Nellore: తీరు మార్చుకోకపోతే పీడీ యాక్ట్: నెల్లూరు ఎస్పీ అజిత హెచ్చరిక

Nellore: నెల్లూరు జిల్లావ్యాప్తంగా రౌడీషీటర్లు, కేడీలకు పోలీసులు కౌన్సిలింగ్ నిర్వహించారు; తీరు మార్చుకోకపోతే పీడీ యాక్ట్ ప్రయోగిస్తామని ఎస్పీ అజిత హెచ్చరించారు.

A Praveen, Nellore
Published on: 4 Oct 2026 8:36 PM IST
Nellore
X

Nellore: తీరు మార్చుకోకపోతే పీడీ యాక్ట్: నెల్లూరు ఎస్పీ అజిత హెచ్చరిక

నెల్లూరు: జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ, నేర నియంత్రణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ, నేరచరిత్ర కలిగిన వ్యక్తులు సత్ప్రవర్తనతో జీవించేలా చర్యలు చేపట్టాలని జిల్లా ఎస్పీ డా. అజిత వెజెండ్ల IPS గారి సూచనలు మేరకు, నేడు (ఆదివారం) జిల్లా వ్యాప్తంగా ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలో రౌడీషీటర్లు, హిస్టరీషీటర్లు, KDలు, DCలు మరియు ఇతర నేరచరిత్ర కలిగిన వ్యక్తులకు పోలీసు అధికారులు ప్రత్యేక సత్ ప్రవర్తనా కౌన్సిలింగ్లు నిర్వహించారు.

నేర ప్రవృత్తికి స్వస్తి పలకండి

కౌన్సిలింగ్ సందర్భంగా నేరాలకు దూరంగా ఉండి సమాజంలో మంచి పౌరులుగా జీవించాలని సూచించారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

ప్రజా శాంతికి భంగం కలిగిస్తే ఉపేక్షించేది లేదు

రౌడీయిజం, దౌర్జన్యాలు, బెదిరింపులు, గొడవలు, ఇతర శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలను సహించబోమని స్పష్టం చేశారు. ప్రజా శాంతికి భంగం కలిగించే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

మహిళలు, బాలికలపై నేరాలకు జీరో టాలరెన్స్

మహిళలు, బాలికలపై వేధింపులు, లైంగిక దాడులు, అత్యాచారాలు వంటి నేరాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, వేగవంతమైన దర్యాప్తు, విచారణ ద్వారా శిక్షలు ఖాయం చేస్తామని హెచ్చరించారు.

రౌడీ, KD, DCల కదలికలపై పటిష్ట నిఘా

జిల్లాలో నేరాలకు పాల్పడిన వ్యక్తుల కదలికలపై నిరంతర నిఘా కొనసాగుతోందని, ప్రజా శాంతికి భంగం కలిగించే పరిస్థితులు సృష్టిస్తే అవసరమైతే PD Act కింద చర్యలు తీసుకుంటామని తెలిపారు.

నేర నియంత్రణకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగం

జిల్లా వ్యాప్తంగా సీసీ కెమెరాల వ్యవస్థను విస్తరించామని, మారుమూల ప్రాంతాల్లో కూడా నిఘా వ్యవస్థను బలోపేతం చేశామని తెలిపారు. బీట్ వ్యవస్థను మరింత పటిష్టంగా అమలు చేస్తూ నేరాల నియంత్రణకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టినట్లు వెల్లడించారు.

మంచి పౌరులుగా జీవించండి

నేరాలకు పాల్పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని, కుటుంబ సభ్యుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని సత్ప్రవర్తనతో జీవించాలని సూచించారు. ప్రజలతో సత్సంబంధాలు కొనసాగిస్తూ ఎవరికీ ఇబ్బంది కలిగించకుండా జీవనోపాధి పొందాలని సూచించారు.

అనుమానాస్పద ఘటనలపై వెంటనే సమాచారం ఇవ్వండి

ప్రజలు తమ ప్రాంతాల్లో అల్లర్లు, గొడవలు లేదా చట్టవ్యతిరేక కార్యకలాపాల గురించి సమాచారం తెలిసిన వెంటనే డయల్-112, పోలీసు కంట్రోల్ రూమ్ వాట్సాప్ నంబర్ +91 93929 03413 లేదా సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని కోరారు.

శాంతియుత జిల్లా నిర్మాణమే లక్ష్యం

జిల్లాను ప్రశాంత జిల్లాగా ఉంచడం, ప్రజల ప్రాణ, ఆస్తుల రక్షణతో పాటు శాంతిభద్రతల పరిరక్షణే పోలీసు శాఖ ప్రధాన లక్ష్యమని అధికారులు పేర్కొన్నారు.

A Praveen, Nellore

A Praveen, Nellore