Nellore: నర్రవాడ వైభవంగా వెంగమాంబ అమ్మవారి కళ్యాణం
Nellore: నర్రవాడలో శ్రీ వెంగమాంబ అమ్మవారి బ్రహ్మోత్సవాలు. వైభవంగా గురువయ్య స్వామి కళ్యాణం. పట్టు వస్త్రాలు సమర్పించిన ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్.
Nellore: నర్రవాడ వైభవంగా వెంగమాంబ అమ్మవారి కళ్యాణం
నెల్లూరు: నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలం నర్రవాడలో జరుగుతున్న శ్రీ వెంగమాంబ అమ్మవారి బ్రహ్మోత్సవాలు ఆధ్యాత్మిక శోభతో భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. బ్రహ్మోత్సవాల్లో అత్యంత ప్రధాన ఘట్టమైన శ్రీ వెంగమాంబ అమ్మవారి గురువయ్య స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవం వేలాది మంది భక్తుల సమక్షంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు.
కళ్యాణ మహోత్సవంలో ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ పాల్గొని అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీస్సులు పొందారు. సంప్రదాయం ప్రకారం పచ్చవ, వేమూరి కుటుంబీకులు కళ్యాణోత్సవానికి సంబంధించిన శాస్త్రోక్త కైంకర్యాలను నిర్వహించారు.
వేద పండితుల మంత్రోచ్ఛారణలు, మంగళ వాయిద్యాల నాదం మధ్య దివ్య కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది.ఈ వేడుకను తిలకించేందుకు తెలుగు రాష్ట్రాల నలుమూలల నుంచి భక్తులు భారీ సంఖ్యలో నర్రవాడకు చేరుకున్నారు. దివ్య కళ్యాణాన్ని భక్తిపారవశ్యంతో వీక్షించిన భక్తులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తమ మొక్కులు చెల్లించుకున్నారు.
ఆలయ ప్రాంగణం అంతా గోవింద నామస్మరణలు, మంగళహారతులు, భక్తుల జయజయధ్వానాలతో మార్మోగింది.ఆలయ అధికారులు, అర్చకులు, ఉత్సవ కమిటీ సభ్యులు సమన్వయంతో ఉత్సవాలను శాస్త్రోక్తంగా నిర్వహించగా, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా విస్తృత ఏర్పాట్లు చేశారు.
దివ్య కళ్యాణ మహోత్సవం విజయవంతంగా ముగియడంతో నర్రవాడ క్షేత్రం భక్తజన సందోహంతో కళకళలాడింది. అమ్మవారి దివ్య దర్శనం, కళ్యాణ మహోత్సవాన్ని తిలకించిన భక్తులు ఆధ్యాత్మిక అనుభూతితో తిరుగు ప్రయాణమయ్యారు.




