Atmakur: ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి ఏకగ్రీవాలా?: మేకపాటి విక్రమ్ రెడ్డి

Atmakur: ఆత్మకూరు నియోజకవర్గంలో మంత్రి ఆనం అండతో వైఎస్సార్‌సీపీ నామినేషన్లను బలవంతంగా తిరస్కరింపజేసి ఏకగ్రీవాలు చేసుకున్నారని మేకపాటి విక్రమ్ రెడ్డి మండిపడ్డారు.

TS Murthy, Atmakuru(Nellore)
Published on: 29 Oct 2026 3:49 PM IST
Atmakur
X

Atmakur: ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి ఏకగ్రీవాలా?: మేకపాటి విక్రమ్ రెడ్డి

Atmakur: ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలను ఎదుర్కొనే ధైర్యం లేకే అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఏకగ్రీవాలు సాధించుకుంటున్నారా? ప్రజల మద్దతు ఉందని చెప్పుకునే కూటమి నాయకులకు ప్రతిపక్ష అభ్యర్థులు బరిలో ఉంటే భయమెందుకు? నామినేషన్ల నుంచి ఉపసంహరణల వరకు చోటుచేసుకున్న పరిణామాలు ప్రజలకు కూటమి పాలన ఎలా ఉందో స్పష్టమైన సంకేతాన్ని ఇస్తున్నాయని నెల్లూరు జిల్లా ఆత్మకూరు మాజీ శాసనసభ్యులు, నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త మేకపాటి విక్రమ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

నెల్లూరు జిల్లా ఆత్మకూరులోని మేకపాటి క్యాంపు కార్యాలయంలో గురువారం ఆయన మాట్లాడుతూ ఎన్నికల ప్రక్రియలో జరిగిన అక్రమాలపై కలెక్టర్‌, ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినా స్పందన లేకపోవడం అధికారుల తీరుకు నిదర్శనమని విమర్శించారు. ఆత్మకూరు మున్సిపాలిటీతో పాటు ఎంపీటీసీ ఎన్నికల్లో చోటుచేసుకున్న పరిణామాలు చూస్తుంటే రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఆధ్వర్యంలో ఎన్నికల ప్రక్రియను ఎలా ప్రభావితం చేస్తున్నారో సుస్పష్టమవుతుందన్నారు.

చేజర్ల మండలంలో ఎంపీటీసీ ఎన్నికల్లో పది సెగ్మెంట్లకు సంబంధించి తొమ్మిది మంది వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణకు గురి చేశారని, అవసరమైన పత్రాలు లేవంటూ వివిధ కారణాలు చూపించి నామినేషన్లను తిరస్కరించారని, అభ్యంతరాలు తెలిపినా అధికారులు పట్టించుకోలేదని అన్నారు. మర్రిపాడు మండలంలోని మూడు సెగ్మెంట్లలోనూ ఇదే తరహా పరిస్థితులు ఎదురయ్యాయని తెలిపారు.

అధికార పార్టీ అభ్యర్థుల విషయంలో వేగంగా వ్యవహరించిన అధికారులు, వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను మాత్రం గంటల తరబడి వేచి ఉండేలా చేశారని, భీమవరం సెగ్మెంట్‌లో మహిళా అభ్యర్థి సుమారు ఆరు గంటలపాటు ప్రయత్నించినా నామినేషన్‌ను తిరస్కరించారని పేర్కొన్నారు.మర్రిపాడు, సంగం, ఏఎస్‌పేట ప్రాంతాల్లో నామినేషన్ల ఉపసంహరణల సమయంలో పోలీసు బలగాలను మోహరించి వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు, కార్యకర్తలను బయటకు పంపించారని అన్నారు.

దుకాణాలు మూసివేయించడం, సీసీటీవీ కెమెరాలు పనిచేయకపోవడం వంటి పరిణామాలు చోటు చేసుకున్నాయన్నారు. ముఖ్యంగా ఎన్నికల రిటర్నింగ్ అధికారులు, ఆత్మకూరు సీఐ గంగాధర్, పోలిసులు వ్యవహరించిన తీరు నాయకులందరూ చూశారని, ఇక జరగబోయే ఎన్నికల సమయానికి వాళ్లు విధుల్లో ఉంటే పరిస్థితులు మరింతగా దిగజారుతాయన్నారు.

అభ్యర్థుల సమ్మతి లేకుండానే ఉపసంహరణలు జరిగినట్లు చూపించి ఏకగ్రీవాలు ప్రకటించారని, అభ్యర్థులు స్వయంగా హాజరయ్యారా, ఉపసంహరణ పత్రాలపై సంతకాలు చేసింది ఎవరు, అభ్యర్థుల సమ్మతి తీసుకున్నారా, అనే ప్రశ్నలకు అధికారులు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఈ వ్యవహారానికి సంబంధించిన సీసీటీవీ దృశ్యాలను అందించాలని కోరినా స్పందన లేదని అన్నారు.. కలెక్టర్‌, రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినా చర్యలు లేకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు.

ఆనం ఆదేశాలతోనే అధికారుల ఆటలా?

మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అండతోనే కొందరు అధికారులు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించారని,ఈ విషయంపై సమగ్ర విచారణ జరగాలని డిమాండ్‌ చేశారు. ఎన్నికల నిర్వహణలో పారదర్శకత ఉండాల్సిన అధికారులు పక్షపాతానికి పాల్పడడం ఆందోళన కలిగిస్తుంద్ననారు.కూటమి పార్టీ ప్రజలకు మంచి పాలన అందించి ఉంటే స్వేచ్ఛగా ఎన్నికలను ఎదుర్కోవాలని, ప్రతిపక్ష అభ్యర్థులను బరిలో లేకుండా చేయడం రాజకీయ విజయంగా చెప్పుకోవడం సిగ్గుచేటని విమర్శించారు.

ప్రజల తీర్పును ఎదుర్కొనే బదులు ఎన్నికల ప్రక్రియనే ప్రభావితం చేయాలని చూడటం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమన్నారు.ప్రజల్లో ఆదరణ ఉంటే ఎన్నికల్లో పోటీకి భయపడాల్సిన అవసరం లేదని వైఎస్సార్‌సీపీ నేతలు స్పష్టం చేశారు. అభ్యర్థుల ఉపసంహరణలు, నామినేషన్ల తిరస్కరణలపై వివాదాలు తలెత్తుతున్న నేపథ్యంలో ఏకగ్రీవాలను గొప్ప విజయాలుగా ప్రచారం చేసుకోవడం హస్యాస్పదమన్నారు.

TS Murthy, Atmakuru(Nellore)

TS Murthy, Atmakuru(Nellore)