Nellore: చంద్రబాబు అసమర్థత వల్లే ఇంధన కొరత.. మాజీ మంత్రి కాకాణి

Nellore: నెల్లూరులో పెట్రోల్ బంకులను సందర్శించిన మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, రాష్ట్రంలో ఇంధన కొరతకు చంద్రబాబు అసమర్థతే కారణమని మండిపడ్డారు.

V. Narasimhulu, Nellore
Published on: 27 April 2026 9:23 PM IST
Nellore
X

Nellore: చంద్రబాబు అసమర్థత వల్లే ఇంధన కొరత.. మాజీ మంత్రి కాకాణి

Nellore: రాష్ట్రంలో నెలకొన్న పెట్రోల్, డీజిల్ కొరతపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు మాజీ మంత్రి కాకాణి. కూటమి ప్రభుత్వ వైఫల్యం, చంద్రబాబు అసమర్ధత వల్లే ఈ దారుణ పరిస్థితి దాపురించిందని, కూటమి పాలనలో రైతులకు, సాధారణ ప్రజలకు, కష్టాలు తప్పడం లేదని, చంద్రబాబుకు ముందు చూపు లేని కారణంగా రవాణా వ్యవస్థ స్తంభించి, ప్రజలు అవస్థలు పడుతున్నారని చెప్పారు. ఆంధ్ర రాష్ట్రంలో ఏర్పడిన ఇంధన కొరతకు చంద్రబాబు వైఫల్యమే కారణమన్నారు. ప్రభుత్వం తక్షణమే ఇంధన నిల్వలను పునరుద్ధరించి, ప్రజలకు ఉపశమనం కలిగించాలని డిమాండ్ చేశారు కాకాణి.

ఈ సందర్భంగా కాకాణి గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ..

పెట్రోల్ బంకుల వద్ద కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరి ఉన్నాయని, వాహనదారులు గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోంది, దీనివల్ల సామాన్యుల సమయం వృథా అవుతోందని, ఇంధన కొరత కారణంగా రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిందని, తద్వారా నిత్యావసర సరుకుల రవాణాపై కూడా ప్రభావం పడే అవకాశం ఉందని చెప్పారు.

ప్రజలు, రైతులు ఇన్ని ఇబ్బందులు పడుతున్నా కూటమి ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణం అని , ప్రభుత్వం తక్షణమే ఇంధన నిల్వలను పునరుద్ధరించి, ప్రజలకు ఉపశమనం కలిగించాలని పేర్కొన్నారు. పొలాలకు నీళ్లు పెట్టేందుకు, పంటలు తరలించేందుకు మరియు ఇతర వ్యవసాయ పనులకు డీజిల్ దొరకక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, చేతుల్లో క్యాన్ లతో రైతులు తెల్లవారుజాము నుండి బంకుల చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేదని,

రెండో పంటకు నారు పోసుకోవాల్సిన సమయంలో పంపింగ్ ప్రక్రియకు ఇంధనం లేకపోవడం వ్యవసాయ రంగాన్ని దెబ్బతీస్తోందని చెప్పారు. ఆయిల్ కంపెనీలకు ముందే డబ్బులు చెల్లించినప్పటికీ, గత మూడేళ్ళు గా ఏప్రిల్ నెలల సగటు వినియోగాన్ని లెక్కగట్టి, అంతకంటే ఎక్కువ ఇంధనాన్ని సరఫరా చేయడం లేదని కంపెనీలు చెబుతున్నట్లు పెట్రోల్ బంక్ యజమానులు పేర్కొన్నారు.

పొరుగున ఉన్న తమిళనాడు, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో ఇంధనం పుష్కలంగా దొరుకుతోందని, అక్కడ ప్రభుత్వం లో ఎన్డీఏ భాగస్వామ్యం లేకపోయినా ధరలు తక్కువగా ఉండటమే కాకుండా, సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా పుష్కలంగా ఆయిల్ దొరుకుతుందని చెప్పారు. ఇంధనం దొరకక నెల్లూరు దాటి వెళ్లలేక వందలాది వాహనాలు హైవే పక్కన నిలిచిపోయాయని,దీనివల్ల రవాణా రంగం కుప్పకూలిందని అన్నారు.

సాగు పనుల కోసం డీజిల్ దొరక్క రైతులు, గంటల తరబడి ఎండలో వేచి చూస్తూ, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రంలోని కూటమిలో భాగస్వామిగా ఉండి కూడా ఈ సమస్యను పరిష్కరించ లేకపోతున్నాడని, చంద్రబాబు కేవలం మీడియాలో ఆవేదన వ్యక్తం చేయడం తప్ప, క్షేత్రస్థాయిలో సమస్యను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమయ్యాడని పేర్కొన్నారు.

ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని,దీని పర్యవసానమే నేడు సామాన్య ప్రజలు, రైతులు అనుభవిస్తున్న ఈ ఇబ్బందులని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెట్రోల్ బంకుల పరిశీలనలో కేవలం 200 రూపాయల విలువైన పెట్రోల్ మాత్రమే పోస్తున్నారని, డీజిల్ స్టాక్ లేదని చెబుతున్నారని వినియోగదారులు ఆవేదన చెందుతున్నారని చెప్పారు.

పొదుపుగా ఇంధనం వాడుకోమని అధికారులు చెబుతూ, అవసరం మేర ఆయిల్ పట్టకపోవడం ప్రజలను ఇబ్బందులకు గురిచేయడమే అని అన్నారు. ఒకవైపు సివిల్ సప్లైస్ మంత్రి రాష్ట్రంలో ఎక్కడా ఇంధన కొరత లేదని చెబుతుంటే, మరోవైపు క్షేత్రస్థాయిలో అధికారులు ఆంక్షలు విధిస్తున్నారని, ఈ పొంతన లేని మాటలకు కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పాలని అన్నారు.

పొరుగు రాష్ట్రాల్లో, ఎన్డీయే అధికారంలో లేని రాష్ట్రాల్లో కూడా లేని ఇంధన సమస్య ఏపీలో ఎందుకు వస్తుంది,ఇది చంద్రబాబు నాయుడు చేతకానితనం కాదా? అని ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు తన అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి డ్రామాలు ఆడటం మానేసి, వెంటనే కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరిపి రాష్ట్రానికి సరిపడా పెట్రోల్, డీజిల్ సరఫరా అయ్యేలా చూడాలని డిమాండ్ చేశారు.

ప్రజలు ఇంధనం కోసం బంకుల వద్ద గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోంది, ప్రభుత్వం వెంటనే ఈ సమస్యను పరిష్కరించకపోతే ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. పొలాలకు వెళ్లాల్సిన రైతులు, డీజిల్ కోసం ఎండలో గంటల తరబడి క్యూ కట్టడం దురదృష్టకరం అని అన్నారు.

వృద్ధాప్యంలో ఉన్న రైతులు కూడా డీజిల్ క్యాన్ ల తో బంకుల చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేకపోవడం బాధాకరం అని అన్నారు. ఒక రైతు కళ్ళలో నీళ్లు పెట్టుకుని ఇక్కడ డీజిల్ కోసం అడుక్కుంటున్న పరిస్థితి చూస్తుంటే నా మనసు కలుక్కుమంటోందని చెప్పారు. ఈ దుస్థితికి కారణం కూటమి ప్రభుత్వం, చంద్రబాబు అసమర్ధత కాదా? అని ప్రశ్నించారు.

ప్రజల సమస్యల పట్ల ప్రభుత్వం వెంటనే స్పందించి, ఆయిల్ సరఫరాలను పునరుద్ధరించి , పెట్రోల్ బంకుల వద్ద రద్దీని తగ్గించి, సాధారణ పరిస్థితులు నెలకొల్పాలని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. ప్రజలకు ఏ సమస్య వచ్చినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని తెలియజేస్తున్నామని చెప్పారు కాకాణి గోవర్ధన్ రెడ్డి.

V. Narasimhulu, Nellore

V. Narasimhulu, Nellore

Next Story