Kavali: మహిళల రక్షణకు శక్తి యాప్ ఉక్కు కవచం జిల్లా ఎస్పీ అజిత
Kavali: నెల్లూరు జిల్లా కావలి ఎంపీడీవో కార్యాలయంలో మహిళా రక్షణ, సైబర్ నేరాలపై అవగాహన సదస్సు నిర్వహించారు.
Kavali: మహిళల రక్షణకు శక్తి యాప్ ఉక్కు కవచం జిల్లా ఎస్పీ అజిత
Kavali: మహిళల భద్రతకు రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిన ‘శక్తి’ యాప్ మహిళలకు ఉక్కు కవచంలా పనిచేస్తుందని, మహిళల రక్షణ పోలీసు శాఖ ప్రధాన బాధ్యత అని కావలి టూ టౌన్ ఇన్‌స్పెక్టర్ వి. గిరిబాబు పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా, కావలి పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన మహిళల అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ..
ఆపదలో ఉన్న మహిళలు శక్తి యాప్‌లోని ఎస్‌ఓఎస్ (SOS) బటన్‌ను నొక్కిన వెంటనే వారి లొకేషన్ వివరాలు సమీప పోలీస్ స్టేషన్‌తో పాటు డయల్-112 కేంద్రానికి చేరుతాయని తెలిపారు. దీంతో పోలీసులు వెంటనే స్పందించి బాధితులకు రక్షణ కల్పించే చర్యలు చేపడతారని వివరించారు.
మహిళల భద్రత, సైబర్ నేరాల నివారణ, సోషల్ మీడియా మోసాలు, దొంగతనాలపై జిల్లా ఎస్పీ డాక్టర్ అజిత వేజెండ్ల, కావలి డీఎస్పీ వి.వి. రమణకుమార్ మార్గదర్శకత్వంలో విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
"సోషల్ మీడియా మోసాలపై అప్రమత్తంగా ఉండాలి"
కార్యక్రమంలో పాల్గొన్న శక్తి టీం కావలి సబ్‌డివిజన్ ఇన్‌చార్జి ఎస్‌ఐ గోపీచంద్ మహిళలకు పలు కీలక సూచనలు చేశారు. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా ఏర్పడే పరిచయాల విషయంలో జాగ్రత్తగా ఉండాలని, వ్యక్తిగత వివరాలు, ఫోటోలు, బ్యాంకు సమాచారం ఇతరులతో పంచుకోవద్దని సూచించారు.
ఆన్‌లైన్ మోసాలకు పాల్పడే వ్యక్తులు పంపే లింకులను క్లిక్ చేయవద్దని, ఓటీపీలు, బ్యాంకు పాస్‌వర్డ్‌లు ఎవరికీ చెప్పకూడదని హెచ్చరించారు. అత్యవసర పరిస్థితుల్లో వెంటనే పోలీసుల సహాయం పొందేందుకు ప్రతి మహిళ శక్తి యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు.
"దొంగతనాలు, చైన్ స్నాచింగ్‌లపై జాగ్రత్త"
ఇంటి దొంగతనాలు, చైన్ స్నాచింగ్ వంటి ఘటనలను నివారించేందుకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. ఇళ్లకు తాళాలు వేసి ఇతర ప్రాంతాలకు వెళ్లే ముందు స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, రద్దీ ప్రాంతాల్లో మహిళలు తమ బంగారు ఆభరణాలు, నగదు విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.
అపరిచిత వ్యక్తుల మాటలను నమ్మి మోసపోవద్దని, అనుమానాస్పద పరిస్థితులు ఎదురైతే వెంటనే పోలీసులను సంప్రదించాలని సూచించారు.
"అత్యవసర హెల్ప్‌లైన్‌లపై అవగాహన "
మహిళా ఎస్‌ఐ లతీఫున్నిసా మాట్లాడుతూ.. మహిళలు వేధింపులు, సైబర్ నేరాలు లేదా ఇతర అత్యవసర పరిస్థితులు ఎదురైనప్పుడు 112, పిల్లల రక్షణ కోసం 1098, సైబర్ మోసాల కోసం 1930 హెల్ప్‌లైన్ నంబర్లను సంప్రదించి తక్షణ సహాయం పొందవచ్చని వివరించారు.
ఈ కార్యక్రమంలో కావలి టూ టౌన్ ఇన్‌స్పెక్టర్ గిరిబాబు, ఎస్‌ఐ గోపీచంద్, ఏపీఎం కృష్ణారావు, మహిళా పోలీసు సిబ్బంది అనూష, కామేశ్వరి, సాయి కుమారి, శ్రీలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.




