Kakani Govardhan Reddy: నిస్సిగ్గుగా టీచర్ పోస్టులు అమ్ముకున్నారు.. విద్యాశాఖ మంత్రి లోకేష్ వెంటనే రాజీనామా చేయాలి

Kakani Govardhan Reddy: డీఎస్సీ 2025 అక్రమాలపై నెల్లూరు వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయంలో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. జూన్ 1న కలెక్టరేట్ ముట్టడికి పిలుపునిచ్చారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 30 May 2026 9:40 PM IST
Kakani Govardhan Reddy: నిస్సిగ్గుగా టీచర్ పోస్టులు అమ్ముకున్నారు.. విద్యాశాఖ మంత్రి లోకేష్ వెంటనే రాజీనామా చేయాలి
X

నెల్లూరు: డీఎస్సీలో జరిగిన అక్రమాలపై వైఎస్ఆర్సిపి తన గొంతు వినిపిస్తూనే ఉంది... ఈ నేపథ్యంలో నెల్లూరు వైస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా కాకాణి గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ... డీఎస్సీ అక్రమాల్ని ఆధారాలతో సహా బయటపెట్టామని, మా ఆరోపణలకు తూతూ మంత్రంగా అధికారులు ఖండన ఇచ్చారని, మేం లేవనెత్తిన ప్రశ్నలకు అధికారులు సమాధానం ఇవ్వలేదని చెప్పారు. డీఎస్సీ అక్రమాలపై జూన్ 1న కలెక్టరేట్ లో ముట్టడి నిర్వహించబోతున్నామని,డీఎస్సీ స్కాంపై ప్రభుత్వం సీబీఐ దర్యాప్తు జరిపించే వరకూ వెనక్కి తగ్గమని హెచ్చరించారు.

తవ్వేకొద్దీ ప్రభుత్వ లీలలు బయటపడుతున్నాయని, టీచర్‌ ఉద్యోగాలు అంటూ ఊరించి నిస్సిగ్గుగా చంద్రబాబు ప్రభుత్వం పోస్టులు అమ్ముకున్నదని అన్నారు. అర్హులైన అభ్యర్థులకు కాల్‌ లెటర్లు పంపి, సర్టిఫికెట్ల పరిశీలన పూర్తయ్యాక కూడా, తుది జాబితాలో వారి పేర్లు గల్లంతు కావడం దుర్మార్గం అని అన్నారు. మెరిట్‌ లిస్ట్, సెలక్షన్‌ లిస్టు.. రెండూ ప్రకటించకుండా ఎంపిక చేసిన అభ్యర్థులకు నేరుగా మెసేజ్‌ల ద్వారా సమాచారం అందించడం ఏంటని ప్రశ్నించారు.

ఒక పోస్టుకు ఒక్కరినే ఎంపిక చేసి సర్టిఫికెట్ల పరిశీలనకు పిల్చిన ప్రభుత్వం, కానీ, ఆ అర్హులకు ఇటు ఉద్యోగాలు ఇవ్వలేదు. అటు వారిని రిజెక్టెడ్‌ లోనూ చూపలేదని అన్నారు. అభ్యర్థులు గ్రీవెన్స్‌ సెల్‌లో ఫిర్యాదు చేస్తే, తప్పుడు సమాచారం ఇచ్చి, అధికారులు చేతులు దులుపుకుంటున్నారని చెప్పారు. అర్హులకు ఉద్యోగాలు ఇవ్వాలని హైకోర్టు ఆదేశించినా, ఆ ఆదేశాన్ని బేఖాతరు చేస్తూ.. అప్పటికే అర్హులైన అభ్యర్థుల ఎంపిక పూర్తి చేసినట్లు కోర్టుకు సమాచారం ఇచ్చి, తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు.

డీఎస్సీ ఫలితాలు ప్రకటించేటప్పుడు రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్, రోస్టర్‌ ప్రకారం అభ్యర్థులకు వచ్చిన మార్కుల మార్కులతో మెరిట్‌ లిస్ట్‌ విడుదల చేయాలని, కానీ డీఎస్సీ–2025 అందుకు భిన్నంగా నిర్వహించారని చెప్పారు. ఫలితాల ప్రకటన వరకు ఒక విధానం, సర్టిఫికెట్ల పరిశీలనకు మరో విధానం, తుది ఎంపిక జాబితా విడుదల సమయంలో మరో విధానాన్ని అమలు చేశారని తెలిపారు. అలా పరీక్ష రాసిన అభ్యర్థులకు మెరిట్‌ లిస్ట్‌ పరిశీలించే వీలు లేకుండా చేశారని తెలిపారు.

మామూలుగా ఏ పరీక్షలో అయినా, మెరిట్‌ లిస్ట్‌ ప్రకటించిన తర్వాత సెలక్షన్‌ లిస్టు తయారుచేసి కౌన్సెలింగ్‌ నిర్వహిస్తారని, కానీ, ఈ డీఎస్సీ–2025లో మాత్రం, ఆ పద్ధతి మార్చి.. మెరిట్‌ లిస్ట్, సెలక్షన్‌ లిస్ట్‌ లేకుండా నేరుగా సెలెక్టెడ్‌ అభ్యర్థులకు.. ఒక పోస్టుకు ఒకరి చొప్పున మాత్రమే ఎంపిక చేసి, సర్టిఫికెట్ల పరిశీలనకు పిల్చారని, చివరకు వారికి కూడా మొండిచెయ్యి చూపారని చెప్పారు.

ఇన్ని అక్రమాలతో నిర్వహించిన, అంతులేని అవినీతి జరిగిన డీఎస్సీ–2025పై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. వెంటనే విద్యా శాఖ మంత్రి నారా లోకేష్, బాధ్యత వహించి రాజీనామా చేయాలని కోరారు కాకాణి.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story