Nellore: రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం
Nellore: రామతీర్థంలో జూలై 6 నుండి 14 వరకు శ్రీ రామలింగేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు. భక్తుల భద్రతకు పెద్దపీట వేయాలని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఆదేశం.
Nellore: రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం
నెల్లూరు: నెల్లూరు జిల్లా విడవలూరు మండలం రామతీర్థం గ్రామంలో వెలసిన శ్రీ కామాక్షిదేవి సమేత శ్రీ రామలింగేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలను భక్తిశ్రద్ధలతో, వైభవంగా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కోవూరు శాసనసభ్యులు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఆదేశించారు.
ఈ నెల 6వ తేదీ నుంచి 14వ తేదీ వరకు జరగనున్న బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై నెల్లూరులోని ఎమ్మెల్యే కార్యాలయంలో ఆలయ కమిటీ సభ్యులు, అధికారులు, నాయకులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి మాట్లాడుతూ.. గత రెండు సంవత్సరాలుగా కోవూరు నియోజకవర్గంలో నిర్వహిస్తున్న ప్రతి కార్యక్రమంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని వసతులు కల్పిస్తూ, సామాన్యులకు పెద్దపీట వేస్తున్నామని తెలిపారు. కోవూరు నియోజకవర్గంలో జొన్నవాడ శ్రీ కామాక్షి అమ్మవారి ఆలయం, చాముండేశ్వరి అమ్మవారి ఆలయం, రామతీర్థం శ్రీ రామలింగేశ్వరస్వామి ఆలయం వంటి విశిష్టమైన దేవాలయాలు ఉండటం ఈ ప్రాంత ప్రజల అదృష్టమని పేర్కొన్నారు.
బ్రహ్మోత్సవాలు జులై 6న శేషవాహన సేవతో ప్రారంభమవుతాయని, అనంతరం 7న చిలుక వాహనం, 8న హంస వాహనం, 9న పులివాహనం, 10న రావణ సేవ, 11న నంది సేవ, 12న రథోత్సవం, 13న కళ్యాణోత్సవం నిర్వహించనున్నట్లు తెలిపారు. 14వ తేదీన తీర్థవారి (సముద్రస్నానం), రాత్రి తెప్పోత్సవంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయని వెల్లడించారు.
ఉత్సవాల నిర్వహణలో ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు ముందుగానే సమన్వయంతో ప్రణాళికలు రూపొందించి, శాస్త్రోక్తంగా కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ముఖ్యంగా సముద్ర తీర ప్రాంతం కావడంతో భక్తుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని పోలీసు శాఖకు ఆదేశించారు. ట్రాఫిక్‌కు ఎలాంటి అంతరాయం కలగకుండా ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు.




