Nellore: ఒక్క చెట్టు మెయింటెనెన్స్‌కు ₹12 వేలా.. కాకాణి సంచలనం!
Nellore: నెల్లూరులో మంత్రి నారాయణ మార్క్ దోపిడీ జరుగుతోందని కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆరోపించారు.
Nellore: ఒక్క చెట్టు మెయింటెనెన్స్‌కు ₹12 వేలా.. కాకాణి సంచలనం!
Nellore: నెల్లూరులో మున్సిపల్ మంత్రి నారాయణ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ నేతలు చెట్లు, స్కూళ్ల పేరుతో దోపిడీకి తెరలేపుతున్నారని, దీనికి కార్పోరేషన్ నిధుల్ని వాడుకుంటున్నారని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక్కో చెట్టు నాటేందుకు 5 వేలు,
దాని నిర్వహణకు 12 వేలు కార్పేరేషన్ నిధుల నుంచి ఖర్చు పెడుతున్నారని మేం ఆధారాలతో సహా ప్రశ్నిస్తే సీఎస్ఆర్ నిధులిస్తామని చెప్తున్నారని ఆక్షేపించారు. వీఆర్ హైస్కూల్ అభివృద్ధి విషయంలోనూ కార్పోరేషన్ నిధులు ఖర్చుపెట్టేందుకు ప్రయత్నిస్తే తాము అడ్డుకున్నామని, అప్పుడు సీఎస్ఆర్ నిధులిస్తామని చెప్పి తిరిగి కార్పోరేషన్ నుంచే రూ.10 కోట్లు తీసుకునేందుకు కుట్రలు చేస్తున్నారని తెలిపారు.
కాకాణి గోవర్ధన్ రెడ్డి, పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి
నెల్లూరు మున్సిపల్ కార్పోరేషన్ లో జరుగుతున్న దోపిడీ, మంత్రి నారాయణ నేతృత్వంలో ఏవిధంగా తెలుగు తమ్ముళ్లు ప్రజల సొమ్మును దోచుకుంటున్నారన్న విషయం మా ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి బయటపెట్టారని, తమపై కావాలనే ఎవరెవరినో ఉసిగొల్పి, వ్యక్తిగత విమర్శలు చేయించడం, సబ్జెక్ట్ ను డైవర్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. చంద్రశేఖర్ రెడ్డి చెప్పిన ప్రతీ విషయం ఆధారాలతో మాట్లాడారని,
అయినా టీడీపీ నేతలు సవాళ్లు చేయడం, మీసాలు మెలితిప్పడం, తొడలు కొట్టడం చేస్తున్నారని అన్నారు. మేం అడిగింది ఇవన్నీ చేయమని కాదు. మున్సిపల్ మంత్రి ఆధ్వర్యంలో జరుగుతున్న అవినీతికి సంబంధించిన వివరాలు అన్నీ సేకరించి, మేం బయటపెట్టాం. మీరు చెప్పే ప్రతీ మాటకూ సమాధానం చెప్పేందుకు సిద్దంగా ఉన్నామని చెప్పారు..
నెల్లూరులో 11వ డివిజన్ లో వెయ్యి చెట్లకు సంబంధించి 50 లక్షలకు వర్క్ ఆర్డర్ ఇచ్చారు. అంటే చెట్టుకు ఐదు వేల రూపాయలని, అలాగే 13వ డివిజన్లోనూ వెయ్యి చెట్లకు 50 లక్షలు వర్క్ ఆర్డర్ ఇచ్చారని, చెట్టుకు ఐదువేల చొప్పన వర్క్ ఆర్డర్ అంచనాలు తయారు చేశారని చెప్పారు. 14వ డివిజన్లో 1800 చెట్లకు కోటీ 24 లక్షల రూపాయలు నిర్వహణకు వర్క్ ఆర్డర్ తయారు చేశారని, ఈ లెక్కన ఒక మొక్క నాటితే దాని నిర్వహణకు 12 వేల రూపాయలు ఖర్చుచేస్తున్నారని తెలిపారు.
మున్సిపల్ కార్పోరేషన్ నిధుల్లో దోపిడీ చేస్తున్నారని అడిగితే సొంత నిధులు, సీఎస్ఆర్ నిధులని బుకాయిస్తున్నారని చెప్పారు. గతంలో మేయర్ కౌన్సిల్లో తీర్మానం చేసి మున్సిపల్ నిధులు వాడేందుకు ఇలా అనుమతి ఇచ్చారని, కానీ మున్సిపల్ కమిషనర్ మాత్రం డీపీఆర్ లేకుండానే ఈ ఖర్చు చేస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ చెప్తున్నారని తెలిపారు..
కార్పోరేషన్ నిధులతో పాటు ఇతర సీఎస్ఆర్ నిధులు కూడా తెచ్చి ఖర్చుపెడతామంటే మాకు అభ్యంతరం లేదని చెప్పారు .సీఎస్ఆర్ నిధులైనా డీపీఆర్ కచ్చితంగా ఉండాల్సిందేనని, అలాగే నిధులు కలెక్టర్ ఖాతాలో జమ చేయాలని, కలెక్టర్ డీపీఆర్, ఇతర విషయాలు పరిశీలించి అప్పుడు నిధులు విడుదల చేయాలని, మున్సిపల్ మంత్రి నారాయణ చెప్పారని డీపీఆర్ లేకుండా ఖర్చు చేస్తామంటే కుదరదని చెప్పారు.




