Nellore: నెల్లూరును దోమల రహిత నగరంగా మారుస్తాం: మంత్రి నారాయణ!
Nellore: నెల్లూరు యలమవారిదిన్నెలో రూ.35 లక్షలతో నిర్మించిన స్వర్ణ వార్డు భవనాన్ని మంత్రి నారాయణ ప్రారంభించారు. వైసీపీ ఎంత రెచ్చగొడితే అంత పనిచేస్తానని స్పష్టం చేశారు.
Nellore: నెల్లూరును దోమల రహిత నగరంగా మారుస్తాం: మంత్రి నారాయణ!
నెల్లూరు: నెల్లూరు నగరాభివృద్ధి, పేదల సంక్షేమం కోసం తాము చేపడుతున్న పనులపై ప్రతిపక్ష వైసీపీ నేతలు అనవసరంగా వివాదాలు సృష్టిస్తున్నారని మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దాతల సహకారంతో నగరంలో చెట్లు నాటిస్తుంటే దానిపై కూడా దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.
గత వైసీపీ ప్రభుత్వం నిలిపివేసిన UGD పనులను, వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్‌ను మళ్లీ పునరుద్ధరించామని తెలిపారు. నెల్లూరు నగర పాలక సంస్థ పరిధిలోని 13వ డివిజన్ యలమవారిదిన్నె రామాలయం వీధిలో 35 లక్షల సాధారణ నిధులతో అత్యాధునికంగా పునర్నిర్మించిన స్వర్ణ వార్డు భవనాన్ని మంత్రి ఘనంగా ప్రారంభించారు.
తనకు అడ్డదారిన డబ్బులు సంపాదించాల్సిన అవసరం లేదని, విద్యాసంస్థల ద్వారా నిజాయితీగా సంపాదించుకునే శక్తి ఉందన్నారు. కేవలం ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతోనే రాజకీయాల్లోకి వచ్చానని స్పష్టం చేశారు. వైసీపీ నేతలు ఎంత రెచ్చగొడితే నెల్లూరు అభివృద్ధి కోసం అంతకంటే 10 రెట్లు ఎక్కువ పనిచేసి చూపిస్తానని మంత్రి సవాల్ విసిరారు..
నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 13వ డివిజన్ యలమవారిదిన్నె రామాలయం వీధిలో నూతనంగా నిర్మించిన '
స్వర్ణ వార్డు భవనాన్ని మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ ఘనంగా ప్రారంభించారు. కార్పొరేషన్ సాధారణ నిధుల నుంచి సుమారు 35 లక్షల అంచనా వ్యయంతో ఈ భవనాన్ని అత్యాధునికంగా పునర్నిర్మించినట్లు మంత్రి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... యలమవారిదిన్నె ప్రాంతంలో ఎక్కువగా షంటింగ్, మేస్త్రీ, ఆటో, ప్లంబర్, ఎలక్ట్రికల్ పనులు చేసుకునే పేద ప్రజలే నివసిస్తున్నారని, తన నియోజకవర్గంలోనే అత్యంత నిరుపేదలు ఉన్న ఈ ప్రాంతంలో రోడ్లు, డ్రెయిన్లను సంపూర్ణంగా అభివృద్ధి చేయడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.
2014-19 మధ్య కాలంలో నెల్లూరులో రూ.550 కోట్లతో ప్రారంభించిన భూగర్భ మురుగునీటి పారుదల (UGD) పనులను గత వైసీపీ ప్రభుత్వం నిలిపివేసిందని మంత్రి నారాయణ ఆరోపించారు. తెచ్చిన హడ్కో లోన్లను కూడా వెనక్కి పోయేలా చేసిందని, వాటిని మళ్లీ రివైవ్ చేయడానికి తనకు ఏడాది సమయం పట్టిందన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో లోన్లను పునరుద్ధరించి, ఆగిపోయిన పనులను వేగవంతం చేశామన్నారు. నగరానికి చివరన ఉన్న ప్రాంతాల కోసం ప్రత్యేకంగా 250 కోట్లు మంజూరు చేశామని, ఇందులో యలమవారిదిన్నె UGD పనులకే రూ.33 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు. వచ్చే ఏడాది జూన్ 12 నాటికి 100% UGD పనులు పూర్తి చేసి నెల్లూరును దోమల రహిత నగరంగా మారుస్తామని చెప్పారు.
పర్యావరణ పరిరక్షణలో భాగంగా CSR నిధులు, దాతల సాయంతో నగరంలో ప్రతి 5 మీటర్లకు ఒక చెట్టు నాటే కార్యక్రమం చేపట్టామని మంత్రి వివరించారు. దీనికోసం ప్రజల పన్నుల డబ్బు గానీ, మున్సిపల్ ఫండ్స్ గానీ వాడలేదన్నారు. మంచి ఉద్దేశంతో చెట్లు నాటిస్తుంటే వైసీపీ నేతలు దానిపై కూడా కాంట్రవర్సీ చేస్తూ దిగజారుడు రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. వారు కామెంట్స్ చేయడంతోనే మరింత పట్టుదలతో మిగతా ప్రాంతాల్లోనూ వెంటనే చెట్లు నాటించామన్నారు. కాలుష్యం లేని నగరాల జాబితాలో నెల్లూరుకు కేంద్ర ప్రభుత్వం నుంచి జాతీయ అవార్డు రావడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.
ఏళ్ల తరబడి కొండలా పేరుకుపోయిన అల్లీపురం డంపింగ్ యార్డ్ చెత్త సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తున్నామని నారాయణ తెలిపారు. రోజుకు 2,000 టన్నుల చొప్పున ప్రాసెస్ చేస్తూ, అక్టోబర్ 2 నాటికి డంపింగ్ యార్డ్‌ను పూర్తిగా ఖాళీ చేస్తామన్నారు. సీఎం చంద్రబాబు గారు రాగానే చెత్త పన్నును రద్దు చేశారని గుర్తుచేశారు. అలాగే రోజుకు 900 టన్నుల చెత్తతో విద్యుత్ తయారు చేసే వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ పనులను మళ్లీ ప్రారంభించామని, ఇది అందుబాటులోకి వస్తే 100 కిలోమీటర్ల పరిధిలో ఎక్కడా చెత్త కుప్పలు కనిపించవని తెలిపారు.
తన వ్యక్తిగత విషయాలపై స్పందిస్తూ, తనకు అడ్డదారిన డబ్బులు సంపాదించాల్సిన అవసరం లేదని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. బిజినెస్ అంతా పిల్లలకు వదిలేశానని, డబ్బు సంపాదించాలనుకుంటే నారాయణ గ్రూప్ ద్వారానే సంపాదించుకోగలనన్నారు. నెల్లూరులో పుట్టి పెరిగిన వాడిగా పేదలకు సహాయం చేయడానికే రాజకీయాల్లోకి వచ్చానని చెప్పారు. ఎవరూ అడగకపోయినా 200 కోట్ల దాతల నిధులతో 15 హైస్కూళ్లు, 45 అంగన్‌వాడీ కేంద్రాలను కార్పొరేట్ స్థాయిలో మోడ్రనైజ్ చేస్తున్నామన్నారు. విమర్శలకు భయపడేది లేదని, ప్రతిపక్షాలు ఎంత డిమోరల్ చేసినా పదింతలు ఎక్కువ పనిచేసి నెల్లూరును అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తానని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో కమిషనర్ నందన్, మాజీ మునిసిపల్ చైర్పర్సన్ తాళ్ళపాక అనురాధ, మాజీ జెడ్పిటిసి విజేత రెడ్డి,వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి,13వ డివిజన్,క్లస్టర్ ఇంచార్జి ఊటుకూరు చంద్ర, ప్రెసిడెంట్ కాయల తిరుపతి, మాజీ కౌన్సిలర్ దాసు, స్థానిక టిడిపి ముఖ్య నేతలు నాయకులు తదితరులు పాల్గొన్నారు.




