Nellore: కూటమి పాలనలో ఉద్యోగులకు చీకటి రోజులు.. ఎమ్మెల్సీ పర్వతరెడ్డి

Nellore: కూటమి ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ ఉద్యోగులు తీవ్ర వేధింపులకు గురవుతున్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మండిపడ్డారు.

V. Narasimhulu, Nellore
Published on: 21 April 2026 7:57 PM IST
Nellore
X

Nellore: కూటమి పాలనలో ఉద్యోగులకు చీకటి రోజులు.. ఎమ్మెల్సీ పర్వతరెడ్డి

Nellore: చంద్ర‌బాబు నేతృత్వంలోని కూట‌మి పాల‌న‌ ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు చీక‌టి రోజులుగా మిగిలిపోయింద‌ని, హామీలు అమ‌లు చేయ‌కుండా రెండేళ్లుగా చుక్క‌లు చూపించ‌డ‌మే కాకుండా వాటి గురించి ప్ర‌శ్నిస్తున్న వారిని కేసుల‌తో చంద్ర‌బాబు వేధిస్తున్నాడ‌ని వైయ‌స్సార్సీపీ ఎమ్మెల్సీ ప‌ర్వ‌త‌రెడ్డి చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. నెల్లూరులోని వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాల‌యంలో మీడియాతో మాట్లాడుతూ..

ఎన్నిక‌ల్లో ఉద్యోగుల‌కు ఇచ్చిన హామీలు అమ‌లు చేయాల‌ని డిమాండ్ చేసిన కాకర్ల వెంక‌ట్రామిరెడ్డిని డిస్మిస్ చేయ‌డం ప్ర‌భుత్వ నిరంకుశ వైఖ‌రికి ప‌రాకాష్ట అని చెప్పారు. ఉద్యోగులంతా ఆయ‌న‌కు అండ‌గా నిల‌బ‌డి ఈ నిర్ణ‌యాన్ని వెన‌క్కు తీసుకునేలా ప్ర‌భుత్వంపై ఒత్తిడి తీసుకురావాల‌ని సూచించారు. లేదంటే రాబోయే వైయ‌స్సార్సీపీ ప్ర‌భుత్వంలో ఇవే విధానాలు కొన‌సాగితే చాలామంది న‌ష్ట‌పోతార‌ని హెచ్చ‌రించారు.

ఉద్యోగుల‌ను రాజ‌కీయ అవ‌స‌రాలకు వాడుకున్న చరిత్ర చంద్ర‌బాబుదేన‌ని, బీజేపీకి అనుకూలంగా చేసిన న‌వ నిర్మాణ దీక్ష‌ల‌కు, వ్య‌తిరేకంగా చేసిన ధ‌ర్మ పోరాట దీక్ష‌ల‌కు ఉద్యోగుల‌ను ప‌క్క‌నే పెట్టుకున్నాడ‌ని ధ్వ‌జ‌మెత్తారు. ఉన్న‌త స్థాయి పోలీస్ ఉద్యోగులు స‌హా వేల‌మందిని చంద్ర‌బాబు వేధిస్తున్నాడని మండిప‌డ్డారు. చంద్ర‌బాబు సీఎం అయ్యాక క‌నీసం ఒక్క‌ కొత్త ఉద్యోగం ఇవ్వ‌క‌పోగా 22 నెల‌ల్లోనే 1.72 లక్షల మందిని ఉద్యోగాల నుంచి తొల‌గించాడ‌ని ఎమ్మెల్సీ ప‌ర్వ‌త‌రెడ్డి చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి వివ‌రించారు.

కూట‌మి ప్ర‌భుత్వ పాల‌న ఎమ‌ర్జెన్సీని త‌ల‌పిస్తోందని, హిట్ల‌ర్‌ను మించిపోయి చంద్ర‌బాబు నియంత‌లా వ్య‌వ‌హ‌రిస్తున్నాడని, రాష్ట్రంలో రెండేళ్లుగా ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల‌ను ప్ర‌శ్నించే వారిని అక్ర‌మంగా అరెస్ట్ చేసి త‌ప్పుడు కేసులతో నిర్బంధించే సంస్కృతిని చంద్ర‌బాబు కొనసాగిస్తున్నాడని, ఈ ప్ర‌భుత్వంలో హ‌క్కుల కోసం పోరాడ‌టం కూడా నేర‌మైపోయిందని, పోలీసులు కూట‌మి నాయ‌కుల టార్గెట్‌ల కోసం ప‌నిచేస్తున్నారని,

ఆఖ‌రుకి ప్ర‌భుత్వ ఉద్యోగుల‌ను కూడా వ‌ద‌ల‌కుండా ఈ ప్ర‌భుత్వం భ‌య‌భ్రాంతుల‌కు గురిచేస్తోందని, ప్ర‌భుత్వ ఉద్యోగుల స‌మ‌స్య‌ల‌పై ప్ర‌భుత్వాన్ని నిల‌దీస్తున్నందుకు ఏపీ సెక్రటేరియట్‌ ఉద్యోగుల సంఘం మాజీ అధ్యక్షుడు, ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య (జీఈఎఫ్‌) అధ్యక్షుడైన కాకర్ల వెంకట్రామిరెడ్డిని ఏకంగా సర్వీస్‌ నుంచి డిస్మిస్‌ చేయడం, ప్రభుత్వ నిరంకుశ వైఖరికి పరాకాష్ట అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఉద్యోగుల‌కు రావాల్సిన ఐఆర్‌, అరియ‌ర్స్‌, నాలుగు పెండింగ్ డీఏలు, పీఆర్సీ విష‌యంలో రాష్ట్ర స్థాయి టీచ‌ర్స్ స‌మావేశంలో ప్ర‌భుత్వాన్ని హెచ్చ‌రించ‌డంతో త‌ట్టుకోలేక‌పోయిందని, కాకర్ల వెంకట్రామిరెడ్డిని ఏకంగా సర్వీస్‌ నుంచి డిస్మిస్‌ చేయడంతో పాటు, కనీసం రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ కూడా ఇవ్వబోమని ప్రకటించడం చూస్తుంటే ప్రభుత్వ ఉద్యోగుల పట్ల వేధింపు మరొకటి ఉండదని, ఆయ‌న వైయ‌స్సార్సీపీ హయాంలో ఉద్యోగుల స‌మ‌స్య‌ల‌పై గ‌ళ‌మెత్తారని,

కానీ దాన్ని అణ‌చివేయాల‌ని అనుకోకుండా వారి స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఆలోచించ‌డం జ‌రిగిందని పేర్కొన్నారు. ప్ర‌భుత్వ రుణం తీర్చుకోవాల‌ని ఆర్టీసీ ఉద్యోగుల స‌మావేశంలో కాక‌ర్ల వెంక‌ట్రామిరెడ్డి పిలుపునిచ్చార‌ని, రాజ‌కీయ పార్టీకి అనుకూలంగా వ్య‌వ‌హ‌రించాడంటూ ఆయ‌న మీద ఉన్న అభియోగం. దానిపై వివ‌ర‌ణ కోరుతూ గ‌తంలో ఆయ‌న‌కు ప్ర‌భుత్వం నోటీసులు కూడా జారీ చేసిందని తెలిపారు ..దానికి ఆయ‌న వివ‌ర‌ణ కూడా ఇచ్చారని, ప్ర‌భుత్వం చేస్తున్న ఆరోప‌ణ‌ల‌కు సంబంధించి ఎలాంటి ఆడియో,

వీడియో ఆధారాలు కూడా లేవ‌ని కాకర్ల వెంక‌ట్రామిరెడ్డి సైతం చెబుతున్నారని చెప్పారు. డిపో మేనేజ‌ర్ సైతం ఇలాంటి వ్యాఖ్య‌లేవీ చేయ‌లేద‌ని చెప్పారు. అయినా ప్ర‌భుత్వం ఆయ‌న్ను డిస్మిస్ చేసిందని చెప్పారు. ప్ర‌భుత్వ నిరంకుశ విధానాల‌ను, హామీలు విస్మ‌రిస్తున్న వైనాన్ని, హ‌క్కుల ప్ర‌శ్నిస్తుంటే ఈ ప్ర‌భుత్వం త‌ట్టుకోలేక‌పోతోందని, హామీలు అమ‌లు చేయ‌డం చేత‌కాక ఉద్యోగ సంఘాల నాయ‌కుల‌ను స‌ర్వీస్ నుంచి తొల‌గించ‌డం దుర్మార్గం అని అన్నారు... రాబోయే రోజుల్లో వైయ‌స్సార్సీపీ ప్ర‌భుత్వం ఏర్ప‌డిన త‌ర్వాత ఉద్యోగుల విష‌యంలో ఇలాగే గ‌నుక వ్య‌వ‌హ‌రిస్తే ఎంతమంది ప్ర‌భుత్వ ఉద్యోగులు,

పోలీసులు స‌ర్వీసుల్లో ఉంటారో ఆలోచించుకోవాలని చెప్పారు. యూనియ‌న్ల‌కు అతీతంగా ఉద్యోగులంతా ఈ చ‌ర్య‌ను ఖండించ‌క‌పోతే భ‌విష్యత్తులో వారే తీవ్రంగా న‌ష్ట‌పోయే ప్ర‌మాదం ఉంద‌ని హెచ్చ‌రిస్తున్నానని చెప్పారు. నేడు అధికార పార్టీల‌కి కొమ్ముకాస్తూ నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా వ్య‌వ‌హ‌రిస్తున్న ఉద్యోగుల ప‌రిస్థితి రాబోయే రోజుల్లో ఎలా ఉంటుందో ఆత్మ‌విమ‌ర్శ చేసుకోవాలని సూచించారు .2019 ఎన్నిక‌ల‌కు ముందు కొంత‌మంది ఉద్యోగులు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ప్ర‌చారం చేశారని , అయినా అధికారంలోకి వ‌చ్చాక వారిని జ‌గ‌న్ స‌స్పెండ్ చేయ‌లేదని గుర్తుంచుకోవాలని చెప్పారు.

ఉద్యోగుల‌ను రాజ‌కీయ కార్య‌క్ర‌మాల‌కు వాడుకునే విధానాల‌కు ఆద్యుడు చంద్ర‌బాబేనని, ప్ర‌త్యేక ప్యాకేజీ ప్ర‌క‌టించినప్పుడు బీజేపీకి అనుకూలంగా న‌వ నిర్మాణ దీక్ష‌ల పేరుతో ఉద్యోగుల‌ను ప‌క్క‌నే కూర్చుండ‌బెట్టుకుని దీక్ష‌లు చేశాడని,బీజేపీతో తెగ‌దెంపులు చేసుకున్న త‌ర్వాత ధ‌ర్మ పోరాట దీక్ష‌ల‌కు కూడా ప్ర‌భుత్వ ఉద్యోగుల‌ను వాడుకున్నాడు.

త‌న రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల కోసం ఉద్యోగుల‌ను దీక్ష‌ల్లో వాడుకున్నాడని చెప్పారు. ఆఖ‌రుకి నాటి ఏపీ ఎన్‌జీవో సంఘం నాయ‌కుడు ప‌ర్చూరి అశోక్ బాబును క‌ర్నాట‌క అసెంబ్లీ ఎన్నిక‌ల ప్ర‌చారానికి పంపించి బీజేపీకి వ్య‌తిరేకంగా ప్ర‌చారం చేయించాడని, అదే అశోక్‌బాబుకి చంద్ర‌బాబు ఎమ్మెల్సీ ప‌ద‌వి ఇచ్చాడని గుర్తు చేశారు.

చంద్ర‌బాబు వందేళ్లు ముఖ్య‌మంత్రిగా ఉన్నా చేయ‌లేని ప‌నులు.. వైయ‌స్ జ‌గ‌న్ ఐదేళ్ల పాల‌న‌లోనే ఉద్యోగులకు చేసి పెట్టాడని, అధికారంలోకి వ‌స్తే బ‌కాయిలు తీర్చేస్తాన‌ని చెప్పిన చంద్ర‌బాబు, ఉద్యోగులను తీవ్రంగా వంచించాడని, బ‌కాయిలు ఏకంగా రూ. 35 వేల కోట్ల‌కు పెంచేశాడని, ఐఆర్, పీఆర్సీ ఊసే లేదని, నాలుగు డీఏలు పెండింగ్ పెట్టాడని, అధికారంలోకి వ‌చ్చాక వాలంటీర్ల జీతాలు రూ.5 వేల నుంచి రూ. 10 వేల‌కు పెంచుతాన‌ని చెప్పి, ఏకంగా ఉద్యోగాల నుంచి తొల‌గించి 2.60 ల‌క్ష‌ల కుటుంబాల‌కు ద్రోహం చేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.

సచివాల‌య ఉద్యోగుల‌ను ఈ ప్ర‌భుత్వం తీవ్రంగా వేధిస్తోందని, టీచ‌ర్లు, కాంట్రాక్టు ఉద్యోగుల‌ను వేధిస్తున్నారని, రెండేళ్లుగా ఉద్యోగుల‌కు ప్ర‌త్య‌క్ష న‌ర‌కం చూపిస్తున్నారని, గత ప్రభుత్వంలో ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు 96,675 మంది ఉండగా, గత ఏడాది డిసెంబరు నాటికి వారి సంఖ్య 87,681.

ఏకంగా 9 వేల మంది ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులను తొల‌గించారని చెప్పారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 22 నెలల్లో ఏకంగా 1.72 లక్షల ఉద్యోగాలు పోయాయని, గత వైయ‌స్సార్సీపీ ప్రభుత్వంలో 2024 మార్చి నాటికి ఉద్యోగుల సంఖ్య 11.79 లక్షలు వుండగా, చంద్రబాబు పాలనలో 2025 డిసెంబర్‌ నాటికి ఉద్యోగుల సంఖ్య 10.07 లక్షలేనని చెప్పారు.

చివ‌ర‌కు చంద్ర‌బాబు పాల‌న‌లో పోలీసు అధికారుల పరిస్థితి కూడా దారుణంగా ఉందని, డీజీ స్థాయి అధికారి పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు మీద‌ తప్పుడు కేసులు పెట్టి అరెస్టు చేశారని, దళిత వర్గానికి చెందిన డీజీ స్థాయి అధికారి సునీల్‌కుమార్, మరో అడిషినల్‌ డీజీ సంజయ్, డీఐజీ విశాల్‌ గున్నీ, బీసీ వర్గానికి చెందిన ఐజీ కాంతి రాణా టాటా తదితరులను తప్పుడు కేసులు పెట్టి సస్పెండ్‌ చేయించారని చెప్పారు. ఇంకా మరెందరో ఎస్పీల మీద తప్పుడు కేసులు పెట్టి విచారణ పేరుతో వేధిస్తున్నారని. వీరే కాకుండా నలుగురు నాన్‌క్యాడర్‌ ఎస్పీలు,

ఒక కమాండెంట్‌ స్థాయి అధికారి, 22 మంది అడిషనల్‌ ఎస్పీలు, 55 మంది డీఎస్పీలకు పోస్టింగ్‌లు లేవని, మరో ఆరుగురు డీఎస్పీలు, ముగ్గురు అడిషినల్‌ కమాండెంట్‌లు, ఇద్దరు అసిస్టెంట్‌ కమాండెంట్లను కూడా హెడ్‌ క్వార్టర్స్‌లో రిపోర్ట్‌ చేయమంటున్నారని చెప్పారు. 8 మంది డీఎస్పీలను సస్పెండ్‌ చేశారని, వీరు కాకుండా మరో 80 నుంచి 100 మంది ఇన్‌స్పెక్టర్లు, వందలాది కానిస్టేబుళ్లు వీఆర్‌లో ఉన్నారని తెలిపారు. చంద్రబాబు కోసం చ‌ట్టాలు ఉల్లంఘించి వైయ‌స్సార్సీపీ నాయ‌కుల మీద అక్ర‌మ కేసులు పెట్ట‌డానికి స‌హ‌క‌రించ‌డం లేద‌న్న కార‌ణంతో పోలీసుల‌ను వేధిస్తున్నాడని చెప్పారు.

రాష్ట్రంలో ఎంతటి దుర్మార్గపు పాలన నడుస్తోందని చెప్పడానికి ఇవన్నీ ఉదాహరణలు. కేవలం తన మోచేతి నీళ్లు తాగే అధికారులను మాత్రమే పెట్టుకుని వారిని అవినీతిలో భాగస్వాములను చేసుకుంటున్నారని చెప్పారు. రెడ్‌బుక్‌ను ఉద్యోగులపైనా ప్రయోగించడం అత్యంత హేయం. ప్రభుత్వం తన వైఖరి మార్చుకోవాలి. కాక‌ర్ల వెంక‌ట్రామిరెడ్డిని త‌క్ష‌ణం విధుల్లోకి తీసుకోవాలని ప‌ర్వ‌త‌రెడ్డి చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి ప్ర‌భుత్వాన్ని డిమాండ్ చేశారు.

V. Narasimhulu, Nellore

V. Narasimhulu, Nellore

Next Story