Atmakur: ఆత్మకూరులో స్కూల్ వ్యాన్ దందా బట్టబయలు: రూ.58 వేల జరిమానా!

Atmakur: నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో నిబంధనలకు విరుద్ధంగా పెళ్లి బృందాన్ని తరలిస్తున్న ప్రైవేట్ స్కూల్ వ్యాన్‌ను పట్టుకుని బ్రేక్ ఇన్‌స్పెక్టర్ రూ.58 వేల జరిమానా విధించారు.

TS Murthy, Atmakuru(Nellore)
Published on: 16 Nov 2026 11:28 AM IST
Atmakur
X

Atmakur: ఆత్మకూరులో స్కూల్ వ్యాన్ దందా బట్టబయలు: రూ.58 వేల జరిమానా!

ఆత్మకూరు: నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో నిన్న ఆసక్తికరమైన ఘటన చోటు చేసుకుంది. పెళ్లి బృందాన్ని తరలిస్తున్న ఓ ప్రైవేట్ స్కూల్ వ్యాన్ ను ప్రైవేట్ బస్సు యజమానులు అడ్డుకున్నారు.స్కూల్ పిల్లలను తరలించడానికి మాత్రమే అనుమతి ఉన్న వ్యాన్ తో పెళ్లి బృందాన్ని తరలిస్తున్నారని గమనించిన ప్రైవేట్ బస్సు యజమానులు, వెంటనే ఆత్మకూరు బ్రేక్ ఇన్ స్పెక్టర్ రాములుకు సమాచారం అందించారు.

సమాచారం అందుకున్న వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న వెహికల్ ఇన్ స్పెక్టర్ రాములు, వ్యాన్ ను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. స్కూల్ వ్యాన్ లో పెళ్లి బృందం ప్రయాణిస్తున్నట్లు గుర్తించారు. ప్రైవేట్ స్కూల్ వ్యాన్లు కేవలం బడి పిల్లలను మాత్రమే తరలించాలని, ఇలా పెళ్లి బృందాలను, ఇతర ప్రయాణికులను తరలించడం నిబంధనలకు పూర్తిగా విరుద్ధమని ఆయన స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘించినందుకు ఆ స్కూల్ వ్యాన్ కు ఏకంగా 58 వేల రూపాయల పెనాల్టీ విధించారు.

ఈ సందర్భంగా రాములు మాట్లాడుతూ, ప్రైవేట్ స్కూల్ బస్సు యజమానులు ఎట్టి పరిస్థితుల్లోనూ స్కూల్ పిల్లలను మాత్రమే తరలించాలని హెచ్చరించారు. అలా కాకుండా పెళ్లి బృందాలను తరలిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుని భారీ మొత్తంలో పెనాల్టీలు విధిస్తామని చెప్పారు. ఇందుకు ప్రైవేట్ స్కూల్ యజమానులు సహకరించాలని కోరారు. ఇకపై ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠినంగా వ్యవహరిస్తామని ఆయన తెలిపారు.

ఇదే సమయంలో ప్రైవేట్ బస్సు యజమానులు తమ బాధను వెళ్లగక్కారు. తాము మూడు నెలలకు ఒకసారి 43 వేల రూపాయల వరకు ట్యాక్స్ కట్టాల్సి వస్తుందని, అంతేకాకుండా ఇన్సూరెన్స్ కూడా భారీ మొత్తంలో కట్టాల్సి వస్తుందని చెప్పారు. అదే స్కూల్ బస్సు యజమానులు మాత్రం మూడు నెలలకు కేవలం 4 వేల రూపాయలు మాత్రమే చెల్లించి, స్కూల్ పిల్లలను తరలించడమే కాకుండా, ఆదివారం సమయాల్లో పెళ్లి బృందాలను, ఇతర ప్రయాణాలకు తరలిస్తూ తమ పొట్టలు కొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

తక్కువ ట్యాక్స్ కట్టి, తక్కువ ఖర్చుతో నడుస్తూ, తమ వ్యాపారాన్ని దెబ్బతీస్తున్నారని వారు ఆరోపించారు. స్కూల్ యజమానులు పెళ్లి బృందాలను తరలిస్తే కఠినమైన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. అధికారులు ఈ విషయంపై నిరంతరం తనిఖీలు చేయాలని కోరారు.

TS Murthy, Atmakuru(Nellore)

TS Murthy, Atmakuru(Nellore)