Nellore: నెల్లూరులో ఘనంగా కృష్ణ చైతన్య స్పోర్ట్స్ మీట్ - ప్రారంభించిన ఎమ్మెల్సీ!

Nellore: నెల్లూరు ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో ఘనంగా కృష్ణ చైతన్య జూనియర్ కళాశాలల స్పోర్ట్స్ మీట్ ప్రారంభం. పర్యావరణ పరిరక్షణపై 2 వేల మంది విద్యార్థులతో భారీ ర్యాలీ.

A Praveen, Nellore
Published on: 26 Sept 2026 12:53 PM IST
Nellore
X

Nellore: నెల్లూరులో ఘనంగా కృష్ణ చైతన్య స్పోర్ట్స్ మీట్ - ప్రారంభించిన ఎమ్మెల్సీ!

Nellore: కృష్ణ చైతన్య జూనియర్ కళాశాలల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్పోర్ట్స్ మీట్ శనివారం నెల్లూరు ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో కోలాహలంగా ప్రారంభమైంది. నాలుగు రోజుల పాటు 4,500 మందికి పైగా విద్యార్థుల భాగస్వామ్యంతో వివిధ క్రీడా పోటీలు జరగనున్నాయి. క్రీడోత్సవాల్లో భాగంగా పర్యావరణ కాలుష్యంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు సుమారు 2 వేల మంది విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించారు.

కేవీఆర్ పెట్రోల్ బంక్ నుంచి ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం వరకు సాగిన ర్యాలీలో విద్యార్థులు పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన నినాదాలు, ప్లకార్డులతో ప్రజలకు అవగాహన కల్పించారు. ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, కృష్ణ చైతన్య విద్యాసంస్థల డైరెక్టర్ పర్వతరెడ్డి రాణా ప్రమోద్ రెడ్డితో పాటు విద్యార్థులు, అధ్యాపక సిబ్బంది ర్యాలీలో పాల్గొన్నారు.

అనంతరం ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో జరిగిన స్పోర్ట్స్ మీట్ ప్రారంభోత్సవానికి కృష్ణ చైతన్య విద్యాసంస్థల వ్యవస్థాపకులు డాక్టర్ ఆర్.వి. కృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎన్‌సీసీ విద్యార్థులు అతిథులకు ఘన స్వాగతం పలికి గౌరవ వందనం సమర్పించారు. అనంతరం ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి క్రీడాజ్యోతిని వెలిగించి స్పోర్ట్స్ మీట్‌ను అధికారికంగా ప్రారంభించారు.

క్రీడా పోటీలను ప్రారంభించిన అనంతరం ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి, డైరెక్టర్ రాణా ప్రమోద్ రెడ్డి విద్యార్థులతో కలిసి సరదాగా క్రికెట్ ఆడి వారిని ఉత్సాహపరిచారు. దీంతో స్టేడియం సందడి వాతావరణాన్ని సంతరించుకుంది.

ఈ సందర్భంగా డాక్టర్ ఆర్.వి. కృష్ణారెడ్డి మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడంతో పాటు క్రీడలకు కూడా సముచిత ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. విద్యార్థుల్లో క్రీడా స్ఫూర్తిని పెంపొందించేందుకు ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో ఇంటర్ కళాశాలల స్థాయిలో స్పోర్ట్స్ మీట్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. గెలుపోటములను సమానంగా స్వీకరిస్తూ క్రీడాస్ఫూర్తితో పోటీల్లో పాల్గొనాలని విద్యార్థులకు సూచించారు. స్పోర్ట్స్ మీట్‌ను సద్వినియోగం చేసుకుని జిల్లా, రాష్ట్ర స్థాయిలో ప్రతిభ చాటి కళాశాలకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.

ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ కృష్ణ చైతన్య విద్యాసంస్థలు 28 సంవత్సరాలు పూర్తి చేసుకుని విద్యారంగంలో ముందుకు సాగుతున్నాయని అన్నారు. విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు, ఇతర కో-కరిక్యులర్ కార్యకలాపాల్లో ప్రోత్సాహం అందించడం అభినందనీయమన్నారు. కృష్ణ చైతన్య విద్యాసంస్థల విద్యార్థులు విద్యతో పాటు క్రీడల్లోనూ రాష్ట్రస్థాయిలో గుర్తింపు సాధించడం సంతోషకరమన్నారు.

పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు 2 వేల మంది విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించడం అభినందనీయమని చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. పర్యావరణ పరిరక్షణపై ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. కృష్ణ చైతన్య విద్యాసంస్థలు భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.

కార్యక్రమంలో కృష్ణ చైతన్య విద్యాసంస్థల డీన్ రామాంజనేయులు రెడ్డి, అకాడమిక్ డీన్ రాంగోపాల్ రెడ్డి, అడ్మిన్ డీన్ పాయసం రమేష్, కళాశాలల ప్రిన్సిపాళ్లు, అధ్యాపక సిబ్బంది, ఎన్‌సీసీ విద్యార్థులు, పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.

A Praveen, Nellore

A Praveen, Nellore