Kovur: 7 రోజుల పసిపాప చికిత్సకు రూ.3.51 లక్షల సీఎంఆర్‌ఎఫ్ సాయం!
Kovur: 7 రోజుల పసిపాప ప్రాణాలను కాపాడేందుకు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి చొరవతో రూ.3.51 లక్షల సీఎంఆర్‌ఎఫ్ ఎల్‌వోసీ మంజూరైంది.
Kovur: 7 రోజుల పసిపాప చికిత్సకు రూ.3.51 లక్షల సీఎంఆర్‌ఎఫ్ సాయం!
Kovur: ఆర్థిక ఇబ్బందులతో వైద్యం చేయించుకోలేని నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) అండగా నిలుస్తోందని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం విజయవాడ, తాడేపల్లిలో విడవలూరు మండలం, ఊటుకూరు పంచాయతీ, కంచరపాలెం గ్రామానికి చెందిన పామర్తి రూప అనే మహిళ కుమార్తె 7 రోజుల పసిపాప చికిత్స కోసం రూ.3,51,847 విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి ఎల్‌ఓసీ (Letter of Credit)ను కోవూరు ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి స్వయంగా అందజేశారు.
పసిపాప తక్కువ బరువుతో, పూర్తిస్థాయి ఎదుగుదల లేక తీవ్ర ఆరోగ్య సమస్యతో బాధపడుతోంది. పాపను కాపాడుకునేందుకు సుమారు 2 నుంచి 3 నెలల పాటు ఆస్పత్రిలోని ఐసీయూ (ఇన్క్యుబేటర్/బాక్స్)లో ఉంచి చికిత్స అందించాల్సి ఉందని వైద్యులు తెలిపారు. నెల్లూరులోని కిమ్స్ (KIMS) ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఈ చిన్నారికి వైద్య ఖర్చులు భారీగా కానుండటంతో, అంత మొత్తం భరించే స్థోమత లేక కుటుంబ సభ్యులు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ని ఆశ్రయించారు.
కుటుంబ పరిస్థితిని, ఆ పసికందు ఆరోగ్య తీవ్రతను చూసి తక్షణమే స్పందించిన ఎమ్మెల్యే గారు, ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్థిక సాయం అందించాలని ముఖ్యమంత్రి కార్యాలయానికి సిఫార్సు చేశారు. ఎమ్మెల్యే విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి కార్యాలయం, పాప చికిత్స కోసం రూ.3,51,847 విలువైన సీఎంఆర్‌ఎఫ్ లెటర్ ఆఫ్ క్రెడిట్ (LOC)ను మంజూరు చేసింది.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి మాట్లాడుతూ, నియోజకవర్గంలోని నిరుపేదలకు మెరుగైన వైద్యం అందేలా ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలుస్తుందన్నారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా వైద్య చికిత్సకు దూరమవుతున్న అర్హులైన పేదలు ముఖ్యమంత్రి సహాయ నిధిని వినియోగించుకోవాలని సూచించారు.
నియోజకవర్గ ప్రజలకు అవసరమైన ప్రతి సందర్భంలోనూ తమ వంతు సహకారం అందిస్తామని తెలిపారు. తమ 7 రోజుల పాప ప్రాణాలు కాపాడేందుకు అండగా నిలిచి, సీఎంఆర్‌ఎఫ్ ద్వారా సకాలంలో ఆర్థిక సాయం అందేలా ప్రత్యేక చొరవ తీసుకున్న కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డికి, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి బాధిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.




