Nellore: ఆదూరుపల్లిలో 12.89 లక్షల విలువైన యూరియా అక్రమ నిల్వలు సీజ్!
Nellore: నెల్లూరు జిల్లా చేజర్ల మండలం ఆదూరుపల్లిలోని శ్రీ వీరాంజనేయ ఏజెన్సీపై వ్యవసాయ శాఖ విజిలెన్స్ అధికారులు మెరుపు దాడులు చేశారు.
Nellore: ఆదూరుపల్లిలో 12.89 లక్షల విలువైన యూరియా అక్రమ నిల్వలు సీజ్!
Nellore: నెల్లూరు జిల్లాలో యూరియా అక్రమ నిల్వలు భారీగా బయటపడ్డాయి. చేజర్ల మండలం ఆదూరుపల్లి లోని శ్రీ వీరాంజనేయ ఏజెన్సీలో పెద్ద ఎత్తున నిల్వలు ఉన్నట్లు వ్యవసాయ శాఖ విజిలెన్స్ విభాగం గుర్తించింది పక్కా సమాచారంతో... శ్రీ వీరాంజనేయ ఏజెన్సీ లోతనిఖీలు నిర్వహించిన విజిలెన్స్ అధికారులకు, కళ్ళు బైర్లు కమ్మే నిల్వలు కనిపించాయి. దీంతో ఏజెన్సీ నిర్వాహకులను అదుపులోకి తీసుకున్న విజిలెన్స్, యూరియా అక్రమ నిల్వలను సీజ్ చేసింది.
జిల్లాలో రెండో పంట సాగు నేపథ్యంలో యూరియా కోసం ఓవైపు రైతులు రోడ్డెక్కి ఆందోళన చేస్తున్న క్రమంలో... పెద్ద ఎత్తున అక్రమ నిల్వలో బయటపడటం ఇప్పుడు వ్యవసాయ శాఖలో కలవరపెడుతోంది... ఒకవైపు నైరుతి రుతుపవనాల తొలకరి జల్లులతో సాగుకు సిద్ధమవుతూ... యూరియా కోసం రైతులు నానా తంటాలు పడుతుండగా... ఇంకోవైపు కొందరు వ్యవసాయ అధికారులు అక్రమార్కులు కలిసి, పెద్ద ఎత్తున రైతులకందాల్సిన యూరియాను బ్లాక్ మార్కెట్ కు తరలిస్తున్నారన్న ఆరోపణలకు, తాజా సంఘటనతో అవుననే సమాధానమే వస్తోంది
చేజర్ల మండలం ఆదురుపల్లిలోని శ్రీ వీరాంజనేయ ఏజెన్సీలో అక్రమంగా నిల్వ ఉంచిన యూరియాను స్వాధీనం చేసుకున్న అధికారులు, నిర్వాహకులపై క్రిమినల్ కేసు నమోదు చేశారు. అక్రమ యూరియా నిల్వలను అధికారులు గుర్తించి సీజ్ చేశారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నిల్వ ఉంచిన రూ.12 లక్షలకుపైగా విలువైన యూరియా స్టాక్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో సంబంధిత ఎరువుల దుకాణంపై క్రిమినల్ కేసు నమోదు చేశారు.
విజిలెన్స్ వ్యవసాయ శాఖ అధికారులు నిర్వహించిన తనిఖీలలో షాపు రికార్డులకు, గోదాములో ఉన్న ఎరువుల నిల్వలకు, పొంతన లేకపోవడంతో.. అక్రమ నిల్వగా గుర్తించారు. ప్రభుత్వం నిర్దేశించిన పరిమితికి మించి అక్రమంగా నిల్వ ఉంచిన 1,423 యూరియా బస్తాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ స్టాక్ విలువ సుమారు రూ.12 లక్షల 89 వేల 847గా అంచనా వేశారు.
నిబంధనలు ఉల్లంఘించి ఎరువులను నిల్వ ఉంచినందుకు సంబంధిత యాజమాన్యంపై, క్రిమినల్ కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. రైతులకు ఇబ్బందులు కలిగించే విధంగా ఎరువుల కృత్రిమ కొరత సృష్టించినా, బ్లాక్ మార్కెట్‌కు తరలించినా కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు.




