Atmakur: తరుణవాయి ఐటీఐకి ఆ పేరు.. మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కీలక ప్రకటన

Atmakur: సంగం మండలంలోని తరుణవాయి, పడమటిపాలెం గ్రామాల్లో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సుమారు రూ. 3.38 కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు.

M Satya Peter, Atmakur
Published on: 3 May 2026 1:48 PM IST
Atmakur
X

Atmakur: తరుణవాయి ఐటీఐకి ఆ పేరు.. మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కీలక ప్రకటన

ఆత్మకూరు: నెల్లూరు జిల్లా సంగం మండలంలోని తరుణవాయి, పడమటిపాలెం గ్రామాల్లో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ముందుగా తరుణవాయి గ్రామంలోని హనుమాన్ జంక్షన్ వద్ద ఆంజనేయ స్వామి విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి అనంతరం భోజనశాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా రూ. 72.90 లక్షల వ్యయంతో ఐటీఐ కాలేజీ సిమెంట్ రోడ్డును ప్రారంభించడంతో పాటు, గ్రామపంచాయతీ పరిధిలో రూ. 57.75 లక్షలతో నీటిపారుదల కాలువల మరమ్మత్తు పనులు, రూ. 31.60 లక్షలతో ఇంటింటికి రక్షిత తాగునీటి పథకం పంపు షెడ్ పనులకు శ్రీకారం చుట్టారు.

తరుణవాయి గ్రామంలోనే మొత్తం రూ. 1.62 కోట్లతో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు.అనంతరం తన స్వగ్రామమైన పడమటిపాలెంకు విచ్చేసిన మంత్రికి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆత్మీయ స్వాగతం పలికారు. ఇక్కడ రూ. 1.71 కోట్లతో అభివృద్ధి పనులను ఎమ్మెల్యే తో కలిసి మంత్రి ప్రారంభించారు. ఇందులో రూ. 20 లక్షలతో సిమెంట్ రోడ్లు, రూ. 31.60 లక్షలతో రక్షిత తాగునీటి పథకం, రూ. 97.50 లక్షలతో సాగునీటి కాలువల మరమ్మత్తు పనులు ఉన్నాయి. అదనంగా రూ. 27 లక్షలతో విలేజ్ క్లినిక్ అసంపూర్తి పనులకు శంకుస్థాపన చేశారు. అలాగే పడమటిపాలెంలో రూ. 5.47 లక్షల సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గ్రామాల్లో గతంలో ఎన్నడూ లేనివిధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. కోట్లాది రూపాయలతో మౌలిక వసతులు కల్పిస్తూ సిమెంట్ రోడ్లు, తాగునీటి సౌకర్యం, సాగునీటి కాలువల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. తరుణవాయి, పడమటిపాలెం గ్రామాల్లో కలిపి రూ. 3.38 కోట్ల అభివృద్ధి పనులు చేపట్టామని వెల్లడించారు. త్వరలోనే తరుణవాయి ఐటీఐ కళాశాల భవనాలను పూర్తి చేసి తరగతులను ప్రారంభిస్తామని, లగడపాటి కుటుంబ సభ్యుల కోరిక మేరకు ఆ కళాశాలకు లగడపాటి వెంకట రామనాయుడు పేరు పెట్టనున్నట్లు తెలిపారు.ప్రతి గ్రామంలో సాగునీటి పనులను పూర్తి చేసి ప్రతి ఎకరాన్ని సస్యశ్యామలం చేయడమే లక్ష్యమని, సంఘం బ్యారేజ్ పెండింగ్ పనులను కూడా పూర్తి చేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో అభివృద్ధి పనులు ముందుకు సాగలేదని విమర్శిస్తూ, ప్రస్తుత ప్రభుత్వం ప్రతి పనిని వేగంగా పూర్తి చేస్తోందన్నారు.

ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా తమ ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు విజయవంతంగా అమలుచేస్తున్నట్లు చెప్పారు. ఇచ్చిన ప్రతి హామిని అమలు చేశామని చెప్పారు. పెన్షన్స్ పెంచి క్రమం తప్పకుండా అందిస్తున్నామని, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, ఉచిత సిలిండర్లు, స్త్రీ శక్తీ, అన్నా కాంటీన్ మొదలైన పథకాలను దిగ్విజయంగా అమలు చేసిన ఘనత తమ ప్రభుత్వానికే దక్కిందన్నారు.

ఒక్క సంగం మండలంలో 120 ఇరిగేషన్ పనులకు 9.50 కోట్లు మంజూరు చేసామని,పడమటి పాలెం, పల్లెపాలెం లో 5 కోట్లతో ఆర్ & బి రోడ్ల నిర్మాణాలు త్వరలోనే మొదలుపెడతామని మంత్రి చెప్పారు.ఈ గ్రామాలతో తమ కుటుంబానికి ఉన్న అనుబంధం ప్రత్యేకమని, ప్రజలు చూపుతున్న ఆత్మీయతను ఎప్పటికీ మరవలేనని పేర్కొన్నారు. అన్ని రంగాల్లో ఆత్మకూరు నియోజకవర్గాన్ని అగ్రగామిగా నిలపడానికి కృషి చేస్తామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు.ఈ కార్యక్రములో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు,ప్రజలు పాల్గొన్నారు.

M Satya Peter, Atmakur

M Satya Peter, Atmakur

Next Story