Nellore: అక్రమ చెరువులు.. కఠిన చర్యలకు ఆదేశం
Nellore: కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా సాగునీటి సలహా మండలి సమావేశం.
Nellore: అక్రమ చెరువులు.. కఠిన చర్యలకు ఆదేశం
Nellore: 1973లో 3.45 T.M.C.ల సామర్థ్యం ఉన్న కనిగిరి రిజర్వాయర్ గత 50 ఏళ్లలో పూడిక కారణంగా నీటి నిల్వ సామర్థ్యాన్ని కోల్పోయిందన్నారు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి. నెల్లూరు నగరంలోని జిల్లా పరిషత్ సమావేశం మందిరంలో జరిగిన జిల్లా సాగునీటి సలహా మండలి సమావేశంలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ..
కనిగిరి రిజర్వాయర్ పునరుద్ధరణకు 48 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రికి చంద్రబాబు నాయుడుకి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం రిజర్వాయర్‌లో నీటి నిల్వలు పుష్కలంగా ఉన్నాయని రెండో పంటకు కూడా నీరు అందించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని వెల్లడించారు.
అయితే వాతావరణ శాఖ హెచ్చరిస్తున్న సూపర్ ఎల్నినో ప్రభావం వల్ల , ఈ ఏడాది తీవ్రమైన ఎండలు ఉండే అవకాశం ఉన్నందున, అధికారులు మరియు సాగునీటి సంఘ నాయకులు మరియు రైతు సంఘాల నాయకులు సమన్వయంతో పనిచేసి నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. కనిగిరి రిజర్వాయర్ నుండి రామతీర్థం వరకు ఉన్న 1 లక్ష10 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు సక్రమంగా అందాలంటే లస్కర్ల పాత్ర కీలకమని ప్రస్తుతం ఔట్ సోర్సింగ్ పద్ధతిలో పని చేస్తున్న వారికి పెండింగ్‌లో ఉన్న జీతాలను తక్షణమే విడుదల చేయాలని జిల్లా కలెక్టర్ మరియు ఇరిగేషన్ ఉన్నతాధికారులను కోరారు. సంగం బ్యారేజ్ ఆధునీకరణ నేపథ్యంలో కనిగిరి మెయిన్ కెనాల్ ద్వారా రిజర్వాయర్‌కు ధామాషా ప్రకారం నీటి కేటాయింపులు జరగాలని డిమాండ్ చేశారు.
మరోవైపు, సాగునీటి కాలువల వెంబడి అక్రమంగా చేపల చెరువులు ఏర్పాటు చేసి, కలుషిత నీటిని కాలువల్లోకి వదలడంపై ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనివల్ల సాగునీటి నాణ్యత దెబ్బతింటోందని ఇటువంటి అక్రమ చర్యలపై జిల్లా యంత్రాంగం కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. జిల్లాలో నీటి పన్ను వసూళ్లపై రెవెన్యూ యంత్రాంగం నిర్లక్ష్యం వహిస్తోందని ఆమె అసహనం వ్యక్తం చేశారు. దాదాపు 38 కోట్ల బకాయిలు ఉండగా కేవలం 2 కోట్ల 88 వేల రూపాయలు మాత్రమే వసూలయ్యాయని నీటి పన్ను వసూళ్లను వేగవంతం చేసేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి కోరారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్, మంత్రి ఆనం రామనారాయణ రెడ్డితో పాటు ఇరిగేషన్ అధికారులు, పెన్నా డెల్టా ఛైర్మెన్ జెట్టి రాజగోపాల్ రెడ్డి జిల్లాలోని ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.




