Nellore: మంత్రి అచ్చెన్నాయుడు దృష్టికి రైతు సమస్యలు
Nellore: ఎమ్మెల్యే కాకర్ల సురేష్ కీలక భేటీ. పొగాకు, ఆరుదడి పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించాలని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడుకు విజ్ఞప్తి.
Nellore: మంత్రి అచ్చెన్నాయుడు దృష్టికి రైతు సమస్యలు
నెల్లూరు: ఉదయగిరి రైతుల సమస్యలను మంత్రి అచ్చెన్నాయుడుగారి దృష్టికి తీసుకెళ్లారు ఎమ్మెల్యే కాకర్ల సురేష్. పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని, వ్యవసాయ శాఖ మంత్రికి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ విజ్ఞప్తి చేశారు. పొగాకు రైతుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని వ్యవసాయ మంత్రిని కోరారు ఎమ్మెల్యే కాకర్ల సురేష్..
రైతు సంక్షేమమే లక్ష్యం అని చెప్పిన మంత్రి అచ్చెన్నాయుడు తో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ కీలక భేటీ అయ్యారు. గౌరవ రాష్ట్ర వ్యవసాశాఖ మంత్రివర్యులు కింజరాపు అచ్చెన్నాయుడుని గౌరవ ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ మర్యాదపూర్వకంగా కలిసి, ఉదయగిరి నియోజకవర్గంలోని రైతులు ఎదుర్కొంటున్న పలు కీలక వ్యవసాయ సమస్యలను వారి దృష్టికి తీసుకువెళ్లారు.
ఈ సందర్భంగా పొగాకు సాగు చేస్తున్న రైతులు ప్రస్తుతం ఎదుర్కొంటున్న గిట్టుబాటు ధరల సమస్యపై ఎమ్మెల్యే గారు ప్రత్యేకంగా ప్రస్తావించారు. పెరుగుతున్న సాగు ఖర్చులు, మార్కెట్‌లో నెలకొన్న అనిశ్చిత పరిస్థితుల కారణంగా పొగాకు రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొంటూ, రైతులకు న్యాయమైన గిట్టుబాటు ధర లభించేలా ప్రభుత్వం తరఫున అవసరమైన చర్యలు తీసుకొని మద్దతు అందించాలని మంత్రిని కోరారు. అలాగే పొగాకు రైతుల సమస్యలను సమగ్రంగా పరిశీలించి, వారి ఆర్థిక స్థితి మెరుగుపడే విధంగా ప్రత్యేక చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.
అదేవిధంగా ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణ, రైతుల పంటల కొనుగోలు అంశాలపై కూడా ఎమ్మెల్యే మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. ముఖ్యంగా మొక్కజొన్న, సెనగ, పెసర వంటి ఆరుదడి పంటలను రైతులు సాగు చేస్తున్నప్పటికీ, సరైన కొనుగోలు వ్యవస్థ లేకపోవడంతో దళారులు తక్కువ ధరలకు కొనుగోలు చేసి రైతులను నష్టపరుస్తున్నారని వివరించారు. దీనివల్ల రైతులు తమ శ్రమకు తగిన ప్రతిఫలం పొందలేక ఆర్థికంగా నష్టపోతున్న పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో ప్రభుత్వం నేరుగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి, ఆరుదడి పంటలను కూడా మద్దతు ధరకు కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కాకర్ల సురేష్ మంత్రిని కోరారు. రైతులకు గిట్టుబాటు ధర అందడంతో పాటు వ్యవసాయ రంగం మరింత బలోపేతం అయ్యేలా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు. రైతుల సంక్షేమం, వ్యవసాయాభివృద్ధి పట్ల కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే తెలిపారు.




