Nellore: మతసామరస్యానికి నిదర్శనం బారాషహీద్ దర్గా.. మంత్రి ఆనం!

Nellore: నెల్లూరులోని చారిత్రాత్మక బారాషహీద్ దర్గాను ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

V. Narasimhulu, Nellore
Published on: 1 July 2026 7:47 AM IST
Nellore
X

Nellore: మతసామరస్యానికి నిదర్శనం బారాషహీద్ దర్గా.. మంత్రి ఆనం!

Nellore: ప్రపంచంలోనే మతసామరస్యానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన పవిత్ర క్షేత్రం బారాషహీద్ దర్గా అని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అన్నారు.

రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మంగళవారం నెల్లూరులోని చారిత్రాత్మక బారాషహీద్ దర్గాను సందర్శించి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్, కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, దర్గా కమిటీ సభ్యులు, ముస్లిం మత పెద్దలు మంత్రికి ఘన స్వాగతం పలికారు. అనంతరం మంత్రి బారాషహీదులను దర్శించుకుని దేశ ప్రజల సుఖశాంతులు, రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రార్థనలు చేశారు.

ఈ సందర్భంగా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ, ప్రపంచంలోనే మతసామరస్యానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన పవిత్ర క్షేత్రం బారాషహీద్ దర్గా అని పేర్కొన్నారు. భిన్న మతాలు, భిన్న సంప్రదాయాలు, భిన్న సంస్కృతులు కలిగిన ప్రజలు ఒకే వేదికపై కలుసుకుని పరస్పర గౌరవం, సోదరభావాన్ని చాటుకునే అపూర్వ ఆధ్యాత్మిక ఉత్సవం రొట్టెల పండుగ అని అన్నారు.

భారతదేశం వైవిధ్యంలో ఏకత్వాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన దేశమని, ఆ గొప్ప సంస్కృతికి ప్రతిబింబమే నెల్లూరులో జరిగే రొట్టెల పండుగ అని మంత్రి పేర్కొన్నారు. హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, జైనులు, సిక్కులు తదితర అన్ని మతాలకు చెందిన భక్తులు ఎలాంటి భేదాభిప్రాయాలు లేకుండా ఒకే చోట చేరి రొట్టెలను మార్చుకోవడం భారతీయ సంస్కృతి గొప్పతనాన్ని ప్రతిబింబిస్తోందన్నారు.

శతాబ్దాలుగా కొనసాగుతున్న ఈ సంప్రదాయం కేవలం ఆధ్యాత్మిక విశ్వాసానికి మాత్రమే పరిమితం కాకుండా, సర్వమత సౌభ్రాతృత్వానికి, సామాజిక ఐక్యతకు, మానవ విలువలకు ప్రతీకగా నిలుస్తోందన్నారు. మతం ఏదైనా మనుషులందరూ ఒక్కటేనని, పరస్పర ప్రేమ, గౌరవం, సహజీవనమే భారతీయతకు మూల సూత్రమని ఈ పండుగ ప్రపంచానికి చాటి చెబుతోందని తెలిపారు.

ప్రతి ఏటా దర్గాపై ప్రగాఢ విశ్వాసంతో, స్వర్ణాల చెరువులో జరిగే రొట్టెల పండుగలో పాల్గొనేందుకు లక్షలాది మంది భక్తులు దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి తరలివస్తున్నారని చెప్పారు. గతంలో కొన్ని వేల మంది భక్తులతో ప్రారంభమైన ఈ ఉత్సవం నేడు లక్షలాది మంది పాల్గొనే మహోత్సవంగా రూపాంతరం చెందడం ఈ పండుగ విశిష్టతకు నిదర్శనమన్నారు.

దివంగత ఆనం వివేకానంద రెడ్డి హయాం నుంచే బారాషహీద్ దర్గా అభివృద్ధికి తమ కుటుంబం కృషి చేస్తోందని, భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఎన్డీఏ కూటమి నాయకులు, జిల్లా ప్రజాప్రతినిధుల సహకారంతో రొట్టెల పండుగ మరింత వైభవంగా నిర్వహించబడుతోందని పేర్కొన్నారు.

ఈ గొప్ప సంప్రదాయం తరతరాల పాటు ఇలాగే కొనసాగుతూ మతసామరస్యానికి, జాతీయ ఐక్యతకు మార్గదర్శకంగా నిలవాలని మంత్రి ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో దర్గా కమిటీ సభ్యులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, ముస్లిం మత పెద్దలు, భక్తులు పాల్గొన్నారు.

V. Narasimhulu, Nellore

V. Narasimhulu, Nellore

Next Story