Kovur: వైద్యం కోసం సీఎం సహాయ నిధి ఎల్‌వోసీలు అందజేసిన ఎమ్మెల్యే

Kovur: కోవూరు నియోజకవర్గంలో వైద్య సహాయం కోసం సీఎం సహాయ నిధి నుంచి రూ.3.75 లక్షల ఎల్‌వోసీలు మంజూరయ్యాయి. బాధితులకు పత్రాలు అందజేసిన ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి.

V. Narasimhulu, Nellore
Published on: 7 Oct 2026 10:22 PM IST
Kovur
X

Kovur: వైద్యం కోసం సీఎం సహాయ నిధి ఎల్‌వోసీలు అందజేసిన ఎమ్మెల్యే

కోవూరు: ఆపదలో ఉన్న పేద కుటుంబాలకు వైద్య ఖర్చులు భారంగా మారకుండా ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ప్రభుత్వం అండగా నిలుస్తోందని కోవూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి తెలిపారు. కోవూరు నియోజకవర్గానికి చెందిన ఇద్దరు బాధితుల చికిత్స కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మొత్తం రూ.3.75 లక్షల విలువైన ఎల్‌వోసీలు (Letter of Credit) మంజూరయ్యాయని చెప్పారు. బుధవారం సాయంత్రం నెల్లూరులోని వీపీఆర్‌ కార్యాలయంలో బాధిత కుటుంబ సభ్యులకు ఎల్‌వోసీ పత్రాలను అందజేశారు.

"నిమ్మల మేఘనకు రూ.75 వేల ఎల్‌వోసీ"

విడవలూరు మండలం పార్లపల్లి గ్రామానికి చెందిన నిమ్మల మేఘనకు హైదరాబాద్‌లోని నిజామ్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌లో చికిత్స కోసం రూ.75 వేల విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి ఎల్‌వోసీ మంజూరైంది. చికిత్స ఖర్చులను భరించే ఆర్థిక స్థోమత లేకపోవడంతో కుటుంబ సభ్యులు ఎమ్మెల్యేని కలిసి తమ పరిస్థితిని వివరించారు. కుటుంబ పరిస్థితిని తెలుసుకున్న ఎమ్మెల్యే ఆర్థిక సాయం అందేలా ముఖ్యమంత్రి కార్యాలయానికి సిఫార్సు చేశారు. ఎమ్మెల్యే విజ్ఞప్తిపై స్పందించిన ముఖ్యమంత్రి కార్యాలయం రూ.75 వేల విలువైన ఎల్‌వోసీని మంజూరు చేసింది.

"వానపల్లి క్రాంతికి రూ.3 లక్షల సాయం"

బుచ్చిరెడ్డిపాళెం రామకృష్ణ నగర్‌కు చెందిన వానపల్లి క్రాంతికి తిరుపతి జిల్లా కరకంబాడిలోని అమరా ఆసుపత్రిలో చికిత్స కోసం రూ.3 లక్షల విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి ఎల్‌వోసీ మంజూరైంది. వైద్య ఖర్చులను భరించడం కష్టంగా ఉండటంతో కుటుంబ సభ్యులు ఎమ్మెల్యేని కలిసి సాయం కోసం విజ్ఞప్తి చేశారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే ముఖ్యమంత్రి కార్యాలయానికి సిఫార్సు చేయడంతో ఈ ఎల్‌వోసీ మంజూరైంది.

వైద్య అవసరాలను తెలుసుకుని సకాలంలో సాయం అందేలా ప్రత్యేక చొరవ తీసుకున్న ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డికి, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి బాధిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

V. Narasimhulu, Nellore

V. Narasimhulu, Nellore