Manubolu: మనుబోలులో ఘనంగా ‘పల్లె వీక్షణ’ కార్యక్రమం

Manubolu: మనుబోలులో కలెక్టర్ హిమాన్షు శుక్లా, ఎమ్మెల్యే సోమిరెడ్డి ఆధ్వర్యంలో పల్లె వీక్షణ. ప్రజల సమస్యల గుర్తింపు, అభివృద్ధి పనులపై సమీక్ష.

V. Narasimhulu, Nellore
Updated on: 13 Aug 2026 10:55 PM IST
Manubolu
X

Manubolu: మనుబోలులో ఘనంగా ‘పల్లె వీక్షణ’ కార్యక్రమం

మనుబోలు: ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు గ్రామస్థాయిలో సక్రమంగా అమలవుతున్నాయా? ప్రజలకు ప్రభుత్వ సేవలు పూర్తిస్థాయిలో అందుతున్నాయా? క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు ఏమిటి? అనే అంశాలను ప్రత్యక్షంగా పరిశీలించి, ప్రజా సమస్యలకు తక్షణ పరిష్కారం చూపే లక్ష్యంతో జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా ఆధ్వర్యంలో గురువారం మనుబోలు మండల కేంద్రంలో పల్లె వీక్షణ కార్యక్రమం నిర్వహించారు.

సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, జిల్లా అధికార యంత్రాంగం పాల్గొని గ్రామంలోని వివిధ ప్రభుత్వ సంస్థలు, అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో పరిశీలించడంతో పాటు ప్రజలతో ముఖాముఖిగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా మాట్లాడుతూ..

ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు గ్రామస్థాయిలో సక్రమంగా అమలవుతున్నాయో లేదో స్వయంగా పర్యవేక్షించడమే పల్లె వీక్షణ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమన్నారు. ఇందులో భాగంగా పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు, సబ్‌ సెంటర్లు, ఆర్‌ఎస్‌కే కేంద్రాలు, స్వర్ణ గ్రామ కార్యాలయాలను పరిశీలించి వాటి పనితీరును తనిఖీ చేసినట్లు తెలిపారు. అధికారులు సమయపాలన పాటిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండేలా చూడాలని సూచించారు.

జలధార–జలహారతి కార్యక్రమాన్ని ‘వీబీజీ రామ్‌జీ’ కార్యక్రమంతో సమన్వయం చేసుకుని ఫీడర్ ఛానల్స్, కాలువల్లో పేరుకుపోయిన పూడిక, పాచి తొలగింపు పనులు చేపడుతున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఇందులో భాగంగా మనుబోలు ట్యాంక్ పరిధిలో దాదాపు 72 వేల పనిదినాలు మంజూరు చేసినట్లు చెప్పారు. నీటి వనరులను సమర్థవంతంగా వినియోగించుకునేలా అవసరమైన చర్యలు చేపడుతున్నామని తెలిపారు.

ఎల్‌నినో ప్రభావంతో రాబోయే రోజుల్లో నీటి ఎద్దడి ఏర్పడే అవకాశం ఉన్నందున రైతులు భూములను ఖాళీగా ఉంచకుండా ప్రత్యామ్నాయ, పాడి పంటలు సాగు చేసేలా వ్యవసాయ శాఖ ద్వారా ‘ఛాంపియన్ ఫార్మర్స్’తో రైతులకు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు. పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ‘ట్రిపుల్ ఎస్‌’ (SSS) కార్యక్రమం కింద పాడి ఉత్పాదకతను పెంచుకునే విధానాలపై రైతులకు అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు.

మనుబోలు ప్రాంతంలో భారీ శ్యామ్ స్టీల్ తయారీ పరిశ్రమ ఏర్పాటు కానుందని కలెక్టర్ తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రత్యేక చొరవతో పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఈ సంస్థ ఇక్కడికి రావడం జరిగిందన్నారు. పరిశ్రమ ఏర్పాటుకు అవసరమైన భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేసేందుకు జాయింట్ కలెక్టర్ ను నియమించినట్లు చెప్పారు. రైతులతో మాట్లాడి చిన్నచిన్న భూ సమస్యలను పరిష్కరిస్తూ భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేస్తామని తెలిపారు.

స్థానిక యువతకు శిక్షణ ఇచ్చి పరిశ్రమలో ఉపాధి అవకాశాలు కల్పించేందుకు శ్యామ్ స్టీల్ యాజమాన్యంతో చర్చించినట్లు కలెక్టర్ చెప్పారు. సంస్థ నిధులతోనే స్థానికంగా స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ ఏర్పాటు చేసే ప్రతిపాదన ఉందన్నారు.

పాడుబడిన అండర్ టన్నెల్ (యూటీ) పునరుద్ధరణకు రూ.1.67 కోట్లు మంజూరు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. ఈ పనులు పూర్తయితే దాదాపు 10 వేల ఎకరాలకు, సుమారు 5 వేల మంది రైతులకు సాగునీటి ప్రయోజనం చేకూరుతుందని చెప్పారు. దేవుడిగుడి–బండిపల్లి కాలువకు సంబంధించి మిగిలిన పనులను కూడా త్వరలో పూర్తి చేస్తామని వెల్లడించారు.

పల్లె వీక్షణలో ప్రజల నుంచి వచ్చిన పింఛన్లు, ఇళ్ల నిర్మాణం, ‘తల్లికి వందనం’ తదితర వ్యక్తిగత సమస్యలను కలెక్టర్ స్వయంగా తెలుసుకున్నారు. సాంకేతిక కారణాలతో ఆగిపోయిన సమస్యలను గుర్తించి క్షేత్రస్థాయి వెంటనే పరిష్కరించేలా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.

ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ..

సోమశిల, సంగం బ్యారేజీ నుంచి బండేపల్లి వరకు దాదాపు 120 కిలోమీటర్ల పొడవునా ఉన్న కాలువ వ్యవస్థ ద్వారా 20 వేల ఎకరాలకు పైగా సాగునీరు అందాల్సి ఉందన్నారు. అయితే మధ్యలో ఉన్న వివిధ మండలాల రైతులు నీటిని వినియోగించుకోవడం వల్ల చివరి ఆయకట్టైన బండేపల్లి రైతులకు తీవ్ర నీటి కొరత ఏర్పడుతోందన్నారు.

ఈ సమస్యకు శాశ్వత పరిష్కారంగా కండలేరు రిజర్వాయర్ నుంచి నేరుగా నీటిని మళ్లించి బండేపల్లి ఆయకట్టును స్థిరీకరించవచ్చని ఎమ్మెల్యే సూచించారు. దీనివల్ల నీటి ప్రవాహ దూరం, సమయం చాలా తగ్గుతుందని తెలిపారు. గతంలో రూ.40 కోట్ల మేర భూసేకరణ, ఇతర పనులకు మంజూరు జరిగినప్పటికీ ప్రాజెక్టు ఆలస్యమైందన్నారు. ఈ పనులను త్వరగా పునరుద్ధరించి పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌తో పాటు ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు.

శ్యామ్ స్టీల్ పరిశ్రమ పరిసర ప్రాంతాల్లోని స్థానిక రైతులకు సంబంధించిన భూములు, పట్టా సమస్యలను కూడా ఎమ్మెల్యే ప్రస్తావించారు. పరిశ్రమ యాజమాన్యం, రెవెన్యూ అధికారులు, రైతులతో కలిసి ఒక ఉమ్మడి సమావేశం ఏర్పాటు చేసి భూసేకరణ, నీటి ముంపు సమస్యలను పరిష్కరించాలని సూచించారు. రైతులకు ఇబ్బందులు లేకుండా సమస్యలను పరిష్కరించడంతో పాటు పరిశ్రమ ఏర్పాటుకు సహకరించాలని కోరారు.

గత ప్రభుత్వం కేటాయించిన జగనన్న కాలనీల్లో 1.5 నుంచి 2 సెంట్ల వరకు, అంటే 9 అంకణాల మేర ఉన్న నివేశన స్థలాలు ఇల్లు, మరుగుదొడ్డి నిర్మించుకోవడానికి కూడా సరిపోవని ఎమ్మెల్యే పేర్కొన్నారు. కేటాయించిన స్థలాల్లో దాదాపు 80 శాతం వరకు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. కొందరు వ్యక్తులు అక్రమంగా ఐదు, ఆరు పట్టాలు పొందిన కేసులు కూడా ఉన్నాయని పేర్కొన్నారు.

ఈ అంశాలపై ఎంఆర్‌ఓలు, ఆర్డీఓల ద్వారా సమగ్ర విచారణ జరిపించాలని సోమిరెడ్డి కోరారు. అర్హులైన పేదలకు న్యాయంగా స్థలాలను పునఃకేటాయించాలని, వీలైతే ఒక్కొక్కరికి 2 నుంచి 3 సెంట్ల వరకు స్థలం అందించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

గత ప్రభుత్వంలో ‘ఆప్షన్–3’ కింద కాంట్రాక్టర్ల ద్వారా నిర్మించిన ఇళ్ల నాణ్యత చాలా పేలవంగా ఉందని ఎమ్మెల్యే ఆందోళన వ్యక్తం చేశారు. కొన్ని ఇళ్ల బేస్‌మెంట్లు కూడా బలహీనంగా ఉన్నాయని తెలిపారు. నెల్లూరు జిల్లాలో నివాస గృహాల నిర్మాణానికి సంబంధించిన అక్రమాలపై జరిగిన విజిలెన్స్ విచారణలో దాదాపు రూ.110 కోట్ల అవినీతి జరిగినట్లు తేలిందని పేర్కొన్నారు.

నిబంధనలు పాటించని కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలని, బలహీనంగా ఉన్న బేస్‌మెంట్లను బలోపేతం చేసి ఎస్సీ, ఎస్టీ, పేద లబ్ధిదారులకు నాణ్యమైన ఇళ్లు అందేలా చూడాలని కోరారు.

పీజీఆర్‌ఎస్, పల్లె వీక్షణ వంటి కార్యక్రమాల ద్వారా ప్రజల నుంచి వచ్చే అర్జీలు, ఫిర్యాదులపై తక్షణమే స్పందిస్తూ సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్న జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా పనితీరును ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అభినందించారు. ప్రజా సమస్యలను క్షేత్రస్థాయిలోనే గుర్తించి పరిష్కరించేందుకు జిల్లా యంత్రాంగం చేస్తున్న కృషిని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

V. Narasimhulu, Nellore

V. Narasimhulu, Nellore

Next Story