Nellore: వీఆర్‌సీ గ్రౌండ్‌‌కు మహర్దశ.పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన!

Nellore: నెల్లూరు వీఆర్‌సీ గ్రౌండ్‌లో ఓపెన్ జిమ్, వాకింగ్ ట్రాక్, స్విమ్మింగ్ పూల్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి నారాయణ. క్రీడలకు పెద్దపీట.

A Praveen, Nellore
Published on: 6 Oct 2026 11:49 AM IST
Nellore
X

Nellore: వీఆర్‌సీ గ్రౌండ్‌‌కు మహర్దశ.పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన!

Nellore: నగరంలోని వీఆర్‌సీ గ్రౌండ్‌కు నూతన హంగులు అద్దేందుకు రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ శ్రీకారం చుట్టారు. తన కుమార్తె షరణితో కలిసి వీఆర్‌సీ గ్రౌండ్‌లో ఇండోర్, అవుట్‌డోర్ జిమ్‌లు, వాకింగ్ ట్రాక్, స్విమ్మింగ్ పూల్, షెల్టర్, టాయిలెట్ల ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు. క్రీడలు, వ్యాయామం, ఆరోగ్య పరిరక్షణకు అనుకూలంగా గ్రౌండ్‌ను మరింత అభివృద్ధి చేయనున్నట్లు మంత్రి తెలిపారు.

వీఆర్‌సీ గ్రౌండ్‌లో జెండా పోల్ ఏర్పాటుకు రూ.20 వేల విరాళం అందించిన డాక్టర్ పోకల రవిని మంత్రి నారాయణ అభినందించారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పంపిన ప్రశంసాపత్రాన్ని డాక్టర్ పోకల రవికి మంత్రి నారాయణ అందజేశారు.

ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ.. చదువులతో పాటు విద్యార్థులకు ఆటలు, వ్యాయామం, క్రీడలకు సమాన ప్రాధాన్యం ఇవ్వాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. వీఆర్ హైస్కూల్ గ్రౌండ్‌లో ఇండోర్, అవుట్‌డోర్ జిమ్‌లు, వాకింగ్ ట్రాక్, స్విమ్మింగ్ పూల్, షెల్టర్, టాయిలెట్ల పనులను ప్రారంభించామని తెలిపారు. బాస్కెట్‌బాల్ కోర్టును కూడా ఆధునీకరిస్తున్నామని చెప్పారు.

స్థలం అందుబాటులో ఉన్న ప్రభుత్వ హైస్కూళ్లలో స్విమ్మింగ్ పూల్స్ ఏర్పాటు చేసే దిశగా చర్యలు తీసుకుంటామని మంత్రి వెల్లడించారు. నెల్లూరు సిటీ నియోజకవర్గ పరిధిలో 18 హైస్కూళ్లను ఆధునీకరిస్తున్నామని తెలిపారు. వీఆర్ హైస్కూల్ అభివృద్ధిని రాష్ట్రమంతా ఆదర్శంగా తీసుకుందని, పాఠశాలకు స్వచ్ఛ అవార్డు కూడా లభించిందని చెప్పారు. అదే తరహాలో డీఎస్సార్, ఆర్ఎస్ఆర్ పాఠశాలలను కూడా అభివృద్ధి చేస్తున్నామని పేర్కొన్నారు.

పాఠశాలల అభివృద్ధిపై రాష్ట్రవ్యాప్తంగా అభినందనలు వస్తుంటే కొందరు వైసీపీ నాయకులు విమర్శలు చేస్తున్నారని మంత్రి నారాయణ అన్నారు. అయితే వైసీపీ నేతల అవాకులు, చవాకులను తాను పట్టించుకోనని స్పష్టం చేశారు. ఉన్నత స్థాయిలో ఉన్న తన స్నేహితులు, పూర్వ విద్యార్థులను సంప్రదించి పాఠశాలల అభివృద్ధికి అవసరమైన నిధులను సేకరిస్తానని తెలిపారు.

వీఆర్‌సీ గ్రౌండ్ అభివృద్ధి పనులతో తమ చిరకాల కోరిక నెరవేరుతోందని వాకర్స్ అసోసియేషన్ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. ఇందుకు మంత్రి నారాయణకు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ హిమబిందు, ఎస్‌ఈ జానీ, డీఈఓ బాలాజీ రావు, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, టీడీపీ నాయకులు యశ్వంత్ రెడ్డి, డాక్టర్ పోకల రవి, సుజన్, పిట్టి సత్యనాగేశ్వరరావు, ఏడుకొండలు, వాకర్స్ అసోసియేషన్ సభ్యులు సుబ్బారెడ్డి, బాబు, నన్నే సాహెబ్, కూటమి నేతలు తదితరులు పాల్గొన్నారు.

A Praveen, Nellore

A Praveen, Nellore