Nellore: నెల్లూరులో భారీ మెగా రుణమేళా నిర్వహించాలి: ఎంపీ వేమిరెడ్డి!
Nellore: నెల్లూరు జిల్లాలో నరసరావుపేట తరహాలో భారీ మెగా రుణమేళా నిర్వహించాలని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి బ్యాంకర్లకు సూచించారు.
Nellore: నెల్లూరులో భారీ మెగా రుణమేళా నిర్వహించాలి: ఎంపీ వేమిరెడ్డి!
నెల్లూరు: రుణమేళా నిర్వహణకు ఎంపీగా పూర్తి సహకారం అందిస్తామని చెప్పారు నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి... 2025-26లో 128 శాతంతో జిల్లా బ్యాంకర్ల బృందం పనితీరు అభినందనీయం అని అన్నారు ఎంపీ వేమిరెడ్డి.
నెల్లూరు జిల్లాలో ప్రజలకు బ్యాంకింగ్ సేవలు, కేంద్ర ప్రభుత్వ పథకాల సబ్సిడీలను మరింత దగ్గర చేసేందుకు మెగా రుణమేళా నిర్వహించాలని నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, జిల్లా యంత్రాంగానికి సూచించారు. బ్యాంకులు, నాబార్డ్, ప్రభుత్వ శాఖలు కలిసి పనిచేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. మంగళవారం నెల్లూరు కలెక్టరేట్‌లో కలెక్టర్ హిమాన్షు శుక్లా అధ్యక్షతన జరిగిన జిల్లా సంప్రదింపుల కమిటీ (DCC), జిల్లా స్థాయి సమీక్షా కమిటీ (DLRC) సమావేశంలో ఎంపీ మాట్లాడారు.
"పల్నాడు జిల్లా నరసరావుపేట తరహాలో నెల్లూరులో మెగా రుణమేళా"
నరసరావుపేట పార్లమెంట్ నియోజకవర్గంలో నిర్వహించిన క్రెడిట్ అవుట్‌రీచ్ ప్రోగ్రామ్ ద్వారా 1.04 లక్షల మందికి పైగా లబ్ధిదారులకు రూ.3,216 కోట్ల విలువైన రుణాలు, సబ్సిడీలు ఒకే రోజు అందజేశారని ఎంపీ గుర్తుచేశారు. అదే స్థాయిలో నెల్లూరు జిల్లాలో కూడా అర్హులైన ప్రజలకు గరిష్ఠంగా మేలు జరిగేలా ఒక కార్యక్రమానికి ప్రణాళిక సిద్ధం చేయాలని కలెక్టర్ హిమాన్షు శుక్లాని, బ్యాంకర్లను కోరారు. అధికారులు, బ్యాంకర్లు చర్చించుకుని స్పష్టమైన కార్యాచరణ రూపొందించుకోవాలన్నారు.
"టార్గెట్‌ను మించి పనిచేస్తున్న జిల్లా బృందం"
జిల్లాలో బ్యాంకింగ్ రంగం చూపిస్తున్న పురోగతిని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అభినందించారు. గతేడాది 128 శాతం పనితీరు కనబరిచారని, ఈ ఏడాది కూడా నిర్దేశించిన లక్ష్యాల కంటే ఎక్కువే సాధిస్తున్నారని కొనియాడారు. ఈ పనితీరు చూస్తుంటే రుణమేళాను కూడా అత్యంత విజయవంతంగా నిర్వహించగలరనే నమ్మకం ఉందన్నారు.
"ఎంపీగా నా వంతు పూర్తి సహకారం"
పార్లమెంట్ ఫైనాన్స్ కమిటీ సభ్యుడిగా ఉన్నందున ఈ రుణమేళా నిర్వహణకు కావాల్సిన ప్రయోజనాలను, అనుమతులను సాధించడంలో ఎంపీగా పూర్తి సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమాన్ని కేవలం ప్రభుత్వ బాధ్యతగా కాకుండా మన జిల్లా ప్రజలకు ఆర్థికంగా అండగా నిలిచే గొప్ప అవకాశంగా చూడాలని, మన తోటి సోదర సోదరీమణులకు మంచి చేస్తున్నామనే భావనతో ప్రతి అధికారీ పనిచేయాలని తెలిపారు.
కార్యక్రమంలో జాయింట్ కలెక్టరు మొగిలి వెంకటేశ్వర్లు, లీడ్ బ్యాంక్ డిస్ట్రిక్ట్ మేనేజర్ (ఎల్.డి.ఎం) మణిశేఖర్, నాబార్డ్ డిస్ట్రిక్ట్ డెవలప్‌మెంట్ మేనేజర్ (డి.డి.ఎం) డాక్టర్ బాబు , 27 బ్యాంకుల జిల్లా కోఆర్డినేటర్లు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.




