Atmakur: మర్రిపాడులో భారీ పరిశ్రమ.. స్థానిక యువతకు ఉపాధి!
Atmakur: నెల్లూరు జిల్లా ఆత్మకూరులో ఎన్డీఏ కూటమి రెండేళ్ల పాలన విజయోత్సవ సంబరాలు.
Atmakur: మర్రిపాడులో భారీ పరిశ్రమ.. స్థానిక యువతకు ఉపాధి!
Atmakur: నెల్లూరు జిల్లా ఆత్మకూరులో అట్టహాసంగా రాష్ట్ర ప్రభుత్వ రెండేళ్ల పాలన "నమ్మకం.. అభివృద్ధి.. సంక్షేమం" విజయోత్సవ సంబరాలు రెండేళ్ల ఎన్డీఏ కూటమి ప్రభుత్వ పాలనలో ఆత్మకూరును అభివృద్ధి, సంక్షేమంలో అగ్రస్థానంలో నిలిపామని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్పష్టం చేశారు.
శుక్రవారం ఉదయం ఆత్మకూరు పట్టణంలోని శ్రీధర్ గార్డెన్స్ లో నియోజకవర్గ ప్రజల ఆనందోత్సహాల మధ్య రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా "నమ్మకం.. అభివృద్ధి.. సంక్షేమం" విజయోత్సవ సంబరాలను మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ప్రారంభించారు. తొలుత ఆర్డీవో పావని, డి ఎల్ డి వో రమణయ్య ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. పలువురు సంక్షేమ పథకాల లబ్ధిదారులు తమకు జరిగిన మంచిని వివరించారు.
ఈ సందర్భంగా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ రెండేళ్ల పాలనలో సాధించిన అభివృద్ధి, సంక్షేమ ఫలితాలను మంత్రి ప్రజలకు వివరించారు.ఈ సందర్భంగా మంత్రి ఆనం మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ సూపర్ సిక్స్ పథకాలను సూపర్ హిట్ చేశామని తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన రెండేళ్లలో ఆత్మకూరు నియోజకవర్గానికి సంక్షేమ కార్యక్రమాలకు రూ.3,461.17 కోట్లు, అభివృద్ధి కార్యక్రమాలకు రూ.3,084.53 కోట్లు వెచ్చించామని, మొత్తం రూ.6,545.70 కోట్లతో రికార్డు స్థాయిలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశామని వెల్లడించారు. రైతుల హక్కులను కాపాడేందుకే గత ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిల్ యాక్ట్‌ను రద్దు చేశామని, ప్రభుత్వ రాజముద్రతో కూడిన నూతన పట్టాదారు పాస్ పుస్తకాలను రైతులకు అందిస్తున్నామని చెప్పారు.
రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తూ అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్, పింఛన్లు, ఉచిత బస్సు ప్రయాణం, దీపం-2, తల్లికి వందనం వంటి పథకాల ద్వారా వేలాది కుటుంబాలకు ప్రత్యక్ష లబ్ధి చేకూరిందన్నారు. దేవాదాయ శాఖ మంత్రిగా పనిచేయడం తనకు మహా భాగ్యంగా భావిస్తున్నానని పేర్కొన్న మంత్రి, ముఖ్యమంత్రి దేవాదాయ శాఖకు సంబంధించి నిర్దేశించిన 11 ప్రధాన వాగ్దానాల్లో ఇప్పటికే 10 వాగ్దానాలను అమలు చేశామని తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా కోట్లాది రూపాయలతో 800కు పైగా పురాతన ఆలయాల పునర్నిర్మాణం చేపడుతూ, భగవత్ సంకల్పంతో ఆలయాలను ఆధ్యాత్మిక కేంద్రాలుగా అభివృద్ధి చేస్తున్నామని వివరించారు. ఆత్మకూరు నియోజకవర్గంలో సాగునీటి రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని, సోమశిల హై లెవల్ కెనాల్ పనులను పూర్తి చేసి మర్రిపాడు వరకు సాగునీరు అందించడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. సోమశిల రిజర్వాయర్, సంగం బ్యారేజ్, ఏఎస్ఆర్ హై లెవల్ కెనాల్, కావలి కాలువ, కనిగిరి రిజర్వాయర్ వంటి కీలక ప్రాజెక్టుల పనులు వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు.
ఆత్మకూరు మెట్ట ప్రాంతంలో పారిశ్రామికాభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని మంత్రి పేర్కొన్నారు. మర్రిపాడులో 300 ఎకరాల విస్తీర్ణంలో రూ.500 కోట్ల పెట్టుబడితో ఛత్తీస్‌గఢ్‌కు చెందిన పరిశ్రమ ఏర్పాటుకు ముందుకు వచ్చిందని, దీంతో స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు. అలాగే ఎంఎస్ఎంఈ పార్క్,
ఆటోనగర్ ఏర్పాటు ద్వారా పారిశ్రామిక వాతావరణాన్ని మరింత బలోపేతం చేస్తున్నామని తెలిపారు. ఆత్మకూరు పట్టణ అభివృద్ధిలో భాగంగా ఆటోనగర్, నగరవనం, క్రీడా ప్రాంగణం వంటి ప్రాజెక్టులను మంజూరు చేశామని, మున్సిపాలిటీ పరిధిలో రూ.75 కోట్లతో మౌలిక వసతుల అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని వెల్లడించారు. గ్రామీణాభివృద్ధికి పల్లె పండుగ కార్యక్రమాల కింద భారీ నిధులు కేటాయించి పనులు చేపడుతున్నామని చెప్పారు.
గత రెండేళ్లలో ప్రభుత్వంపై ప్రజల్లో నమ్మకం పెరిగిందని, అభివృద్ధి, సంక్షేమం అనే రెండు చక్రాలపై రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నామని మంత్రి పేర్కొన్నారు. రాబోయే మూడేళ్లలో మరింత వేగంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసి ఆత్మకూరు నియోజకవర్గాన్ని రాష్ట్రంలో ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్పష్టం చేశారు.అనంతరం 28 మంది లబ్ధిదారులకు సుమారు 30 లక్షలు విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను మంత్రి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.




