Nellore: ఆత్మకూరు కౌంటింగ్ వద్ద తీవ్ర ఉద్రిక్తత: వైసీపీ శ్రేణుల ధర్నా!
Nellore: ఆత్మకూరు కౌంటింగ్ కేంద్రం వద్ద తీవ్ర ఉద్రిక్తత. అనంతసాగరం జడ్పీటీసీ ఎన్నికల్లో ఏకంగా 980 ఓట్లను చెల్లనివిగా గుర్తించడంపై వైసీపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి.
Nellore: ఆత్మకూరు కౌంటింగ్ వద్ద తీవ్ర ఉద్రిక్తత: వైసీపీ శ్రేణుల ధర్నా!
నెల్లూరు: నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని కౌంటింగ్ కేంద్రాల వద్ద ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అనంతసాగరం మండలం వైసీపీ జడ్పీటీసీ అభ్యర్థి సానుభూతిపరులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున కౌంటింగ్ కేంద్రం వద్ద ఆందోళనకు దిగారు. తమకు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నిస్తూ నినాదాలు చేశారు.
కౌంటింగ్ మొదలైన దగ్గర నుంచి కూడా అధికార పక్షానికి అనుకూలంగా వ్యవహరిస్తూ వచ్చారని ఆరోపిస్తున్నారు. మొదట్లో తమ అభ్యర్థికి 4 వేల ఓట్లకు పైగా మెజారిటీ వస్తుందని అందరూ అనుకున్నారు. రౌండ్ రౌండ్ కి ఆ మెజారిటీని తగ్గించుకుంటూ వచ్చి, చివరకు టీడీపీ జడ్పీటీసీ అభ్యర్థి కేవలం 350 ఓట్ల మెజారిటీతో గెలిచినట్లు ప్రకటించడం పూర్తిగా దుర్మార్గమని వారు మండిపడుతున్నారు.
దేశ చరిత్రలోనే ఎక్కడా జరగని విధంగా, ఒక్క జడ్పీటీసీ అభ్యర్థికి సంబంధించిన ఓట్లలో ఏకంగా 980 ఓట్లను చెల్లనివిగా గుర్తించారని వారు ఆరోపిస్తున్నారు. ఇంత పెద్ద సంఖ్యలో ఓట్లు చెల్లనివి ఎలా అవుతాయని ప్రశ్నిస్తున్నారు. మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆత్మకూరు నియోజకవర్గంలోనే ఇలాంటి దారుణం జరగడం బాధాకరమని వారు ఆవేదన వ్యక్తం చేశారు.టేబుల్ నెంబర్ 7 లో జరిగిన తీరుపై వారు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
అక్కడ ఏఆర్ఓ వీరవసంతరావు అత్యుత్సాహం చూపించి, కావాలనే వైసీపీ ఓట్లను చెల్లనివిగా గుర్తించారని ఆరోపిస్తున్నారు. ఆయన తీరును గమనించిన కౌంటింగ్ సిబ్బంది కూడా తట్టుకోలేక ఇలా ఏకపక్షంగా వ్యవహరించలేమని చెప్పి కౌంటింగ్ కేంద్రం నుండి బయటికి వెళ్లారని తెలిపారు.
సిబ్బందే బహిష్కరించారంటే ఆ ఏఆర్ఓ ఎలా విధులు నిర్వహించాడో ప్రజలే అర్థం చేసుకోవాలని వారు అంటున్నారు.ఈ వ్యవహారంపై జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించాలని, పూర్తి స్థాయిలో విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వైసీపీ శ్రేణులు డిమాండ్ చేస్తున్నారు.




