Atmakur: ప్రభుత్వ జూనియర్ కళాశాలలో రూ.2 లక్షలతో ఉచిత RO ప్లాంట్ ఏర్పాటు!
Atmakur: ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శ్రీ సాంబశివ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కంచి పరమేశ్వర రెడ్డి రూ.2 లక్షల సొంత ఖర్చుతో ఉచిత RO ప్లాంట్‌ను ఏర్పాటు చేసి ప్రారంభించారు.
Atmakur: ప్రభుత్వ జూనియర్ కళాశాలలో రూ.2 లక్షలతో ఉచిత RO ప్లాంట్ ఏర్పాటు!
ఆత్మకూరు: నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుతున్న 450 మంది విద్యార్థుల తాగునీటి సమస్యకు శ్రీ సాంబశివ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, నిత్యాన్నదాత కంచి పరమేశ్వర రెడ్డి చొరవతో శాశ్వత పరిష్కారం లభించింది.
కళాశాలలో ఏళ్ల తరబడి నెలకొన్న తాగునీటి సమస్యను అధ్యాపకులు ఆయన దృష్టికి తీసుకెళ్లగా, జూలై 30న కళాశాలను స్వయంగా సందర్శించి సమస్యను పరిశీలించారు. ఇచ్చిన హామీ మేరకు కేవలం 19 రోజుల్లోనే తన సొంత ఖర్చుతో రూ.2 లక్షల వ్యయంతో అధునాతన ఉచిత RO జలశుద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.
కళాశాలకు విచ్చేసిన కంచి పరమేశ్వర రెడ్డికి ప్రిన్సిపల్ వాణిశ్రీ, అధ్యాపకులు, విద్యార్థులు ఘన స్వాగతం పలికారు. పూజా కార్యక్రమాల అనంతరం రిబ్బన్ కట్ చేసి, స్విచ్ ఆన్ చేయడం ద్వారా RO ప్లాంట్‌ను ప్రారంభించారు. అనంతరం విద్యార్థులకు స్వచ్ఛమైన తాగునీటిని అందుబాటులోకి తీసుకువచ్చారు. విద్యార్థుల ఆరోగ్య భద్రతకు ప్రాధాన్యతనిస్తూ తాగునీటి సమస్యను పరిష్కరించినందుకు కళాశాల యాజమాన్యం ఆయనను పూలమాల, శాలువాతో ఘనంగా సత్కరించింది.
ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ట్రస్ట్ ప్రతినిధులు చేపడుతున్న సామాజిక సేవా కార్యక్రమాలను వివరించారు. నిరంతర అన్నదానం, నిరుపేద కుటుంబాల్లో మరణించిన వారికి రూ.10 వేల ఆర్థిక సాయం, గిరిజన వివాహాలకు సారెతో పాటు రూ.10 వేల నగదు ప్రోత్సాహకం, విద్యాసంస్థల్లో నీటి ప్లాంట్ల ఏర్పాటు, ప్రతిభావంతులైన విద్యార్థులకు బహుమతులు అందించడం వంటి కార్యక్రమాలను వివరించారు.
కంచి పరమేశ్వర రెడ్డి మాట్లాడుతూ తన చిన్నతనంలో సరైన వసతులు లేక ఎన్నో కష్టాలు ఎదుర్కొని చదువుకున్నానని తెలిపారు. విద్యార్థుల జీవితంలో ఇంటర్మీడియట్ రెండేళ్లు అత్యంత కీలకమని, ఈ సమయంలో కష్టపడి చదివితే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చన్నారు. మొబైల్ ఫోన్లలో విలువైన సమయాన్ని వృథా చేయకుండా చదువుపై దృష్టి పెట్టాలని సూచించారు.
ప్రభుత్వ కళాశాలల్లో అర్హత, విజ్ఞానం, నైపుణ్యం కలిగిన అధ్యాపకులు ఉచితంగా విద్యనందిస్తున్నారని, ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. తాను ఆదర్శంగా తీసుకుని విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదిగి భవిష్యత్తులో సమాజానికి సేవ చేసే దాతలుగా మారాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ శ్రీవాణి, ట్రస్ట్ సభ్యులు, అధ్యాపకులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




