Atmakur: భగ్గుమన్న మేకపాటి డీఎస్సీపై.. సీబీఐ విచారణకు డిమాండ్!

Atmakur: ఆత్మకూరులో డీఎస్సీ క్రీడా కోటా అక్రమాలపై మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్‌ఆర్‌సీపీ భారీ నిరసన ర్యాలీ చేపట్టింది.

TS Murthy, Atmakuru(Nellore)
Published on: 10 Aug 2026 11:43 PM IST
Atmakur
X

Atmakur: భగ్గుమన్న మేకపాటి డీఎస్సీపై.. సీబీఐ విచారణకు డిమాండ్!

ఆత్మకూరు: గత ఏడాది రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన డీఎస్సీలో క్రీడాకారుల కోటా కింద ఉపాధ్యాయుల నియామకాల్లో అనేక అవకతవకలు జరిగాయని, వీటిపై సమగ్రంగా సీబీఐ విచారణ చేపట్టాలని మాజీ ఎమ్మెల్యే, వైసీపీ ఆత్మకూరు నియోజకవర్గ సమన్వయకర్త మేకపాటి విక్రమ్‌రెడ్డి డిమాండ్ చేశారు. విచారణ పూర్తయ్యే వరకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ పదవికి రాజీనామా చేసి పక్కకు తప్పుకోవాలని కోరారు. డీఎస్సీ క్రీడా కోటా నియామకాల్లో చోటుచేసుకున్న అక్రమాలపై ప్రభుత్వం స్పందించకపోవడాన్ని నిరసిస్తూ పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నెల్లూరు జిల్లా ఆత్మకూరులో నాలుగు రోజులపాటు నిర్వహించిన రిలే నిరాహార దీక్షల అనంతరం సోమవారం మున్సిపల్‌ బస్టాండ్‌ నుంచి ఆర్డీవో కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.

ర్యాలీకి ముందస్తు అనుమతులు తీసుకున్నామని వైఎస్సార్‌సీపీ నాయకులు తెలిపారు. తొలుత మేకపాటి విక్రమ్‌రెడ్డి, మాజీ జెడ్పీ చైర్మన్‌ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి బస్టాండ్‌ ఆవరణలోని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో కలిసి ర్యాలీ ప్రారంభించారు. భారీ సంఖ్యలో ప్రజలు, పార్టీ శ్రేణులు ర్యాలీలో పాల్గొనడంతో బస్టాండ్‌ పరిసరాల్లో సందడి నెలకొంది.

ర్యాలీ కొంతదూరం సాగిన అనంతరం జేఆర్‌పేట వద్ద పోలీసులు అడ్డుకున్నారు. ర్యాలీకి అనుమతి లేదంటూ పోలీసులు నిలిపివేయడంతో నాయకులు, పోలీసుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ముందస్తుగా అనుమతులు ఉన్నప్పటికీ ర్యాలీని ఎందుకు అడ్డుకుంటున్నారని నాయకులు పోలీసులను ప్రశ్నించారు. శాంతియుతంగా ఆర్డీవో కార్యాలయానికి వెళ్లి వినతిపత్రం సమర్పించేందుకు కూడా అనుమతించకపోవడం ఏమిటని నిలదీశారు.

పోలీసుల తీరును నిరసిస్తూ మేకపాటి విక్రమ్‌రెడ్డి, బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి, మహిళా నాయకులు, కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించారు. ఎండ తీవ్రంగా ఉన్నప్పటికీ నాయకులు, మహిళలు రోడ్డుపై కూర్చొని ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మేకపాటి విక్రమ్‌రెడ్డి మాట్లాడుతూ డీఎస్సీపై సీబీఐ విచారణకు ప్రభుత్వం ఎందుకు భయపడుతోందని ప్రశ్నించారు. అక్రమాలు జరగలేదని ప్రభుత్వం భావిస్తే స్వతంత్ర దర్యాప్తుకు ఎందుకు వెనుకాడుతోందని నిలదీశారు.

డీఎస్సీ క్రీడాకారుల కోటాలో నియామకాలకు కొత్త జీవోలు తీసుకువచ్చి అక్రమాలకు పాల్పడ్డారని మేకపాటి ఆరోపించారు. మూడు నెలల క్రితమే మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి డీఎస్సీ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించి ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న అనుమానాలను నివృత్తి చేయాలని కోరారని గుర్తుచేశారు. అయినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతోనే వైఎస్సార్‌సీపీ ఆందోళన కార్యక్రమాలకు దిగాల్సి వచ్చిందన్నారు.

ప్రజా సమస్యలపై శాంతియుతంగా నిరసన తెలిపే వారిని అడ్డుకోవడం ద్వారా ప్రభుత్వం, పోలీసులు ప్రజల గొంతును అణచివేయలేరని మేకపాటి అన్నారు. ‘‘ఎల్లకాలం ఇదే ప్రభుత్వం అధికారంలో ఉండదు. ప్రభుత్వాలు మారుతాయి. అధికారులు మాత్రం వ్యవస్థలో ఉంటారు. ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తే భవిష్యత్తులో ప్రజలే సమాధానం చెబుతారు’’ అని హెచ్చరించారు.

ఆత్మకూరు పట్టణం మీదుగా ఎలాంటి అనుమతులు లేకుండా భారీ టిప్పర్లలో ఇసుక, గ్రావెల్‌ తరలిపోతున్నా పట్టించుకోని పోలీసులు.. ముందస్తు అనుమతులు తీసుకుని శాంతియుతంగా నిర్వహిస్తున్న వైఎస్సార్‌సీపీ ర్యాలీని మాత్రం అడ్డుకోవడం ఏమిటని మేకపాటి ప్రశ్నించారు. నిబంధనలు ఉంటే అందరికీ సమానంగా వర్తింపజేయాలని, ప్రజా సమస్యలపై పోరాడుతున్న ప్రతిపక్షాల కార్యక్రమాలకు మాత్రమే నిబంధనలను వర్తింపజేయడం సరికాదన్నారు.

‘‘అనుమతులు లేకుండా భారీ టిప్పర్లు తిరుగుతున్నప్పుడు కనిపించని నిబంధనలు.. విద్యార్థులు, నిరుద్యోగుల భవిష్యత్తు కోసం మేము ర్యాలీ చేస్తుంటే ఎందుకు గుర్తుకొస్తున్నాయి? ప్రజల కోసం పోరాడే హక్కు మాకు లేదా?’’ అని మేకపాటి ప్రశ్నించారు.

ఇదే సమయంలో పోలీసులు, ఆందోళనకారుల మధ్య కొంతసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అధిక సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించడంతో పోలీసులు వెనక్కి తగ్గి ఆర్డీవో కార్యాలయానికి 50 మంది మాత్రమే వెళ్లి వినతిపత్రం అందజేయవచ్చని సీఐ గంగాధర్‌ తెలిపారు. దీంతో 50 మంది నాయకులు, కార్యకర్తలు ఆర్డీవో కార్యాలయం వైపు బయలుదేరగా పార్టీ క్యాడర్‌ వారిని అనుసరించింది.

బీఎస్సార్‌ సెంటర్‌ వద్ద పోలీసులు మరోసారి నాయకులను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా సీఐ గంగాధర్‌కు, మేకపాటి విక్రమ్‌రెడ్డితో పాటు పలువురు నాయకులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పోలీసులు ఏర్పాటు చేసిన బ్యారికేడ్లను కార్యకర్తలు తొలగిస్తూ ముందుకు సాగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అనంతరం పోలీస్‌స్టేషన్‌ సమీపంలో పోలీసులు అందరినీ నిలిపివేసి కొద్దిమందిని మాత్రమే ఆర్డీవో కార్యాలయానికి వెళ్లేందుకు అనుమతిస్తామని తెలిపారు.

ఈ సందర్భంగా మేకపాటి మాట్లాడుతూ డీఎస్సీ క్రీడా కోటా నియామకాల్లో జరిగినట్లు ఆరోపణలు వస్తున్న అవకతవకలపై ప్రభుత్వం తక్షణమే సీబీఐ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. విద్యార్థులు, నిరుద్యోగుల భవిష్యత్తుకు సంబంధించిన అంశాన్ని రాజకీయంగా చూడకుండా నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని కోరారు. విచారణ పూర్తయ్యే వరకు సంబంధిత మంత్రి పక్కకు తప్పుకోవాలని అన్నారు.

కేంద్ర స్థాయిలో నీట్‌ పరీక్షకు సంబంధించి అవకతవకల ఆరోపణలు వచ్చిన సందర్భంలో బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి రాజీనామా చేసిన విషయాన్ని మేకపాటి గుర్తుచేశారు. అనంతరం మళ్లీ పరీక్ష నిర్వహించారని అన్నారు. తాము డబుల్‌ ఇంజిన్‌ ప్రభుత్వం అని చెప్పుకునే రాష్ట్ర పాలకులు కూడా బాధ్యత, జవాబుదారీతనాన్ని పాటించాల్సిన అవసరం ఉందన్నారు.

డీఎస్సీపై సీబీఐ విచారణ జరిపి 30 రోజుల్లో వాస్తవాలను ప్రజల ముందుంచాలని మేకపాటి డిమాండ్ చేశారు. అక్రమాలు జరిగితే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, అవకతవకలు జరగలేదని తేలితే అదే విషయాన్ని ప్రభుత్వం ప్రజల ముందు స్పష్టం చేయాలని అన్నారు. ప్రజల్లో ప్రభుత్వంపై ఇప్పటికే తీవ్ర వ్యతిరేకత ఉందని, రానున్న ఎన్నికల్లో ప్రజలు తమ తీర్పుతో సమాధానం చెబుతారని పేర్కొన్నారు. విద్యార్థులు, నిరుద్యోగుల న్యాయం కోసం తమ పోరాటం కొనసాగుతుందని మేకపాటి విక్రమ్‌రెడ్డి స్పష్టం చేశారు.

TS Murthy, Atmakuru(Nellore)

TS Murthy, Atmakuru(Nellore)

Next Story