Sullurpeta: సూళ్ళూరుపేటలో తప్పిన భారీ ప్రమాదం!

Sullurpeta: వై జంక్షన్ వద్ద వీచిన ఈదురుగాలులకు విరిగిపడిన భారీ ఫ్లెక్సీ. అధికారుల నిర్లక్ష్యంపై స్థానికుల ఆగ్రహం మరియు తప్పిన పెను ప్రమాదం. పూర్తి వివరాలు.

KKV Sudhakar, Sullurupeta
Published on: 30 Aug 2026 10:37 AM IST
Sullurpeta
X

Sullurpeta: సూళ్ళూరుపేటలో తప్పిన భారీ ప్రమాదం!

Sullurpeta: తిరుపతి జిల్లా సూళ్ళూరుపేట పట్టణంలోని అత్యంత రద్దీగా ఉండే ప్రధాన వై జంక్షన్ వద్ద ప్రమాదకరంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ కింద భాగం విరిగి పడిపోవడంతో పెద్ద ప్రమాదం శృతిలో తప్పింది. నిత్యం వాహనాలు, ప్రజల రాకపోకలతో కిక్కిరిసిపోయే ఈ ప్రాంతంలో ఎలాంటి భద్రతా ప్రమాణాలు పాటించకుండా, కేవలం బలహీనమైన కర్రలతో సపోర్టు పెట్టి ఈ భారీ ఫ్లెక్సీని కట్టడం గమనార్హం.

​అకస్మాత్తుగా వీచిన ఈదురుగాలుల ధాటికి సపోర్టుగా ఉన్న కర్రలు తట్టుకోలేక, ఫ్లెక్సీ కింద భాగం ఒక్కసారిగా విరిగి రహదారిపై పడిపోయింది. నిత్యం క్షణం తీరిక లేకుండా ఉండే ఈ కూడలిలో, ఆ సమయంలో అదృష్టవశాత్తూ వాహనదారులు, కాలినడకన వెళ్లే ప్రజలు ఎవరూ విరిగిపడిన భాగం కింద లేకపోవడంతో పెద్ద ముప్పు తప్పిందని స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. లేకపోతే వేగంగా వచ్చే బైకర్లు లేదా బాటసారులపై ఆ విరిగిన కర్రలు, ఫ్లెక్సీ పడి తీవ్ర గాయాలయ్యేవని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

​అంతటి రద్దీ ప్రాంతంలో మున్సిపల్ అధికారుల పర్యవేక్షణ పూర్తిగా లోపించడం వల్లే ఇలాంటి నిర్లక్ష్యపు కట్టడాలు వెలుస్తున్నాయని స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిత్యం వేలాది మంది సంచరించే ప్రధాన కూడలిలో బలహీనమైన కర్రలతో ప్రమాదకరంగా ఫ్లెక్సీలు కడుతుంటే అధికారులు ఎలా చూసీచూడనట్లు వదిలేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు.

​ఇలాంటి రద్దీ ప్రాంతాల్లో గాలికి విరిగిపోకుండా ఇనుప ఫ్రేమ్‌లు, బలమైన స్ట్రక్చర్లతో మాత్రమే ఫ్లెక్సీలు ఏర్పాటు చేసేలా అధికారులు స్పష్టమైన నిబంధనలు అమలు చేయాలని ప్రజలు కోరుతున్నారు.

KKV Sudhakar, Sullurupeta

KKV Sudhakar, Sullurupeta

Next Story