Nellore: తరం మార్చే శక్తిగా యువతులు నిలవాలి: వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

Nellore: నెల్లూరులో ఏబీవీపీ ‘ధీరనారి’ సమ్మేళనంలో కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పాల్గొని, మార్కులు తగ్గితే నిరాశ చెందవద్దని విద్యార్థినులకు సూచించారు.

U.L. NARASIMHULU, NELLORE
Published on: 6 Oct 2026 8:12 PM IST
Nellore
X

Nellore: తరం మార్చే శక్తిగా యువతులు నిలవాలి: వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

Kovur: చదువులో మార్కులు తగ్గాయని క్షణికావేశంలో నిరాశకు లోనై తీవ్ర నిర్ణయాలు తీసుకోవద్దని విద్యార్థినులకు కోవూరు శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి సూచించారు. ప్రతి సమస్యకూ ఒక పరిష్కారం ఉంటుందని, కష్టాలు ఎదురైనప్పుడు వాటిని ఒంటరిగా భరించకుండా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, స్నేహితులతో పంచుకోవాలని చెప్పారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్‌ (ఏబీవీపీ) ఆధ్వర్యంలో నెల్లూరు టౌన్‌హాలు వీఆర్‌సీలో మంగళవారం నిర్వహించిన ‘ధీరనారి యువతీ సమ్మేళనం’లో ప్రశాంతి రెడ్డి ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థినులను ఉద్దేశించి ప్రసంగించారు.

"కష్టాన్ని పంచుకుంటే పరిష్కారం"

ప్రతి సమస్యకూ ఒక పరిష్కారం ఉంటుందని, కష్టం ఎదురైనప్పుడు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, స్నేహితులతో మనసు విప్పి మాట్లాడాలని ఎమ్మెల్యే సూచించారు. మార్కులు తగ్గినంత మాత్రాన జీవితంలో ఏమీ కోల్పోయినట్లు భావించాల్సిన అవసరం లేదని, చదువు ఒకరికి సులభంగా వస్తే మరొకరికి కష్టంగా ఉండొచ్చని, అంతమాత్రాన నిరాశ చెందాల్సిన పనిలేదని అన్నారు. జీవితం వేరు.. జీవనం వేరు అని చెబుతూ, భగవంతుడు ఇచ్చిన జీవితాన్ని సార్థకం చేసుకోవాలని సూచించారు. తమ పిల్లలను కష్టపడి పెంచుతూ తల్లిదండ్రులు ఎన్నో కలలు కంటారని, వారి ఆశలను ఎప్పుడూ వమ్ము చేయకూడదని విద్యార్థినులను కోరారు.

"తరం మార్చే యువతిగా ఎదగాలి"

సమ్మేళనం నినాదమైన ‘తలవంచేది కాదు.. తరం మార్చేది యువతి’ అనే సందేశాన్ని ఎమ్మెల్యే గారు తనదైన శైలిలో వివరించారు. అవసరం లేని చోట ఎవరికీ తలవంచకుండా ఆత్మగౌరవంతో నిలబడాలని, అదే సమయంలో కుటుంబ బంధాల్లో సర్దుకుపోయే సంస్కారం, పెద్దలను గౌరవించే గుణం కూడా ఉండాలని చెప్పారు. ఆడపిల్లల్లో ఆత్మవిశ్వాసం ఇంటి నుంచే, ముఖ్యంగా తల్లి నుంచే ప్రారంభం కావాలని అన్నారు. ‘నువ్వు ఏదైనా సాధించగలవు’ అనే నమ్మకాన్ని తల్లిదండ్రులు చిన్ననాటి నుంచే పిల్లల్లో నింపాలని ఆకాంక్షించారు. ఇంట గెలిచి రచ్చ గెలవాలన్న మాటను గుర్తుచేస్తూ, ఉద్యోగం, ఉన్నత స్థానం సాధించడంతో పాటు కుటుంబాన్ని చక్కగా తీర్చిదిద్దడం కూడా మహిళ జీవితంలో ముఖ్యమైన విజయమేనని చెప్పారు. నైతిక విలువలతో కూడిన బిడ్డలను సమాజానికి, దేశానికి అందించినప్పుడే ప్రతి తల్లి, ప్రతి మహిళ నిజమైన విజయాన్ని సాధించినట్టవుతుందని అన్నారు.

"జెన్‌జీలలో సేవా దృక్పథం"

ఇటీవల పలు కళాశాలల్లో విద్యార్థులతో మాట్లాడినప్పుడు వారి ఆలోచనా విధానం, తమ భవిష్యత్తుపై ఉన్న స్పష్టత తనను ఎంతో ఆకట్టుకున్నాయని ఎమ్మెల్యే చెప్పారు. తమకేం కావాలో స్పష్టంగా తెలుసుకున్న నేటి తరం, వైద్యులు, ఇంజినీర్లు కావాలనే సంప్రదాయ లక్ష్యాలతో పాటు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని, విభిన్న రంగాల్లో రాణించాలని లక్ష్యాలు పెట్టుకుంటోందన్నారు. కొందరు విద్యార్థులు తమ వ్యక్తిగత అవసరాల కోసం కాకుండా, ‘మా ఊరికి ఇది లేదు మేడమ్‌.. మా ఊరికి అది లేదు మేడమ్‌’ అంటూ తమ గ్రామాల సమస్యలను ప్రస్తావిస్తున్నారని చెప్పారు. చిన్న వయసులోనే సమాజం కోసం ఆలోచిస్తూ ప్రజాసేవ పట్ల ఆసక్తి చూపుతున్న నేటి యువతను అభినందించాల్సిన అవసరం ఉందన్నారు.

"ఓటమికి చోటివ్వకండి"

జీవితంలో ఎక్కడైనా ఎదురుదెబ్బ తగిలినా వెనక్కి తగ్గకుండా మళ్లీ మళ్లీ ప్రయత్నించాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ‘ఓడిపోతాం’ అనే ఆలోచనకు చోటివ్వకుండా, ‘ఇది కాకపోతే ఇంకొకటి’ అనే సానుకూల దృక్పథంతో ముందుకు సాగాలని సూచించారు. అంకితభావం, పట్టుదల, క్రమశిక్షణతో లక్ష్యాన్ని చేరుకునేందుకు నిరంతరం కృషి చేస్తే విజయం తప్పక సాధ్యమవుతుందని అన్నారు. మీరే దేశ భవిష్యత్తు అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని, ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవంతో ఉన్నత లక్ష్యాలను ఎంచుకుని ముందుకు సాగాలని విద్యార్థినులకు సూచించారు. కార్యక్రమానికి తనను ఆహ్వానించిన ఏబీవీపీ నిర్వాహకులకు ఎమ్మెల్యే ధన్యవాదాలు తెలిపారు.

U.L. NARASIMHULU, NELLORE

U.L. NARASIMHULU, NELLORE