Nellore: బాలుడి కోరిక నెరవేర్చిన మంత్రి నారాయణ రూ.1.40 కోట్లతో పార్కు ప్రారంభం!

Nellore: చిన్నారి కోరికకు స్పందించి రూ.1.40 కోట్లతో రేబాల పార్కు, జిమ్ ప్రారంభించిన మంత్రి పొంగూరు నారాయణ. నెల్లూరులో 35 పార్కులు పూర్తి.

A Praveen, Nellore
Published on: 16 Aug 2026 10:49 AM IST
Nellore
X

Nellore: బాలుడి కోరిక నెరవేర్చిన మంత్రి నారాయణ రూ.1.40 కోట్లతో పార్కు ప్రారంభం!

Nellore: ఎన్నికల ప్రచారంలో ఓ చిన్నారి చేసిన విజ్ఞప్తిని గుర్తుపెట్టుకుని అధికారంలోకి వచ్చిన వెంటనే పార్కును ఏర్పాటు చేసి మాటనిలబెట్టుకొన్నారు రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ. తన మాటకు కట్టుబడి నిలిచారు.

నెల్లూరు సిటీ నియోజకవర్గంలో కొనసాగుతున్న “పార్కుల పండుగ”లో భాగంగా 8వ డివిజన్‌లో రూ.1.40 కోట్లతో అభివృద్ధి చేసిన రేబాల పార్కు, ఏసీ కమ్యూనిటీ హాల్, ఏసీ జిమ్‌ను శనివారం ప్రారంభించారు.స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా పార్కు వద్ద ఏర్పాటు చేసిన కేక్‌ను మంత్రి కట్ చేశారు. అనంతరం చిన్నారులతో కలిసి ఆటలాడుతూ, వారికి చాక్లెట్లు పంచుతూ సరదాగా గడిపారు.

తమ ప్రాంతంలో పార్కు ఏర్పాటు చేయాలన్న కోరికను నెరవేర్చిన మంత్రికి చిన్నారులు కోలాటంతో ఘన స్వాగతం పలికారు. స్థానిక మహిళలు బూడిద గుమ్మడికాయలతో మంత్రికి దిష్టి తీసి తమ అభిమానాన్ని చాటుకున్నారు.

ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ ఎన్నికలకు ముందు సర్వేపల్లి కాలువ కట్టపై ప్రచారం నిర్వహించిన సమయంలో పండు అనే బాలుడు శిథిలావస్థలో ఉన్న రేబాల చిన్నపిల్లల ఆసుపత్రి స్థానంలో పార్కు ఏర్పాటు చేయాలని కోరాడని గుర్తు చేసుకున్నారు.

ఆ బాలుడి కోరికను అప్పుడే మనసులో పెట్టుకున్నాను. అధికారంలోకి వచ్చిన వెంటనే పార్కు ఏర్పాటుకు శ్రీకారం చుట్టాను. ఊహించని విధంగా అధికారులు, సిబ్బంది ఈ ప్రాంతాన్ని అద్భుతమైన పార్కుగా తీర్చిదిద్దారని తెలిపారు.

పార్కు ఏర్పాటు చేయాలని కోరిన చిన్నారి చేతుల మీదుగానే పార్కును ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు.నెల్లూరు నగరంలో 46 పార్కుల అభివృద్ధికి శ్రీకారం చుట్టామని, ఇప్పటికే 35 పార్కులను ప్రారంభించామని మంత్రి వెల్లడించారు.

నగర ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించడంతో పాటు పిల్లలు, యువత, వృద్ధులు ఆరోగ్యంగా ఉండేలా పార్కుల్లో అన్ని వసతులు కల్పిస్తున్నామని తెలిపారు.పార్కులతో పాటు ఏసీ కమ్యూనిటీ హాళ్లు, ఏసీ జిమ్‌లు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.

తక్కువ ఖర్చుతో పేద, మధ్యతరగతి కుటుంబాలు తమ పిల్లల పుట్టినరోజులు, చిన్న చిన్న వేడుకలు నిర్వహించుకునేందుకు కమ్యూనిటీ హాళ్లు ఉపయోగపడతాయని తెలిపారు.

ప్రజల ఆరోగ్యం మెరుగుపడాలంటే నగరంలో పచ్చదనం పెరగాల్సిన అవసరం ఉందని మంత్రి అన్నారు. 50 శాతం గ్రీనరీ ఉండాలన్నది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంకల్పమని, అందుకు అనుగుణంగా నెల్లూరు నగరంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టామని తెలిపారు.

తొలి దశలో 12,500 చెట్లను నాటామని, రెండో దశలో మరో 12 వేల చెట్లను నాటనున్నట్లు చెప్పారు.నెల్లూరు నగరాన్ని మరింత ఆహ్లాదకరంగా, ఆరోగ్యకరంగా తీర్చిదిద్దేందుకు అడ్వెంచర్ , వాటర్ స్పోర్ట్స్ పార్కులు, ఐస్‌ల్యాండ్‌లను కూడా ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.

నగర అభివృద్ధిలో భాగంగా రూ.50 కోట్లతో నెక్సెస్ రోడ్డును అభివృద్ధి చేస్తున్నామని మంత్రి తెలిపారు. అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ పనులను కూడా వేగవంతం చేశామని చెప్పారు.“అభివృద్ధి, సంక్షేమానికి కూటమి ప్రభుత్వం సమాన ప్రాధాన్యత ఇస్తోందని,నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే తమ లక్ష్యం” అని స్పష్టం చేశారు.

వైసీపీపై నారాయణ ఫైర్

నెల్లూరు నగరం అభివృద్ధి చెందుతుంటే ఓర్వలేక కొందరు వైసీపీ నాయకులు విషం చిమ్ముతున్నారని మంత్రి విమర్శించారు. సీఎస్ఆర్ నిధులతో నగరంలో చెట్లు నాటిస్తుంటే అవగాహన లేకుండా ఆరోపణలు చేశారని మండిపడ్డారు.

ప్రభుత్వానికి ప్రజల నుంచి వస్తున్న ఆదరణ చూసి ఈర్ష్య పడుతున్నారన్నారు .రాజకీయంగా తమ ఉనికిని కాపాడుకునేందుకు కుతంత్రాలు చేస్తున్నారని,వారు ఎన్ని కుట్రలు చేసినా నెల్లూరు అభివృద్ధి ఆగదని తేల్చి చెప్పారు.

మాది మాటల ప్రభుత్వం కాదని,చేతల ప్రభుత్వం అని చెప్పారు.ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ ఒక్కొక్కటిగా నెరవేరుస్తామన్నారు ప్రజలు కొంత ఓపిక పడితే అభివృద్ధి ఫలాలను పూర్తిగా అందిస్తామని మంత్రి నారాయణ పేర్కొన్నారు.

డిప్యూటీ మేయర్ రూప్‌కుమార్ యాదవ్ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో నారాయణ సార్‌ను కలిసి ఈ ప్రాంతంలో పార్కు ఏర్పాటు చేయాలని ఓ చిన్నారి కోరాడని తెలిపారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన మాట ప్రకారం అద్భుతమైన పార్కును నిర్మించి ప్రారంభించారని అన్నారు.

పార్కులో పిల్లలు, పెద్దలకు అవసరమైన అన్ని హంగులు ఏర్పాటు చేశారని, ముఖ్యంగా పార్కు కోరిన బాలుడితోనే పార్కును ప్రారంభింపజేయడం మంత్రి నారాయణ ప్రత్యేకతకు నిదర్శనమన్నారు.

ఈ కార్యక్రమంలో మేయర్ దేవరకొండ సుజాత, కమిషనర్ నందన్, డిప్యూటీ మేయర్ రూప్‌కుమార్ యాదవ్, మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ తాళ్లపాక అనూరాధ, మాజీ జెడ్పీటీసీ విజేతా రెడ్డి, నగర పార్టీ అధ్యక్షుడు మామిడాల మధు, డివిజన్ నాయకులు తిరుమల నాయుడు, హేమంత్ కుమార్, బీసీ బాబు తదితరులు పాల్గొన్నారు.

A Praveen, Nellore

A Praveen, Nellore

Next Story