగా, నిర్లజ్జగా అబద్దాలు ఎలా వల్లెవేయగలడో తుమ్మలపెంట కార్యక్రమం ఓ ఉదాహరణ.

సమయం, సందర్భంతో సంబంధం లేకుండా కేవలం జగన్మోహన్ రెడ్డిని నిందించాలని ప్రయత్నించారు. గతంలోనూ దావోస్ కు వెళ్లినా, అమ్మవారి ఆలయాలకు వెళ్లినా, వినాయకుడి మండపాలకు వెళ్లినా చంద్రబాబు జగన్నామస్మరణే. జగన్మోహన్ రెడ్డి మీద చంద్రబాబు విమర్శలు ఆయన బరితెగింపుకు నిదర్శనంగా కనిపిస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడో, తానేం చేస్తున్నాడో చంద్రబాబు చెప్పులేకపోయారు. మిగతా విషయాలన్నీ చెప్పుకొచ్చారు.

"తొలి ఏడాదే మత్సకార భరోసా ఎందుకివ్వలేదు ?

చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తొలి ఏడాది మత్సకారుల భరోసా ఎందుకు ఇవ్వలేదో చెప్పాలి. అంటే మత్సకారుల్ని వేట నిషేధం సమయంలో డబ్బులు ఇవ్వకుండా తొలి ఏడాది మోసం చేశారు. ఇవాళ అర్హత కలిగిన వారికి కూడా మత్సకారుల సేవలో డబ్బులు జమ చేయకుండా తొలగించారు. ముందుగా లక్షా 52 వేల మందిని ఎంపిక చేశామని చెప్పారు. తర్వాత అనేక కారణాలు చూపించి లక్షా 43 వేల మందికి కుదించారు.

ఇప్పుడు చంద్రబాబు లక్షా 31 వేల మందికి ఇస్తున్నట్లు చెప్పారు. అర్హులకు అన్యాయం చేసిన తర్వాత ప్రకటించిన జాబితాలో ఉన్న వారిలోనూ 21 వేల మందిని తొలగించడం దారుణం కాక మరేమిటి ? ఇదేనా మత్సకారులకు మీరు చేస్తున్న సేవ ? మత్సకారులకు రెండేళ్లుగా డీజిల్ సబ్సిడీని కూడా కోత పెట్టి మొండి చేయి చూపించింది కాక ఇప్పుడు నాలుగు మాటల రాసుకొచ్చి సభలో అబద్దాలు వల్లెవేస్తున్నారు.

"మత్సకారుల్ని అన్ని విధాలా ఆదుకున్నది జగనే"

చంద్రబాబు గతంలో మత్సకార భరోసా నాలుగు వేలే ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని 10 వేలకు పెంచి ఐదేళ్ల పాటు రూ.538 కోట్లు మత్సకార కుటుంబాలకు ఇచ్చారు. 2014లో అధికారంలోకి వచ్చాక వేట నిషేధ సమయంలో మత్సకారులకు చంద్రబాబు ఇచ్చింది 2 వేలే. ఆ తర్వాత ఎన్నికలకు వెళ్తూ 4 వేలకు పెంచారు. దాన్ని జగన్మోహన్ రెడ్డి నిరంతరాయంగా పది వేల చొప్పున ఇచ్చారు. చంద్రబాబు 2014-15లో మత్సకార భరోసా 12,128 కుటుంబాలకు మాత్రమే ఇచ్చారు. అలాంటి ఘనుడు మత్సకారులకు సేవ చేస్తానంటే నీటిలో చేపలు కూడా సిగ్గుపడతాయి.

వాటికి మెదడు ఉంటే చంద్రబాబును ఛీకొడతాయి. 2018-19లో ఎన్నికల సమయంలో 4 వేలకు పెంచి 12 వేల కుటుంబాలకు బదులు 80 వేల కుటుంబాలకు ఇచ్చారు. అలా చూసినా 2014-15 ఒక్క సంవత్సరంలో చంద్రబాబు ఇచ్చింది 2.50 కోట్లు. ఐదేళ్లలో ఇచ్చింది చూస్తే ఇచ్చింది రూ.32 కోట్లు. అదే జగన్మోహన్ రెడ్డి రూ.538 కోట్లు మత్సకారులకు ఇచ్చారు. డీజిల్ సబ్సిడీ సైతం చంద్రబాబు హయాంలో లీటరుకు రూ.6 ఇస్తే జగన్మోహన్ రెడ్డి వచ్చాక రూ.9 కు పెంచారు.

అలాగే మత్సకారులకు కార్డులు ఇచ్చి మరీ ఈ పథకం అమలు చేశారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో అర్హత కలిగిన 24,034 బోట్లకు డీజిల్ సబ్సిడీ కింద నాలుగేళ్ల పాటు రూ.98 కోట్లు ఇచ్చాం. చివరి సంవత్సరంలో మరో 50 కోట్లు మంజూరు చేసాం. మత్సకారులు గల్లంతు అయితే చంద్రబాబు పెట్టిన బకాయిలతో సహా జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షలు చెల్లించారు.

"జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ పైనా చంద్రబాబు కోతలు"

జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ పైనా చంద్రబాబు అబద్దాలే చెప్పారని తెలిపారు. రూ.288 కోట్లు ఖర్చుపెట్టామని, 80 శాతం పూర్తి చేశామని చెప్పడం అబద్దం అని అన్నారు. జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ మీద చంద్రబాబు రూపాయి కూడా ఖర్చుపెట్టలేదు. జగన్మోహన్ రెడ్డి పుణ్యమాని జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ వచ్చింది తప్ప చంద్రబాబు తట్టెడు మట్టి కూడా ఎత్తలేదు, రూపాయి కూడా ఖర్చుపెట్టలేదు. ఇంత పచ్చి అబద్దాలు చెప్పే వాళ్లు ప్రపంచంలో ఎక్కడా లేరు. జగన్మోహన్ రెడ్డి హయాంలోనే ఫిషింగ్ హార్బర్ ప్రారంభించారని గుర్తు చేశారు.

కొత్తగా నాలుగు పోర్టులు అదనంగా తెచ్చారని వెల్లడించారు. వాటితో పాటు 10 ఫిషింగ్ హార్బర్లకు కేంద్రం అనుమతులు తెచ్చారని, 16 వేల కోట్లతో 4 పోర్టులకు జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టారు, అలాగే రూ.3800 కోట్లతో 10 ఫిషింగ్ హార్బర్లు, రూ.150 కోట్లతో ఐదు ఫిష్ ల్యాండింగ్ సెంటర్లకు శ్రీకారం చుట్టారని తెలిపారు. ఇలా 20 వేల కోట్ల పనులకు శ్రీకారం చుట్టడమే కాకుండా ఇంకో 6 వేల కోట్లతో వాటిని విస్తరించేందుకు కూడా ప్లాన్ చేశారని తెలిపారు.

అన్నిరకాల అనుమతులు, బ్యాంకుల లోన్లు తీసుకొచ్చారని చెప్పారు. అన్నీ పూర్తయ్యాక తానే చేసినట్లు చంద్రబాబు చెప్పుకోవడం సిగ్గుచేటు. కాబట్టి చంద్రబాబుకు మత్సకారుల గురించి మాట్లాడే హక్కు లేదని చెప్పారు. మత్సకారుల్ని ఓటు బ్యాంకు రాజకీయాలకు వాడుకుంటున్న చంద్రబాబు మాటలు దయ్యాలు వేదాలు వల్లించినట్లుంది అని అన్నారు.

జగన్మోహన్ రెడ్డి 2024లో అధికారంలోకి వచ్చి ఉంటే దాదాపు 20 వేల మందిని బోట్లకు ఓనర్లను చేసేవారని చెప్పారు. 200 మెకనైజ్డ్ బోట్లను తీసుకురావాలని భావించారని తెలిపారు. ఇప్పుడు ఆయన తెస్తానని చెప్పుకుంటున్నారని, వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి 1200 మెకనైజ్డ్ బోట్లు తీసుకురావాలని ప్లాన్ చేశారని చెప్పారు. మత్సకారుల్ని ఆయా బోట్లకు ఓనర్లను చేయాలనుకున్నారని చెప్పారు.

"చంద్రబాబుకూ, జగన్ కూ తేడా ఇదే"

మత్సకారులకు ఉన్న సదుపాయాలు చాలవని, విస్తరణకు వెళ్లాలని జగన్మోహన్ రెడ్డి భావిస్తే.. ఇప్పుడు చంద్రబాబు, లోకేష్ ఇద్దరూ కలిసి సాగర్ డిఫెన్స్ సంస్ధకు ఇచ్చి జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ ప్రైవేటీకరణకు బరితెగిస్తున్నారని, ఒకవేళ చంద్రబాబు ప్రభుత్వం సాగర్ డిఫెన్స్ కు ఈ హార్బర్ కు ఇచ్చినా వైఎస్సార్సీపీ ప్రభుత్వం రాగానే రద్దు చేస్తామని గతంలోనే చెప్పామని తెలిపారు .

ఇవాళ టీడీపీకి సంబంధించిన మత్సకారులు కూడా చంద్రబాబును ఛీకొట్టే పరిస్దితి ఉందని, చంద్రబాబు ఏరోజైనా మత్సకారుల గురించి అయినా, తీర ప్రాంత ప్రజల గురించి ఆలోచన చేశారా ? అలా చేసింది కేవలం జగన్మోహన్ రెడ్డి మాత్రమే. ఇప్పటికైనా చంద్రబాబు డైవర్షన్ డ్రామాలు కట్టిపెట్టాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ, టీడీపీ ఎప్పటికీ ఒక్కటి కావని, బోత్ ఆర్ నాట్ సేమ్. నయవంచనతో, దగాతో పుట్టిన పార్టీ టీడీపీ అయితే ఓ ఆలోచనతో, స్ఫూర్తితో పుట్టిన పార్టీ వైఎస్సార్సీపీ అన్నది గుర్తుంచుకోవాలి అని చెప్పారు .కోతల రాయుడు చంద్రబాబుకు ఏ రోజు ఎన్నికలు వచ్చినా వాతలు పెట్టేందుకు మత్సకారులు సిద్దంగా ఉన్నారని కాకాణి గోవర్ధన్ రెడ్డి హెచ్చరించారు.

V. Narasimhulu, Nellore

V. Narasimhulu, Nellore

Next Story