Nellore: నెల్లూరు దర్గాలో ఆర్‌ఎఫ్‌ఐడీ సాంకేతికత.. తప్పిపోయిన 45 మంది పిల్లలు సేఫ్
Nellore: నెల్లూరు బారాషహీద్ దర్గాలో రొట్టెల పండుగ ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి నారాయణ. భద్రత కోసం అధునాతన డ్రోన్లు ప్రారంభం.
Nellore: నెల్లూరు దర్గాలో ఆర్‌ఎఫ్‌ఐడీ సాంకేతికత.. తప్పిపోయిన 45 మంది పిల్లలు సేఫ్
నెల్లూరు: రొట్టెల పండుగ రెండో రోజు సందర్భంగా బారాషహీద్ దర్గాలో చేపట్టిన ఏర్పాట్లను రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ శనివారం పరిశీలించారు.
ఈ సందర్భంగా రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్, కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, జిల్లా ఎస్పీ అజిత, మున్సిపల్ కమిషనర్ నందన్ తదితరులతో కలిసి భక్తుల భద్రత, నిఘా కోసం ఏర్పాటు చేసిన నాలుగు అత్యాధునిక డ్రోన్లను మంత్రి ప్రారంభించారు. అనంతరం లంగర్ ఖానాను ప్రారంభించి భక్తులకు భోజనం వడ్డించారు.
ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ...
రొట్టెల పండుగ తొలిరోజు దాదాపు 3 లక్షల మంది భక్తులు దర్గాను సందర్శించగా, రెండో రోజు 4 నుంచి 5 లక్షల మంది వరకు, ప్రధాన ఘట్టం జరిగే ఆదివారం 6 నుంచి 7 లక్షల మంది వరకు భక్తులు వచ్చే అవకాశం ఉందన్నారు. ఈరోజు అర్ధరాత్రి గంధ మహోత్సవం, రేపు రొట్టెల పండుగ ప్రధాన కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు.
భక్తుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ నాలుగు అత్యాధునిక డ్రోన్లను వినియోగంలోకి తీసుకువచ్చామని, రాత్రి వేళల్లో కూడా స్పష్టమైన దృశ్యాలను అందించే ఈ డ్రోన్ల ద్వారా ఏరియల్ సర్వైలెన్స్ నిర్వహిస్తున్నామని చెప్పారు. కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి సీసీటీవీ కెమెరాల ద్వారా దర్గా పరిసరాలు, ఘాట్లను నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు వెల్లడించారు. భక్తులందరూ సంతృప్తి చెందేలా ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
రొట్టెల పండుగను రాష్ట్ర పండుగగా గుర్తించిన తర్వాత గతంలో రూ.20 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామని గుర్తుచేసిన మంత్రి, ఈసారి ప్రభుత్వం మరో రూ.5 కోట్లు కేటాయించిందన్నారు. మున్సిపల్ కార్పొరేషన్, వక్ఫ్ బోర్డు నిధులతో కలిపి రూ.10 కోట్ల వ్యయంతో భారీ ప్రార్థనా మందిరం నిర్మిస్తున్నామని, వచ్చే రొట్టెల పండుగ నాటికి అది అందుబాటులోకి వస్తుందని తెలిపారు. అలాగే కసుమూరు దర్గా సహా ఇతర ఆధ్యాత్మిక కేంద్రాలను అనుసంధానిస్తూ ప్రత్యేక టూరిజం సర్క్యూట్ ఏర్పాటు అంశాన్ని పరిశీలిస్తున్నట్లు చెప్పారు.
గత రెండు రోజులుగా జరుగుతున్న రొట్టెల పండుగలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పటిష్ట ఏర్పాట్లు చేశామని తెలిపారు. చైన్ స్నాచింగ్, పిక్‌పాకెటింగ్, మిస్సింగ్ కేసులు లేకుండా ప్రత్యేక చర్యలు చేపట్టామని చెప్పారు. 12 నుంచి 14 సంవత్సరాల లోపు పిల్లలకు RFID సమాచార ట్యాగ్‌లు అందజేస్తున్నామని, వాటిలో తల్లిదండ్రుల వివరాలు నమోదు చేస్తున్నామని తెలిపారు. ఈ సాంకేతికత ద్వారా శనివారం మధ్యాహ్నం వరకు తప్పిపోయిన సుమారు 45 మంది పిల్లలను గుర్తించి సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించినట్లు వెల్లడించారు.
దర్గా పరిసరాల్లో పారిశుధ్య నిర్వహణకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నామని, త్రాగునీరు, అన్నదానం, వైద్య సేవలు సహా అన్ని వసతులు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. భక్తులు వాహనాల్లో ఓవర్‌లోడ్ ప్రయాణాలు చేయకుండా, ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ అధికారులకు సహకరించాలని కోరారు.
ఈ నెల 30వ తేదీ వరకు రొట్టెల పండుగ కొనసాగనున్న నేపథ్యంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అబ్దుల్ అజీజ్ స్పష్టం చేశారు.




