Atmakur: ప్రాచీన ఆలయాల పూర్వవైభవమే లక్ష్యం: మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి!
Atmakur: సనాతన ధర్మ పరిరక్షణ, ప్రాచీన ఆలయాల పునరుద్ధరణే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్పష్టం చేశారు.
Atmakur: ప్రాచీన ఆలయాల పూర్వవైభవమే లక్ష్యం: మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి!
ఆత్మకూరు: రాష్ట్రంలో సనాతన ధర్మ పరిరక్షణ, ఆధ్యాత్మిక సంప్రదాయాల పరిరక్షణతో పాటు చారిత్రక ఆలయాల పునరుద్ధరణకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నామని రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు.ఆదివారం నెల్లూరు జిల్లా ఆత్మకూరులో చారిత్రాత్మక నేపథ్యం గల శ్రీ అలగనాథ స్వామివారి ఆలయంలో రూ.80 లక్షల దేవాదాయ శాఖ నిధులతో నూతనంగా నిర్మించిన కళ్యాణ మండపాన్ని మంత్రి వైభవంగా ప్రారంభించారు.
తొలుత ఆలయానికి విచ్చేసిన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి ఆలయ మర్యాదలతో అర్చకులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజల్లో మంత్రి పాల్గొన్నారు.ఈ సందర్భంగా జరిగిన సభలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోని ఆలయాల్లో నిత్య ధూపదీప నైవేద్యాలు కొనసాగేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని తెలిపారు. ఆలయాల్లో నిత్య దీపం పెట్టే వారు లేకపోవడం, నైవేద్యాలు సమర్పించేందుకు అవసరమైన వనరులు లేకపోవడం వల్ల అనేక ఆలయాల్లో ఆగమ సంప్రదాయాలు సక్రమంగా కొనసాగడం లేదని పేర్కొన్నారు.
ప్రతి ఆలయంలో కనీసం దీపం వెలిగించి, మంత్రోచ్చారణ చేయగలిగిన వ్యక్తి అందుబాటులో ఉంటే ఆలయాలకు తిరిగి పవిత్రత చేకూరుతుందని ప్రభుత్వం భావించిందన్నారు.ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల సమయంలోనే ధూపదీప నైవేద్య పథకంపై ఆలోచన చేశారని తెలిపారు. అర్చకులు, వేద పండితులు లేని ప్రాంతాల్లో స్థానికంగా ఉన్న పాఠశాల ఉపాధ్యాయులు, బ్రాహ్మణ కుటుంబాలు లేదా మహిళలు కూడా ఆలయంలో దీపం వెలిగించి పూజలు నిర్వహించేలా ప్రోత్సహించేందుకు ఈ పథకాన్ని అమలు చేస్తున్నామని చెప్పారు.
రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం సుమారు 6,800 ఆలయాలకు ధూపదీప నైవేద్య పథకాన్ని అమలు చేస్తున్నామని మంత్రి తెలిపారు. ఇందులో ఆత్మకూరు నియోజకవర్గంలోని 135 దేవాలయాలకు ధూపదీప నైవేద్య పథకం కింద సుమారు రూ.1.62 కోట్లను ఖర్చు చేస్తున్నామని వెల్లడించారు. శ్రీ అలగనాథ స్వామివారి ఆలయాన్ని కూడా ఈ పథకంలో చేర్చామని తెలిపారు.రాష్ట్రంలో ఆలయాలు లేని ప్రాంతాల్లో కొత్తగా భజన మందిరాలు, ఆలయాలను నిర్మించేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టిందని మంత్రి తెలిపారు.
ముఖ్యమంత్రి సూచనల మేరకు రాష్ట్రవ్యాప్తంగా 5,000 భజన మందిరాలను నిర్మించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని, ఇందుకోసం టీటీడీ నిధులను వినియోగించేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. కాలనీలు, చెంచు గూడేలు, అటవీ ప్రాంతాలు తదితర ప్రాంతాల్లో కనీసం 15 మంది ప్రజలు ఉండి ఆలయం కావాలని కోరితే అక్కడ ఆలయ నిర్మాణానికి ప్రభుత్వం సహకరిస్తుందని తెలిపారు. రూ.20 లక్షలు, రూ.30 లక్షలు, రూ.40 లక్షల చొప్పున మూడు కేటగిరీల్లో ఆలయాల నిర్మాణానికి నిధులు అందిస్తున్నామని చెప్పారు.
ఆత్మకూరు నియోజకవర్గంలో కొత్తగా 110 భజన మందిరాలు మంజూరు చేశామని, ఒక్కో ఆలయానికి సుమారు రూ.40 లక్షల చొప్పున మొత్తం రూ.40.20 కోట్ల నిధులతో నిర్మాణ పనులు చేపట్టామని మంత్రి తెలిపారు. ఆలయం లేని ప్రాంతాల్లో చెట్ల కింద, చిన్న గూళ్లలో స్థానిక ప్రజలు తమకు సాధ్యమైన రీతిలో పూజలు నిర్వహించుకుంటున్న పరిస్థితులను తాను స్వయంగా గమనించానని చెప్పారు. అటువంటి చిన్న ఆలయాలను కూడా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో మొదటి విడతలో ఆత్మకూరు నియోజకవర్గానికి 77 ఆలయాలను మంజూరు చేశామని, ఒక్కో ఆలయానికి రూ.5 లక్షల చొప్పున మొత్తం రూ.3.85 కోట్లను కేటాయించి మరమ్మతులు, రంగులు, ఇతర అభివృద్ధి పనులు చేపట్టామని తెలిపారు. ప్రస్తుతం ఆయా ఆలయాల్లో నిత్య పూజలు జరుగుతున్నాయని పేర్కొన్నారు.
ఆత్మకూరు నియోజకవర్గంలోని ప్రాచీన, చారిత్రక ఆలయాల పరిరక్షణకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నామని మంత్రి తెలిపారు. ఆలయాల మూల నిర్మాణాలు దెబ్బతినకుండా పురావస్తు శాఖ నిపుణుల సహకారంతో శాస్త్రీయ పద్ధతుల్లో పునరుద్ధరణ పనులు చేపడతామని చెప్పారు. సోమశిల సోమేశ్వరాలయం నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయని, జిల్లాలోని సంగమేశ్వరాలయాన్ని పూర్వ వైభవానికి తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఉదయగిరి ప్రాంతంలోని శ్రీ రంగనాథ స్వామి ఆలయానికి కూడా త్వరలోనే కేంద్ర పురావస్తు శాఖ అధికారులను తీసుకొచ్చి అభివృద్ధికి కృషి చేస్తామని అన్నారు. నర్రవాడ వెంకమాంబ పేరంటాలు దేవాలయ పరిసరాలను కూడా సమగ్రంగా అభివృద్ధి చేసి భక్తులకు అవసరమైన మౌలిక వసతులు కల్పిస్తామని స్పష్టం చేశారు.విలువలతో కూడిన విద్య, సనాతన ధర్మ సంప్రదాయాలు, వైదిక ధర్మాలు, ఆగమ శాస్త్రాల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని మంత్రి తెలిపారు.
పిల్లల్లో క్రమశిక్షణ, సంస్కారం, నైతిక విలువలను పెంపొందించేందుకు కంచి కామకోటి పీఠం ఆధ్వర్యంలో ఆత్మకూరు పరిధిలో ఆశ్రమ పాఠశాలను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ఇందుకోసం నియోజకవర్గంలో అనువైన ప్రాంతంలో ఐదు ఎకరాల భూమిని సేకరించి మఠం నిర్మాణానికి ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఆదిశంకరాచార్యులు స్థాపించిన శృంగేరి పీఠంతో పాటు కంచి కామకోటి పీఠం దేశంలోని ప్రముఖ ఆధ్యాత్మిక పీఠాలుగా ఉన్నాయని పేర్కొన్నారు. విద్యార్థులకు ప్రత్యేక శిక్షణా కార్యక్రమాల ద్వారా వైదిక సూత్రాలు, నైతిక విలువలు, సంస్కారవంతమైన జీవన విధానాన్ని బోధించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
శ్రీ అలగనాథ స్వామివారి కళ్యాణ మండపం నిర్మాణానికి రూ.80 లక్షల దేవాదాయ శాఖ నిధులు ఖర్చు చేసి పూర్తి చేశామని మంత్రి తెలిపారు. ప్రతి నెల శ్రవణ నక్షత్రం రోజున స్వామివారి కళ్యాణోత్సవాన్ని నిర్వహించుకునేందుకు భక్తులకు ఈ మండపం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెప్పారు. స్థానిక పేద, మధ్యతరగతి ప్రజలు తక్కువ ఖర్చుతో శుభకార్యాలు నిర్వహించుకునేందుకు కూడా ఈ కళ్యాణ మండపం ఉపయోగపడుతుందని తెలిపారు.క్రీస్తుశకం 1247లో తెలుగు చోళ రాజులచే నిర్మించబడిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ అలగనాథ స్వామివారి ఆలయం ఆత్మకూరు ప్రాంత ఆధ్యాత్మిక, చారిత్రక వైభవానికి ప్రతీకగా నిలిచిందని మంత్రి తెలిపారు.
కాలక్రమేణా శిథిలావస్థకు చేరిన ఆలయాన్ని గ్రామ ప్రజలు, దాతలు, భక్తుల సహకారంతో పునరుద్ధరించి పూర్వ వైభవాన్ని తీసుకువచ్చామని పేర్కొన్నారు. ఆలయ అభివృద్ధికి సహకరించిన కమిటీ సభ్యులు, దాతలు, భక్తులకు మంత్రి పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. దేవాలయాలు కేవలం పూజా స్థలాలు మాత్రమే కాదని, అవి మన సంస్కృతి, సంప్రదాయాలు, ఆధ్యాత్మికత, విద్యా విజ్ఞానాలకు కేంద్రాలని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. జిల్లాలో ఆధ్యాత్మిక అభివృద్ధికి మరింత ఊతమిస్తూ, సనాతన ధర్మాన్ని, వైదిక సంప్రదాయాలను, ఆలయ సంస్కృతిని రాబోయే తరాలకు సురక్షితంగా అందించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.
2014 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసే అవకాశం లభించిందని, ముఖ్యమంత్రి తరువాత రెండవ స్థానంలో పనిచేసే అవకాశం తనకు దక్కిందని గుర్తుచేసుకున్న మంత్రి, ఆత్మకూరు నియోజకవర్గ ప్రజల ఆశీస్సుల వల్లే తాను ఆ స్థాయికి చేరుకున్నానని, ప్రజల ఆదరణను జీవితాంతం మర్చిపోలేనని అన్నారు. మళ్ళీ ప్రజల ఆశీస్సులతో దేవదాయ శాఖ మంత్రిగా వున్నానని...అభివృద్ధికి ఉన్న ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటూ ఆత్మకూరు నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు మంత్రి స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, భక్తులు పెద్దఎత్తున పాల్గొన్నారు.




