Naidupeta: పబ్లిక్ హెల్త్ వర్కర్ల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా పంపిణీ!

Naidupeta: నాయుడుపేట మున్సిపాలిటీలో మరణించిన 7 మంది పబ్లిక్ హెల్త్ వర్కర్ల కుటుంబాలకు ఎమ్మెల్యే డాక్టర్ విజయశ్రీ ₹14 లక్షల ఎక్స్‌గ్రేషియా చెక్కులు అందజేశారు.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 25 Aug 2026 3:45 PM IST
Naidupeta
X

Naidupeta: పబ్లిక్ హెల్త్ వర్కర్ల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా పంపిణీ!

Naidupeta: తిరుపతి జిల్లా నాయుడుపేట మున్సిపాలిటీ కార్యాలయంలో ఈరోజు నిర్వహించిన కార్యక్రమంలో సూళ్లూరుపేట నియోజకవర్గ శాసనసభ్యురాలు డాక్టర్ నెలవల విజయశ్రీ పాల్గొని, మరణించిన పబ్లిక్ హెల్త్ వర్కర్ల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా చెక్కులను పంపిణీ చేశారు.

నాయుడుపేట మున్సిపాలిటీలో పనిచేస్తూ మరణించిన 7 మంది పబ్లిక్ హెల్త్ వర్కర్ల కుటుంబాలకు ఒక్కొక్క కుటుంబానికి ₹2 లక్షల చొప్పున మొత్తం ₹14 లక్షల ఎక్స్‌గ్రేషియా చెక్కులను ఎమ్మెల్యే విజయ శ్రీ అందజేశారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పి, ప్రభుత్వం తరఫున అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే డా. నెలవల విజయశ్రీ మాట్లాడుతూ, పట్టణాల పరిశుభ్రత, ప్రజారోగ్య పరిరక్షణలో పారిశుద్ధ్య కార్మికుల సేవలు ఎంతో కీలకమైనవని పేర్కొన్నారు. ఎండ, వాన అనే తేడా లేకుండా ప్రజల ఆరోగ్యం కోసం నిరంతరం శ్రమిస్తున్న పారిశుద్ధ్య కార్మికుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. విధి నిర్వహణలో ఉంటూ మరణించిన కార్మికుల కుటుంబాలకు అండగా నిలవడం ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్నారు.

అనంతరం నాయుడుపేట పట్టణంలో ప్రజలకు చెత్తబుట్టలను పంపిణీ చేశారు. ప్రతి ఒక్కరూ తమ ఇళ్లతో పాటు పరిసరాల పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని, తడి–పొడి చెత్తను వేరు చేసి మున్సిపల్ సిబ్బందికి అందించాలని ఎమ్మెల్యే విజయ శ్రీ సూచించారు. ప్రజల సహకారంతోనే పట్టణాన్ని మరింత పరిశుభ్రంగా, ఆరోగ్యకరంగా తీర్చిదిద్దగలమని పేర్కొన్నారు.

పారిశుద్ధ్య కార్మికుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుంది. పరిశుభ్రత అనేది మున్సిపల్ సిబ్బంది బాధ్యత మాత్రమే కాదు, ప్రతి పౌరుడి బాధ్యత. స్వచ్ఛమైన నాయుడుపేట నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి అని ఎమ్మెల్యే డా. నెలవల విజయశ్రీ పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో కూటమి ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, లబ్ధిదారుల కుటుంబ సభ్యులు మరియు ప్రజలు పాల్గొన్నారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story