Nellore: సర్వేపల్లి కాలువలపై కాకాణి క్షేత్రస్థాయి పర్యటన.. సోమిరెడ్డి అవినీతి గుట్టురట్టు!
Nellore: సర్వేపల్లి నియోజకవర్గంలో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి క్షేత్రస్థాయి పర్యటన.
Nellore: సర్వేపల్లి కాలువలపై కాకాణి క్షేత్రస్థాయి పర్యటన.. సోమిరెడ్డి అవినీతి గుట్టురట్టు!
Nellore: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా,సర్వేపల్లి నియోజకవర్గం, ముత్తుకూరు మండలం,జంగాల కండ్రిగ జంక్షన్ వద్ద , ముత్తుకూరు, తోటపల్లి గూడూరు మండలాల రైతాంగానికి సాగునీరు అందించే పలు కాలవలను స్వయంగా రైతులు, స్థానిక ప్రజలతో కలిసి పరిశీలించారు మాజీ మంత్రివర్యులు ఉమ్మడి నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు "డా" కాకాణి గోవర్ధన్ రెడ్డి.
క్షేత్రస్థాయిలో పర్యటించి ఇరిగేషన్ పనుల పేరుతో సోమిరెడ్డి ఏ విధంగా దోచుకుంటున్నాడో మీడియాకు, రైతులకు, స్థానిక ప్రజలకు, కళ్ళకు కట్టినట్లు చూపించారు కాకాణి. కాకాణి కాలువల పర్యటనకు రానున్నారని తెలిసి , భారీగా తరలివచ్చి ఘన స్వాగతం పలికారు రైతులు, ప్రజలు.. జంగాల కండ్రిగ కాలువ కట్టమీద నివసిస్తున్న గిరిజనలు తమకు సంక్షేమ పథకాలు అందడం లేదని, ఆధార్ కార్డులు ఇప్పించమని కాకాణికి వినతి పత్రం సమర్పించారు. గిరిజనల సమస్యల మీద కలెక్టర్ తో మాట్లాడి ఆధార్ కార్డులు, ఏర్పాటుచేసి సంక్షేమ పథకాలు అందే విధంగా చర్యలు తీసుకుంటానని కాకాణి గిరిజనులకు హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా కాకాణి గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ..
నెల్లూరు జిల్లాలో ఇరిగేషన్ (సాగునీటి) పనుల పేరిట రైతులను అడ్డుపెట్టుకుని తెలుగుదేశం పార్టీ నేతలు భారీ దోపిడీకి పాల్పడుతున్నారని, సర్వేపల్లి నియోజకవర్గంలో ఎలాంటి ఇరిగేషన్ పనులు చేయకుండానే, సోమిరెడ్డి, అడ్డగోలుగా కోట్ల రూపాయలు దోచుకుంటున్నారని ఆరోపించారు. ఇరిగేషన్ లో అవినీతికి సంబంధించిన అన్ని ఆధారాలను, ఫోటోలతో సహా మొన్ననే నెల్లూరులో జరిగిన విలేకరుల సమావేశంలో మీడియా ముందు ఉంచామని, రైతుల విజ్ఞప్తి మేరకు జంగాల కండ్రిగ ప్రాంతంలో క్షేత్రస్థాయిలో పర్యటించి, సాగునీటి కాలువల దుస్థితిని రైతులు, స్థానిక ప్రజలతో కలిసి పరిశీలించామని చెప్పారు. సోమిరెడ్డి కాలువల పనులలో ఏ విధంగా చేతివాటం ప్రదర్శిస్తున్నాడో రైతులే కథలు, కథలుగా చెబుతున్నారని అన్నారు.
రోడ్డున పోయే వాళ్లకు ఇరువైపులా కనిపించినంత దూరం మాత్రమే కాలువలను శుభ్రం చేస్తూ మిగిలిన వాటిని వదిలేస్తూ మోసాలకు పాల్పడుతున్నారని చెప్పారు. గత ఏడాది కనీసం రోడ్డుకు కనిపించే ప్రాంతంలోనైనా కొద్దిపాటి పనులు చేసేవారని, ఈ ఏడాది అసలు పనులే చేయకుండా, ఇష్టానుసారంగా బిల్లులు డ్రా చేసుకుంటూ అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు.
ఇరిగేషన్ పనుల పేరిట సోమిరెడ్డి చేస్తున్న అవినీతిలో ఇన్ని రకాల చిట్కాలు ఉంటాయా అని రైతులు చెబుతుంటే ఆశ్చర్యం వేసిందన్నారు కాకాణి.
సోమిరెడ్డి చేస్తున్న అక్రమాలను మీడియా ద్వారా ప్రజల ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతోనే ఈ పర్యటన చేపట్టామని, నెల్లూరు జిల్లాలో గతంలో వచ్చిన 'మోంతా తుఫాను' (నవంబర్ 2025) నష్ట నివారణ చర్యల్లో భాగంగా, దాదాపు ఎనిమిది నెలల క్రితం జిల్లా కలెక్టర్ ఆమోదించిన పనులు చేయకుండానే ఇప్పుడు దొంగ బిల్లులు చేసుకుంటున్నారని, ఇరిగేషన్ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలనే నిబంధనను పక్కనబెట్టి, నీళ్లు వదిలిన తర్వాత సోమిరెడ్డి అగ్రిమెంట్లు చేసుకోవడానికి పథకం వేశాడని చెప్పారు.
సాగునీటి కాలువలకు నీళ్లు వదిలిన తర్వాత అగ్రిమెంట్లు చేయాలంటూ 'సోమిరెడ్డి' ఒత్తిడి తెచ్చాడని, నీళ్లు ఉన్నప్పుడు అగ్రిమెంట్లు చేయడం కుదరదని (ఇంచార్జ్ ఈఈ) నిరాకరించాడని బాధ్యతల నుంచి తప్పించాడని చెప్పారు. సోమిరెడ్డి అడుగులకు మడుగులు వత్తేవాడు, అనుకూలంగా తల ఊపేలా ఉండే కొత్త ఈఈని సెంట్రల్ డివిజన్‌లో నియమించుకుని, ఇప్పుడు నిబంధనలకు విరుద్ధంగా అగ్రిమెంట్లు చేసుకుంటూ దొంగ బిల్లులు సృష్టిస్తున్నారని చెప్పారు.
యుద్ధ ప్రాతిపదికన ఏడు నెలల క్రితం చేయవలసిన పనులకు ఈరోజు అగ్రిమెంట్ చేసి బిల్లులు చేసుకునే పరిస్థితి ఏర్పడిందని, మేము సేకరించిన అధికారిక వివరాల (ప్యాటర్న్) ప్రకారం ఒకే పనిని దాదాపు మూడు, నాలుగు రకాలుగా చూపిస్తూ బిల్లులు డ్రా చేస్తున్నారని ఆరోపించారు. పని జరిగే ప్రాంతం (చైనేజ్) ఒక్కటే అయినప్పటికీ, కేవలం పేర్లు (నామినెక్లేచర్) మార్చి మోసాలకు పాల్పడుతున్నారని చెప్పారు.
కనుపూరు కాలువకు సంబంధించి మనుషులతో చేయించాలని కిలోమీటర్ పనులకు రూ. 10 లక్షల చొప్పున అంచనా వేసి, ఒక డోజర్ (జెసిబి)ని తెచ్చి కాలువకు ఇరువైపులా మట్టిని నెట్టేసి, పూడికతీత పనులు పూర్తయినట్లు దొంగ బిల్లులు సృష్టించి ప్రజాధనాన్ని దోచుకుంటున్నారని ఆగ్రహించారు. ప్రతీ సీజన్‌లో మేమే సొంతంగా డబ్బులు వేసుకుని, ఈ కాలువ పూడికతీత పనులు చేసుకుంటున్నాం తప్ప, ప్రభుత్వం కానీ ఇక్కడి కాంట్రాక్టర్లు కానీ రూపాయి పని చేయలేదని రైతులు తన సమక్షంలోనే చెప్తున్నారని అన్నారు.
రైతుల కష్టాన్ని, వారి శ్రమను దోచుకుంటూ సోమిరెడ్డి ముఠా దొంగ బిల్లులతో సొమ్ము చేసుకుంటోందని, తమ అవినీతిని కళ్ళకు కట్టినట్లు చూపిస్తుంటే, తట్టుకోలేక గతంలో అవినీతి జరిగిందంటూ మా పై విమర్శలు చేయడం సిగ్గుచేటు అని అన్నారు. మేము క్షేత్రస్థాయిలో పరిశీలించి సోమిరెడ్డి, సోమిరెడ్డి ముఠా, ఇరిగేషన్ పనులలో చేస్తున్న అవినీతిని చూపిస్తున్నాం అని, మీకు దమ్మూ,ధైర్యం ఉంటే క్షేత్రస్థాయిలో కాలువల దగ్గరకు వస్తే మీ అవినీతిని మేము చూపిస్తాం అని సవాల్ చేశారు. ఇరిగేషన్ పనులు జరగలేదన్నది పచ్చి నిజం , సోమిరెడ్డి దోపిడీని రైతుల సమక్షంలోనే ఎండగడుతున్నాం అని అన్నారు. కాలువల్లో పూడికతీత పనులు లేక, చెట్లు పెరిగి ,గడ్డి పేరుకుపోయి, నీరు ముందుకు సాగని పరిస్థితిని నేడు స్వయంగా చూస్తున్నాం అని అన్నారు.
చంద్రబాబు నాయుడికి రైతులంటే నిర్లక్ష్యం, వ్యవసాయం అంటే అశ్రద్ధ కాబట్టే,ముఖ్యమంత్రి నిర్లక్ష్యాన్ని ఆసరాగా చేసుకుని సోమిరెడ్డి లాంటివాళ్ళు రైతులను అడ్డుపెట్టి దోచుకుంటున్నారని ఆగ్రహించారు. సాగునీరు అందక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని , కొన్ని చోట్ల రైతులే స్వయంగా చందాలు వేసుకుని సొంతంగా కాలువలను శుభ్రం చేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని చెప్పారు. జిల్లా కలెక్టర్ పరిపాలనా అధికారిగా వ్యవహరిస్తూ, టిడిపి నాయకులు దోచుకుంటుంటే చూస్తూ మౌనంగా ఉండడం సరికాదని హితవు పలికారు.
గ్రామాలకు సాగునీరు సక్రమంగా అందేలా చూడటం జిల్లా కలెక్టర్ బాధ్యత అని, గతంలో 2014-2019 మధ్య 'నీరు-చెట్టు' పథకం పేరుతో ఎలాగైతే దోచుకున్నారో, ఇప్పుడు కూడా రైతులను అడ్డుపెట్టుకుని దోచుకోవాలనే ఆలోచనతోనే కూటమి నేతలు ఉన్నారని చెప్పారు. గతంలో జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు (2019-2024 మధ్య) సాగునీటి కాలువల ఆధునీకరణ, పూడికతీత పనులు ముమ్మరంగా చేపట్టామని, ఇక్కడ ఉండే రైతులు మా హయాంలో జరిగిన పనులనే గుర్తుచేసుకుంటున్నారని చెప్పారు. జగన్ ప్రభుత్వంలోనే కాలువ పనులు జరిగాయని,ప్రస్తుత కూటమి ప్రభుత్వం కనీసం కాలువల వైపు కన్నెత్తి చూసిన పాపాన పోలేదని రైతులు అంటున్నారని చెప్పారు. గతంలో ఎప్పుడో జరిగిన పనులకు విజిలెన్స్ ఎంక్వయిరీ అంటూ సాగదీస్తున్నారే తప్ప, విజిలెన్స్ నివేదిక బయటకు రాలేదని చెప్పారు.
సర్వేపల్లి రిజర్వాయర్ మరమ్మత్తుల కోసం గతంలో 12 కోట్లు మంజూరు చేస్తే, ఆ పనులు పూర్తికాకుండానే అర్ధాంతరంగా మరో 50 కోట్ల మేర దోపిడీకి సోమిరెడ్డి తెర తీశాడని కాకాణి ఫైర్ అయ్యారు. గత రెండేళ్ల కాలంలో ఎన్ని సార్లు దొంగ బిల్లులు చేసి దోచుకున్నారో పరిశీలించి సోమిరెడ్డి అవినీతిపై విజిలెన్స్ విచారణ జరిపించాలని సవాల్ విసురుతున్నామని చెప్పారు. కూటమి నాయకులకు సిగ్గు, ఉంటే గాలి మాటలు మాట్లాడడం కాదు , షట్టర్ల అవినీతిపై , దోషులను గుర్తించి దమ్ముంటే క్రిమినల్ కేసులు పెట్టండి అని అన్నారు. షట్టర్లు బిగించడంలో అవినీతి జరిగిందంటూ సోమిరెడ్డి గగ్గోలు చేసి కమిషన్లు దండుకున్నాడని, ప్రభుత్వ విచారణ అంతా కేవలం కొంతమంది కేటుగాళ్లను కూర్చోబెట్టి ఆడిస్తున్న నాటకం , కాంట్రాక్టర్లతో లాలూచీ పడి, ముడుపులు తీసుకున్నందుకే తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకోవడం లేదని చెప్పారు.
2019 నుండి 2024 మధ్య కాలంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో నిత్యం రైతాంగ అవసరాలను పర్యవేక్షిస్తూ, వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూశామని , జగన్మోహన్ రెడ్డి అధికారంలో లేకపోయినా ఈరోజు కూడా రైతులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి తమ సాధక, బాధలను మాకు చెప్పుకుంటున్నారని చెప్పారు. నేడు కోట్లాది రూపాయలు దోచుకుంటున్న టిడిపి నాయకులు ప్రభుత్వం మారగానే హైదరాబాద్‌కో, బెంగుళూరు కో వెళ్ళిపోతారని చెప్పారు.
ఉద్యోగులు ఎక్కడికీ పారిపోలేరు, ఇక్కడే ఉద్యోగం చేయాలి. నేల విడిచి సాము చేయకండి, రిటైర్ అయిపోయినా సరే, వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు.
అక్రమాలు ఎక్కడెక్కడ జరిగాయో వాటన్నింటినీ గూగుల్ మ్యాప్స్ (Google Maps) ద్వారా ఏరోజుకారోజు రికార్డు చేస్తున్నాం అని, రాబోయే రోజుల్లో వీటన్నింటిపై ఖచ్చితంగా విచారణ జరుగుతుందని , పనులు చేయకుండానే దొంగ బిల్లులు తీసుకున్న అధికారులపై కఠిన చర్యలు ఉంటాయని చెప్పారు. రామానాయుడు సైకిల్ తొక్కుతాను అంటూ చేస్తున్న డ్రామాలను ఇకనైనా ఆపాలని, ప్రజలు ఆయన్ను ఇప్పటికే 'డ్రామాల నాయుడు' అని పిలుస్తున్నారని చెప్పారు. ఒకపక్క రైతులను అడ్డం పెట్టుకుని ఇరిగేషన్ పనుల్లో దోచుకుంటూ, మరోపక్క సైకిల్ తొక్కుతూ నాటకాలాడుతున్నాడని చెప్పారు. కూటమి ప్రభుత్వంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతుంటే ,రామానాయుడు సైకిల్ ఎక్కి తొక్కడం కాదు, సైకిల్ కింద పడేసి తొక్కాలి అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
రామానాయుడు ఇకనైనా కమిషన్లు తీసుకోవడం మానేసి వాస్తవాలు తెలుసుకోవాలని , నిజంగా రైతులపై చిత్తశుద్ధి ఉంటే ,జిల్లాలో పర్యటించి ఎక్కడెక్కడ ఎన్ని దొంగ బిల్లులు చేసుకున్నారో, వాటిపై నిగ్గు తేల్చి, చర్యలు తీసుకోవాలని సూచించారు.
జిల్లా కలెక్టర్ ,కూటమి ప్రభుత్వం కళ్ళు తెరిచి వాస్తవాలను గ్రహించాలని, సర్వేపల్లి నియోజకవర్గంలో ఇప్పటివరకు జరిగిన పనులపై, అక్రమాలపై విచారణ జరిపించాలని,
రైతులకు సాగునీరు సజావుగా అందేలా వెంటనే కాలువల్లో పూడికలు తీయించి, శుభ్రం చేయించాలి , రైతులకు సాఫీగా సాగునీరు అందించేలా యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ రైతుల సంక్షేమమే ధ్యేయంగా ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తుందని చెప్పారు కాకాణి గోవర్ధన్ రెడ్డి.




