Kavali: కావలిలో పోలీసుల కార్డన్ అండ్ సెర్చ్.. 24 వాహనాలు సీజ్!
Kavali: నెల్లూరు జిల్లా ఎస్పీ డా. అజిత వేజెండ్ల ఆదేశాల మేరకు కావలి రూరల్ పరిధిలోని బి.కె నగర్, ఒరిస్సా కాలనీలలో పోలీసులు విస్తృత కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు.
Kavali: కావలిలో పోలీసుల కార్డన్ అండ్ సెర్చ్.. 24 వాహనాలు సీజ్!
Kavali: నెల్లూరు జిల్లా ఎస్పీ డా. అజిత వేజెండ్ల జిల్లా పోలీస్ అధికారులకు కార్డన్ & సెర్చ్ ఆపరేషన్లపై జారీ చేసిన ఆదేశాల మేరకు, జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణతో పాటు, ప్రజల్లో భద్రతా భావన పెంపొందించే దిశగా కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్స్‌ను విస్తృతంగా నిర్వహిస్తున్నారు. డిజిటల్ మ్యాపింగ్ ద్వారా క్రైమ్ స్పాట్స్ గుర్తింపు, రౌడీషీటర్లు, అనుమానితులు, పరారీ నిందితులు, NBWs/సమన్లు, గంజాయి మరియు ఇతర నిషేధిత పదార్థాలు, అనుమానాస్పద వాహనాలు మరియు అక్రమ కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు.
ఈ ఆదేశాల మేరకు, ఈ రోజు అనగా తేది 25.05.2026న ఉదయం 5:30 గంటల నుండి 7:00 గంటల వరకు కావలి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బి.కె నగర్, కామావూరు ఒరిస్సా కాలనీలో విస్తృత కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించబడింది.
ఈ కార్డన్ & సెర్చ్ కార్యక్రమం కావలి రూరల్ సీఐ రాజేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించబడగా, కావలి రూరల్ ఎస్సై, కావలి వన్ టౌన్ ఎస్సై మరియు 22 మంది పోలీసు సిబ్బందితో కూడిన ప్రత్యేక పోలీస్ బృందం పాల్గొంది. ఆపరేషన్‌లో భాగంగా కాలనీలోని ప్రతి ఇంటిని క్షుణ్ణంగా తనిఖీ చేశారు.
తనిఖీల సందర్భంగా సరైన పత్రాలు లేని 22 ద్విచక్ర వాహనాలు మరియు 02 ఆటోలను గుర్తించి స్వాధీనం చేసుకుని పరిశీలనలో ఉంచారు. వాహన యజమానులు సరైన పత్రాలు చూపించి వాహనాలను తీసుకువెళ్లాలని సూచించగా, పత్రాలు లేని వాహనాలపై మోటార్ వెహికిల్స్ చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు.
అలాగే పాత కేసుల్లో ముద్దాయిగా ఉన్న ఒక రౌడీషీటర్‌ను గుర్తించి పోలీస్ స్టేషన్‌కు పిలిపించి కౌన్సెలింగ్ నిర్వహించి, భవిష్యత్తులో ఎటువంటి నేర కార్యకలాపాలకు పాల్పడవద్దని హెచ్చరించి పంపించారు.
ఈ సందర్భంగా స్థానిక ప్రజలకు ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న నేరాలు, మోసాలు మరియు అక్రమ కార్యకలాపాలపై అవగాహన కల్పించారు. ప్రాంతంలో అనుమానాస్పద వ్యక్తుల కదలికలు లేదా అక్రమ కార్యకలాపాలపై సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు తెలియజేయాలని ప్రజలకు సూచించారు.
జిల్లాలో శాంతి భద్రతలను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ఇటువంటి కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్స్‌ను విస్తృతంగా కొనసాగిస్తామని జిల్లా ఎస్పీ డా. అజిత వేజెండ్ల తెలిపారు.




