Kovur: కోవూరులో పొట్టి శ్రీరాములు విగ్రహావిష్కరణ.. పాల్గొన్న వేమిరెడ్డి దంపతులు!
Kovur: కోవూరు గాంధీ పార్కులో అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఆవిష్కరించారు.
Kovur: కోవూరులో పొట్టి శ్రీరాములు విగ్రహావిష్కరణ.. పాల్గొన్న వేమిరెడ్డి దంపతులు!
కోవూరు: కోవూరు పట్టణంలోని గాంధీ పార్కులో ఏర్పాటు చేసిన అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని ఆదివారం సాయంత్రం నెల్లూరు పార్లమెంటు సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి , కోవూరు శాసనసభ్యులు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి మాట్లాడుతూ.. కోవూరు గాంధీ పార్కులో ఈ రోజు ఒక విగ్రహాన్ని మాత్రమే ఆవిష్కరించడం లేదని, తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం తన ప్రాణాలను అర్పించిన ఒక మహనీయుడి త్యాగాన్ని మన మధ్య శాశ్వతంగా నిలబెడుతున్నామని అన్నారు.
తెలుగు ప్రజలకు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కావాలనే లక్ష్యంతో పొట్టి శ్రీరాములు 1952 అక్టోబర్ 19న ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించి, 58 రోజుల పాటు తన ప్రాణాలను పణంగా పెట్టి పోరాడారని తెలిపారు. చివరకు ప్రాణత్యాగం చేసిన ఆయన త్యాగం దేశవ్యాప్తంగా ఉద్యమానికి కారణమైందని, ఆయన మరణించిన నాలుగు రోజుల్లోనే 1952 డిసెంబర్ 19న అప్పటి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటును ప్రకటించారని పేర్కొన్నారు.
పొట్టి శ్రీరాములు త్యాగాన్ని, ఆయన ఆశయాలను భావితరాలకు తెలియజేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఎమ్మెల్యే అన్నారు. ఆయన 58 రోజుల ఆమరణ నిరాహార దీక్షకు గుర్తుగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో 58 అడుగుల ‘స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైజ్’ను ఏర్పాటు చేయడం ద్వారా ఆయన త్యాగాన్ని గౌరవించారని గుర్తుచేశారు.
సొంత నిధులతో అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని ఏర్పాటు చేసిన గాదిరాజు అశోక్ ని ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అభినందించారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న నెల్లూరు పార్లమెంటు సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ.. పొట్టి శ్రీరాములు కుటుంబ సభ్యులు ఎంతో దూరం నుంచి ఈ కార్యక్రమానికి రావడం సంతోషంగా ఉందన్నారు. పట్టుదలతో అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని ఏర్పాటు చేసి, ప్రారంభోత్సవానికి తమను ఆహ్వానించిన గాదిరాజు అశోక్ ని అభినందించారు. పొట్టి శ్రీరాములు మన జిల్లా వ్యక్తి అని, 1952లో మరణించినప్పటికీ ఇప్పటికీ ప్రజల గుండెల్లో నిలిచిపోయారని ఎంపీ అన్నారు.
ఈ తరంలో చరిత్ర తెలుసుకునే ఆసక్తి తగ్గుతున్న నేపథ్యంలో, రాబోయే తరాలకు పొట్టి శ్రీరాములు గొప్పతనం తెలియాలనే ఉద్దేశంతో విగ్రహాన్ని ఏర్పాటు చేయడం చాలా గొప్ప విషయమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో శ్రీ పొట్టి శ్రీరాములు మేనల్లుళ్లు హనుమంతురావు , నరసింహారావు , సత్యనారాయణ, వీరాంజనేయులు , సుబ్రహ్మణ్యం కోవూరు టౌన్ అధ్యక్షులు ఇంతా మల్లారెడ్డి పాల్గొన్నారు.




