వెంకట్రావుపల్లిలో ‘ఖేత్ బచావో అభియాన్’: భూమి సంరక్షణపై మేకపాటి గౌతంరెడ్డి వ్యవసాయ కాలేజీ అవగాహన!
నెల్లూరు జిల్లా ఉదయగిరిలోని శ్రీ మేకపాటి గౌతంరెడ్డి వ్యవసాయ కళాశాల ఆధ్వర్యంలో వెంకట్రావుపల్లిలో భారత ప్రభుత్వ "ఖేత్ బచావో అభియాన్" కార్యక్రమం నిర్వహించారు.
ఉదయగిరి / నెల్లూరు: నెల్లూరు జిల్లా ఉదయగిరిలోని ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని శ్రీ మేకపాటి గౌతంరెడ్డి వ్యవసాయ కళాశాల ఆధ్వర్యంలో వెంకట్రావుపల్లి గ్రామంలో భారత ప్రభుత్వ "ఖేత్ బచావో అభియాన్" కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా కళాశాల కీటక శాస్త్ర విభాగాధిపతి డాక్టర్ ఎం. కిషన్ తేజ్ మాట్లాడుతూ, గత పదేళ్లుగా పెరుగుతున్న ఉష్ణోగ్రతల ప్రభావంతో వివిధ పంటల దిగుబడులు తగ్గుముఖం పట్టాయని తెలిపారు. భూమి సంరక్షణపై రైతులకు అవగాహన కల్పించి, వ్యవసాయ భూముల ఉత్పాదకతను పెంచడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యమన్నారు.డాక్టర్ ఎన్. సునీత మాట్లాడుతూ మట్టి ఉరుతనాన్ని కాపాడడం, సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించడం, నీటి వనరులను సంరక్షించడం వంటి అంశాలపై రైతులు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఆధునిక సాంకేతిక పద్ధతులను వినియోగించి పంట దిగుబడులను పెంచుకోవచ్చని తెలిపారు. పర్యావరణ సమతుల్యతను కాపాడుతూ భవిష్యత్ తరాలకు ఆహార భద్రత కల్పించడమే ఖేత్ బచావో అభియాన్ లక్ష్యమని వివరించారు.
కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి విజయ్ కుమార్, సహాయ ఆచార్యులు డాక్టర్ పి. శోభారాణి, కళాశాల అధ్యాపకులు, విద్యార్థినీ విద్యార్థులు, రైతులు హాజరయ్యారు.




