Nellore: మత్స్యకారుల పొట్ట కొడుతున్న కూటమి సర్కార్.. కాకాణి
Nellore: నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్‌ను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టడాన్ని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు.
Nellore: మత్స్యకారుల పొట్ట కొడుతున్న కూటమి సర్కార్.. కాకాణి
Nellore: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, కావలిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం లో మాజీ శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి తో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు మాజీ మంత్రివర్యులు ఉమ్మడి నెల్లూరు జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు"డా" కాకాణి గోవర్ధన్ రెడ్డి.
ఈ సందర్భంగా కాకాణి గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ..
మత్స్యకారుల పొట్ట కొట్టేలా కూటమి సర్కార్ నిర్ణయాలు ఉన్నాయంటూ మండిపడ్డారు. మత్స్యకారుల ఆస్తి అయిన జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ ను ప్రైవేట్ వ్యక్తులకు కట్ట పెట్టడం దారుణమని పేర్కొన్నారు.
తాము పరిశ్రమలకు వ్యతిరేకం కాదు కానీ పారిశ్రామికీకరణ పేరిట ప్రైవేటు వ్యక్తులకు, ప్రభుత్వ ఆస్తులను కట్ట బెడుతూ, మత్స్యకారుల పొట్ట కొట్టడాన్ని సహించబోమని పేర్కొన్నారు. బోట్ల చోరీ మత్స్యకారుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే చర్య అని వెల్లడించారు. కూటమి నాయకుల దొంగ చేష్టలు, రోత పనులన్నీ ప్రజలకు అర్థమయ్యాయని, జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్‌ను కూటమి ప్రభుత్వం కావాలనే నిర్లక్ష్యం చేస్తోందన్నారు.
జగన్మోహన్ రెడ్డి వచ్చిన వెంటనే జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ లో ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చిన స్థలాన్ని రద్దుచేసి, మత్స్యకారులకు తిరిగి అప్పగిస్తామని స్పష్టం చేశారు. నెల్లూరు జిల్లా మత్స్యకారుల చిరకాల స్వప్నమైన జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ విషయంలో కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు సరికాదని, గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో దాదాపు పూర్తయిన జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ ప్రాజెక్టును, కేవలం రాజకీయ కక్షతోనే అడ్డుకుంటున్నారని చెప్పారు.
తెలుగుదేశం హయాంలో కేవలం ప్రతిపాదనలకే పరిమితమైన జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్‌ను,కావలి ఎమ్మెల్యే గా ఉన్న రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి మేరకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలోనే నిధులు కేటాయించి పనులు ప్రారంభించారని గుర్తు చేశారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలోనే జువ్వల దిన్నె హార్బర్ పనులు దాదాపు పూర్తయ్యాయని, కేవలం మిగిలిపోయిన కొద్ది పనులు మాత్రమే మిగిలి ఉన్నాయని తెలిపారు.
జగన్ మోహన్ రెడ్డికి ఎక్కడ మంచి పేరు వస్తుందో అన్న భయంతోనే, ప్రస్తుత కూటమి ప్రభుత్వం మిగిలిపోయిన స్వల్ప పనులను కూడా పూర్తి చేయకుండా కాలయాపన చేస్తోందని విమర్శించారు.
ఫిషింగ్ హార్బర్ అందుబాటులోకి రాకపోవడం వల్ల స్థానిక మత్స్యకారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, కూటమి ప్రభుత్వం వెంటనే స్పందించి మిగిలిన పనులను పూర్తి చేసి హార్బర్‌ను ప్రారంభించాలని డిమాండ్ చేశారు. వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వ హయాంలో జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్‌ను మొదటి విడతలో 79 ఎకరాలలో సుమారు ₹289 కోట్ల వ్యయంతో అభివృద్ధి చేశామని,
చుట్టుపక్కల ఉన్న అనేక గ్రామాల మత్స్యకార కుటుంబాలకు ఇది ప్రధాన జీవనోపాధి కేంద్రంగా ఉండాలని జగన్ భావించారని తెలిపారు. మొదటి విడత పనులు పూర్తి కాకముందే, అందులోని దాదాపు 29.5 ఎకరాల భూమిని ప్రైవేట్ వ్యక్తులకు ( సాగర్ డిఫెన్స్)కు కేటాయించడం దుర్మార్గం అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
దీనివల్ల మత్స్యకారులకు దక్కాల్సిన హక్కులను కూటమి ప్రభుత్వం హరిస్తోందని చెప్పారు. ఫిషింగ్ హార్బర్ భూమిని ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టడం వెనుక కూటమి నాయకులు భారీగా ముడుపులు అందుకుంటున్నారని విమర్శించారు.
మత్స్యకారుల నోరు కొట్టి, ప్రైవేట్ యాజమాన్యాలకు లాభం చేకూర్చేలా కూటమి ప్రభుత్వ నిర్ణయాలు ఉన్నాయని, ఏమీ చేయకుండానే ఏదో సాధించినట్లుగా 'షాడో ముఖ్యమంత్రి' నారా లోకేష్ జువ్వలదిన్నె లో పర్యటించి శంకుస్థాపనలు చేయడం హాస్యాస్పదం అని చెప్పారు. మత్స్యకారులకు అండగా ఉండాల్సిన ప్రభుత్వం, వారి ఆస్తులను పక్కదారి పట్టించడం దారుణం అని అన్నారు.
తాము పరిశ్రమల స్థాపనకు వ్యతిరేకం కాదని, పరిశ్రమల పేరుతో మత్స్యకారుల జీవనోపాధిని దెబ్బతీసే మీ "చిలక కొట్టుడు" వ్యవహారాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని అన్నారు. జగన్ మోహన్ రెడ్డి హయాంలో నిర్మించిన మౌలిక సదుపాయాలను ప్రైవేట్ కంపెనీలకు అమ్ముకుని, ముడుపులు తీసుకోవాలని కూటమి ప్రభుత్వం చూస్తోందని ధ్వజమెత్తారు.
కూటమి నేతలు ఒక్కో రోజు ఒక్కో మాట మాట్లాడుతూ.. ప్రైవేట్ అని, డిఫెన్స్ విభాగం అని ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నారని చెప్పారు. మత్స్యకారులను తక్కువ అంచనా వెయ్యవద్దని, వారికి జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో వైఎస్సార్ సీపీ పూర్తి అండగా ఉంటుందని చెప్పారు.
నారా లోకేష్ సముద్ర మార్గంలో కాకుండా రోడ్డు మార్గంలో వచ్చిన వ్యక్తి , ఫిషింగ్ హార్బర్‌లో ఉన్న బోట్లను అధికారుల సహకారంతో తరలించడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని చెప్పారు. బోట్ల చోరీ వ్యవహారంలో సీబీ ఐ అధికారులతో విచారించాల్సిన అవసరం లేదు, ఒక కానిస్టేబుల్ కాల్ డేటా సహాయంతో విచారించి పూర్తి చేయగలడు అని చెప్పారు. కూటమి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం వల్లే రాత్రికి రాత్రే బోట్ల తరలింపు జరిగిందని అన్నారు.
ఈ వ్యవహారంలో ఉన్న కాల్ డేటా బయటకు రావడం తో అసలు నిజాలు వెలుగులోకి వస్తున్నాయని చెప్పారు. మత్స్యకారుల పొట్ట కొట్టి ప్రైవేట్ వ్యక్తులకు మేలు చేయాలని చూస్తే సహించేది లేదని హెచ్చరించారు. మత్స్యకారుల హక్కుల కోసం వైఎస్సార్ సీపీ పోరాటం కొనసాగిస్తుందని చెప్పారు. బోట్ల వ్యవహారంలో అసలు సూత్రధారులను వదిలేసి, పోలీసు అధికారులను మాత్రమే బలి పశువులను చేశారని తెలిపారు.
పోలీస్ శాఖ లో బదిలీల ద్వారా కూటమి ప్రభుత్వం తన తప్పులను కప్పిపుచ్చుకోవాలని చూస్తోందని, మత్స్యకారుల సంక్షేమంపై చంద్రబాబుకు ఎప్పుడూ నిర్లక్ష్యమే, ఎన్నికల సమయంలో మాత్రమే ఆయనకు మత్స్యకారులు గుర్తుకు వస్తారని చెప్పారు. 50 ఏళ్లకే పెన్షన్ ఇస్తామని చెప్పి చంద్రబాబు మత్స్యకారులను మోసం చేశాడని, గత రెండేళ్లలో వారికి ఒక్క రూపాయి కూడా లబ్ధి చేకూర్చలేదని అన్నారు.
మత్స్యకారులపై చంద్రబాబు చూపిస్తున్నది కపట ప్రేమ, కేవలం ఓట్ల కోసమే ఆయన బాపట్ల సభలో మత్స్యకారుల గురించి మాట్లాడారని, జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ ప్రైవేటీకరణ, బోట్ల చోరీ వంటి అంశాలపై చంద్రబాబు ఎందుకు నోరు మెదపలేదో అర్థం కావడం లేదని ప్రశ్నించారు.
మత్స్యకారుల హక్కులకు భంగం కలిగిస్తున్న 'సాగర్ డిఫెన్స్' ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని, దొంగిలించిన బోట్లను సీజ్ చేసి, వాటిని తిరిగి హార్బర్ లో యధా స్థానంలో ఉంచాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో మత్స్యకార సామాజిక వర్గానికి జరుగుతున్న అన్యాయంపై పార్టీలకు అతీతంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని చెప్పారు కాకాణి గోవర్ధన్ రెడ్డి.




