Nellore: గణేష్ ఘాట్‌లో మంత్రులు, ప్రజాప్రతినిధుల ప్రత్యేక పూజలు!

Nellore: నెల్లూరు ఇరుగాలమ్మ గుడి సమీపంలోని గణేష్ ఘాట్ వద్ద మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, నారాయణ, ఎంపీ వేమిరెడ్డి, ఎమ్మెల్యేలు ప్రత్యేక పూజలు చేసి నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించారు.

U.L. NARASIMHULU, NELLORE
Published on: 14 Sept 2026 10:57 PM IST
Nellore
X

Nellore: గణేష్ ఘాట్‌లో మంత్రులు, ప్రజాప్రతినిధుల ప్రత్యేక పూజలు!

నెల్లూరు: వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని నెల్లూరు నగరంలోని ఇరుగాలమ్మ గుడి సమీపంలోని గణేష్ ఘాట్ వద్ద సోమవారం వినాయక చవితి సంబరాలు కోలాహలంగా జరిగాయి. సోమవారం సాయంత్రం నూతనంగా ఏర్పాటు చేసిన గణేష్ మండపాన్ని నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ, శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, స్వర్ణ భారత్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ దీపా వెంకట్, స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రముఖులు, ఉత్సవ కమిటీ సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

గణేష్ ఘాటు వద్ద వినాయక మండపం ఏర్పాటుకు, ఘాట్ నిర్మాణానికి వేమిరెడ్డి దంపతులు, స్వర్ణ భారత్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ దీప వెంకట్ సహాయ సహకారాలు అందించారు. వినాయక మండపంలోని గణనాథుని వద్ద మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలు ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రులు, ఎమ్మెల్యేలకు కోటంరెడ్డి సోదరులు అపూర్వ స్వాగతం పలికారు.

"భక్తులతో మమేకమై నిమజ్జన ఏర్పాట్లపై ఆరా"

నెల్లూరు నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి తమ ఇళ్లలో పూజించుకున్న గణనాథుని విగ్రహాలను భక్తులు భక్తిశ్రద్ధలతో గణేష్ ఘాట్‌కు తీసుకువచ్చి నిమజ్జనం చేశారు. దీంతో ఇరుగాలమ్మ గణేష్ ఘాట్ ప్రాంగణం భక్తజన సందోహంతో కోలాహలంగా మారింది.

ఈ సందర్భంగా మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, డాక్టర్ పొంగూరు నారాయణ, ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి భక్తులతో మమేకమై నిమజ్జన ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఘాట్ వద్ద భక్తులకు కల్పించిన సౌకర్యాలను పరిశీలించి, ఏర్పాట్లపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఘాట్ వద్ద ఏర్పాట్ల పట్ల భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారు.

"దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో అలరించిన కూచిపూడి కళాకారుల సాంస్కృతిక కార్యక్రమాలు"

దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా కృష్ణా జిల్లా కూచిపూడి నుంచి విచ్చేసిన కళాకారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను విశేషంగా అలరించాయి.

ఆంధ్రప్రదేశ్ చరిత్ర, అమరావతి రాజధాని గొప్పతనాన్ని తెలియజేస్తూ కళాకారులు ప్రదర్శించిన ప్రత్యేక నృత్య కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కళాకారుల నృత్య ప్రదర్శనలను మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు వీక్షించి అభినందించారు. అనంతరం కళాకారులను ప్రజాప్రతినిధులు సత్కరించారు.

"భక్తులకు ఇబ్బందులు లేకుండా పటిష్ట ఏర్పాట్లు"

భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఘాట్ పరిసరాల్లో నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మంచినీటి స్టాల్స్ ఏర్పాటు చేశారు. భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశారు.

ఇరుగాలమ్మ గుడి కూడలి వద్ద ట్రాఫిక్‌కు ఎటువంటి అంతరాయం కలగకుండా ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. భక్తులు ప్రశాంతంగా, భక్తిశ్రద్ధలతో వినాయక నిమజ్జన కార్యక్రమాల్లో పాల్గొనేలా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. కార్యక్రమంలో విక్రమ సింహపురి గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

U.L. NARASIMHULU, NELLORE

U.L. NARASIMHULU, NELLORE