Nellore: చెత్త నిర్మూలనలో కూటమి సర్కార్‌ వేగం మంత్రి నారాయణ

Nellore: రాష్ట్రంలో 120 లక్షల టన్నుల వ్యర్థాలను క్లియర్ చేశాం. ఈ నెల 18న సీఎం చంద్రబాబు చేతుల మీదుగా చెత్త ప్రాసెసింగ్ ప్లాంట్ల ప్రారంభం: మంత్రి నారాయణ.

V. Narasimhulu, Nellore
Published on: 15 July 2026 2:29 PM IST
Nellore
X

Nellore: చెత్త నిర్మూలనలో కూటమి సర్కార్‌ వేగం మంత్రి నారాయణ

నెల్లూరు: గత వైసిపి ప్రభుత్వంపై రాష్ట్ర పట్టణ పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. దొంతాలి డంపింగ్ యార్డును పరిశీలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జగన్ ప్రభుత్వం కేవలం ప్రజలపై చెత్త పన్ను వేసి దోచుకోవడానికే పరిమితమైందని మండిపడ్డారు.

కనీస అవగాహన, విజన్ లేని వైసిపి ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రాష్ట్రవ్యాప్తంగా భూమిపైన, భూమి కింద కలిపి మొత్తం 153 లక్షల టన్నుల లెగసీ వ్యర్థాలు కొండల్లా పేరుకుపోయాయని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా చైనా, జపాన్, సింగపూర్ వంటి దేశాలు అత్యాధునిక సాంకేతికతతో వ్యర్థాలను నిర్మూలిస్తుంటే.. గత వైసిపి ప్రభుత్వం మాత్రం తాము గతంలో తెచ్చిన వేస్ట్-టు-ఎనర్జీ ప్లాంట్లను కూడా క్యాన్సిల్ చేసి రాష్ట్ర భవిష్యత్తును పాడుచేసిందని మంత్రి నారాయణ తీవ్రంగా విమర్శించారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలోని 123 మున్సిపాలిటీల్లో యుద్ధప్రాతిపదికన పనులు చేపట్టి, ఇప్పటికే దాదాపు 120 లక్షల టన్నుల వ్యర్థాలను విజయవంతంగా క్లియర్ చేశామని మంత్రి నారాయణ తెలిపారు. ఇంకా కేవలం 3 లక్షల టన్నుల వ్యర్థాలు మాత్రమే మిగిలి ఉన్నాయన్నారు.

రాష్ట్రంలోని 107 మున్సిపాలిటీల్లో చెత్త ప్రాసెసింగ్ ప్లాంట్ల పనులు చురుగ్గా జరుగుతున్నాయని, ఇప్పటికే పనులు పూర్తయిన కొన్ని ప్రాంతాల్లోని ప్లాంట్లను ఈ నెల 18వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. రాబోయే రెండు సంవత్సరాల పాటు రోజువారీ వచ్చే చెత్తను ఎప్పటికప్పుడు ప్రాసెస్ చేయడానికి ఈ ప్లాంట్లు ఉపయోగపడతాయని, లేదంటే సంవత్సరానికి మళ్లీ 12 లక్షల టన్నుల చెత్త పేరుకుపోయే ప్రమాదం ఉందని వివరించారు.

వ్యర్థాల శాశ్వత నిర్మూలనకు వేస్ట్-టు-ఎనర్జీ ప్లాంట్లే సరైన మార్గమని, ప్రస్తుతం విశాఖపట్నం, గుంటూరులలో మొత్తం 2,800 టన్నుల సామర్థ్యంతో ప్రతిరోజూ చెత్తను బర్న్ చేసి విద్యుత్ ఉత్పత్తి చేసే రెండు ప్లాంట్లు నడుస్తున్నాయని తెలిపారు. ఇవి కాకుండా తిరుపతి, కడప, కర్నూలు, నెల్లూరు, విజయవాడ సహా మరో ఆరు ప్లాంట్లకు టెండర్లు పిలిచామని, కాకినాడలో పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయని చెప్పారు.

నెల్లూరు ప్లాంట్‌లో మిగిలి ఉన్న లెగసీ వ్యర్థాలను క్లియర్ చేసి, వచ్చే నెల 10వ తేదీ లోపు పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించానని, ఈ ప్లాంట్లు అందుబాటులోకి వస్తే ప్లాంట్ ఉన్న ప్రాంతం నుండి 100 కిలోమీటర్ల పరిధిలోపల ఉన్న అన్ని మున్సిపాలిటీలు మరియు పంచాయతీల చెత్తను సేకరించి ఎప్పటికప్పుడు విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తారని వివరించారు.

భీమవరం, నరసాపురం ప్రాంతాల్లో కూడా మరో కొత్త ప్లాంట్ ఏర్పాటుకు ముఖ్యమంత్రి ఆదేశాలు ఇచ్చారని, అధికారులు దానిపై స్టడీ చేస్తున్నారని తెలిపారు. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో ప్రతిరోజూ ఉత్పత్తయ్యే 7,000 టన్నుల చెత్తలో 6,800 టన్నుల చెత్తను ఎప్పటికప్పుడు సేకరించి, ప్రాసెస్ చేసి విద్యుత్ ఉత్పత్తి చేసేలా ఒక సిస్టమాటిక్ వ్యవస్థను తమ ప్రభుత్వం తీసుకువస్తోందని మంత్రి డాక్టర్ నారాయణ ధీమా వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ సీఈ వేణుగోపాల్,పబ్లిక్ హెల్త్ ఎస్ఈ మహేష్,అడిషనల్ కమిషనర్ హిమబిందు ,ఎస్ ఈ జానీ,జిందాల్ కంపెనీ జనరల్ మేనేజర్ రామకృష్ణ,జిగ్మా కంపెనీ ప్రతినిధులు,టీడీపీ నేత దొడ్డపనేని రాజానాయుడు తదితరులు పాల్గొన్నారు.

V. Narasimhulu, Nellore

V. Narasimhulu, Nellore

Next Story