Nellore: ఉదయగిరిలో మంత్రి నారాయణ, ఎంపీ వేమిరెడ్డి భారీ అభివృద్ధి పర్యటన

Nellore: ఉదయగిరిలో రూ.1.69 కోట్ల సీసీ రోడ్లను ప్రారంభించిన మంత్రి నారాయణ, ఎంపీ వేమిరెడ్డి. పరిశ్రమల స్థాపన ద్వారా 4 వేల మందికి ఉపాధి కల్పిస్తామని వెల్లడి.

VENKATA PRASAD, UDAYAGIRI
Published on: 7 July 2026 10:08 AM IST
Nellore
X

Nellore: ఉదయగిరిలో మంత్రి నారాయణ, ఎంపీ వేమిరెడ్డి భారీ అభివృద్ధి పర్యటన

నెల్లూరు: నెల్లూరు జిల్లా ఉదయగిరిలో రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ, నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర, జిల్లా కలెక్టర్‌తో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా ఉపాధి హామీ పథకం నిధులతో రూ.1.69 కోట్ల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్లను ఘనంగా ప్రారంభించారు. ఉదయగిరి పట్టణ అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి నారాయణ తెలిపారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టిన సీసీ రోడ్ల నిర్మాణం పూర్తికావడంతో ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయని అన్నారు.

ఉదయగిరి ప్రాంత అభివృద్ధి దిశగా ప్రభుత్వం ఇప్పటికే కీలక చర్యలు చేపట్టిందని మంత్రి వెల్లడించారు. ఈ ప్రాంతంలో నాలుగు పరిశ్రమలకు అనుమతులు మంజూరు చేయగా, వాటి ద్వారా సుమారు నాలుగు వేల మందికి ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు తెలిపారు. పరిశ్రమల స్థాపనతో యువతకు స్థానికంగానే ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని, వలసలను తగ్గించేందుకు ఇది దోహదపడుతుందని చెప్పారు.

గత రెండేళ్లలో ఉదయగిరి నియోజకవర్గ అభివృద్ధి కోసం రూ.34.64 కోట్ల నిధులను ప్రభుత్వం మంజూరు చేసిందని మంత్రి నారాయణ వెల్లడించారు. రహదారులు, తాగునీటి సదుపాయాలు, పారిశుధ్య కార్యక్రమాలు, మౌలిక వసతుల అభివృద్ధికి ఈ నిధులను వినియోగిస్తున్నట్లు వివరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, మంత్రి నారాయణ పర్యటనతో ఉదయగిరి అభివృద్ధికి మరింత ఊతం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తాయని తెలిపారు.

వెలిగొండ ప్రాజెక్టు పూర్తయితే ఉదయగిరి ప్రాంత రూపురేఖలు పూర్తిగా మారిపోతాయని ఎంపీ వేమిరెడ్డి పేర్కొన్నారు. సాగునీరు, తాగునీటి సమస్యలు పరిష్కారమవడంతో పాటు వ్యవసాయం, పరిశ్రమలు, ఉపాధి రంగాల్లో విశేష పురోగతి సాధ్యమవుతుందని అన్నారు. భవిష్యత్తులో ఉదయగిరి ప్రాంతం అభివృద్ధికి ఆదర్శంగా నిలుస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, స్థానిక నాయకులు, పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.

VENKATA PRASAD, UDAYAGIRI

VENKATA PRASAD, UDAYAGIRI

Next Story