Nellore: ఆక్వా ఫీడ్ ధరలు తగ్గాల్సిందే.. వైసీపీ పోరాటం మొదలైంది!
Nellore: ఆక్వా మేత ధరల పెంపుపై మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
Nellore: ఆక్వా ఫీడ్ ధరలు తగ్గాల్సిందే.. వైసీపీ పోరాటం మొదలైంది!
నెల్లూరు: ఏపీలో ఆక్వా మేత పెంపకాలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు మాజీమంత్రి, నెల్లూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాకాణి గోవర్ధన్ రెడ్డి. అసలే అనుకూలించని వాతావరణ పరిస్థితుల్లో ఆక్వా రైతులు ఆగచాట్లు పడుతుంటే, మూలిగే నక్కపై తాటికాయ పడ్డ చందంగా రాష్ట్ర ప్రభుత్వం రొయ్య రైతుల నడ్డి విరుస్తోందంటూ ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఆక్వా రేట్ల పెంపకాన్ని తప్పు పడుతూ, ఇవాళ నెల్లూరు వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాకాణి మాట్లాడారు.ఏపీ సి ఎం చంద్రబాబు నాయుడుకి ఆక్వా రైతుల పట్ల ఏ రోజు మంచి ఉద్దేశ్యం లేదన్నారు కాకాణి.
ఎన్నికలకు ముందు అన్నీ ఉచితం అంటూ వాగ్దానం చేయడం... తరువాత మాట తప్పడం చంద్రబాబుకు అలవాటే అన్నారు.రూ.1:50 పైసలకు విద్యుత్ ఇస్తామని చెప్పి, రెండు రూపాయలు చేసిన ఘనత చంద్రబాబుది అన్నారు. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఆక్వా ఫీడ్ రేట్లు రైతులకు అందుబాటులో వుండేవన్నారు. ప్రభుత్వ ప్రోత్సాహం తోనే ఫీడ్ రేట్లు పెంచారని రైతులకు అర్థం అయిందన్నారు.
చంద్రబాబు నాయుడి అనుభవం జనాల్ని దోచుకోవడానికి ఉపయోగపడుతుందని కాకాణి విమర్శించారు.ఆక్వా రైతులు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోనే సంతోషంగా ఉన్నారని రైతులే అంటున్నారని కాకాణి అన్నారు. వైఎస్సార్ సీపీ మీద నమ్మకంతో ఆక్వా రైతులు వైసీపీ దగ్గరకు వచ్చారని చెప్పారు.వ్యవసాయ శాఖా మంత్రి అచ్చెన్నాయుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు కాబట్టే , ఫీడ్ రేట్లు పెరిగాయని కాకాణి తెలిపారు. ఆక్వా ఫీడ్ మీద పెంచిన ప్రతి పైసా తగ్గించే దాకా వైసీపీ పోరాటం చేస్తుందని కాకాణి హెచ్చరించారు.




