Nellore: రైతులకు మెరుగైన మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించాలి
Nellore: నెల్లూరు కలెక్టరేట్లో అగ్రిస్టాక్ కార్యక్రమంపై కలెక్టర్ హిమాన్షు శుక్లా నేతృత్వంలో టాస్క్‌ఫోర్స్ సమీక్ష. రైతులకు మార్కెటింగ్, ప్రాసెసింగ్ సౌకర్యాలపై ఆదేశాలు.
Nellore: రైతులకు మెరుగైన మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించాలి
నెల్లూరు: నెల్లూరు జిల్లా కలెక్టరేట్లోని శంకరన్ హాల్లో బుధవారం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన అగ్రిస్టాక్ కార్యక్రమం అమలు, డిజిటల్ వ్యవసాయ సమాచార సమీకరణ, రైతులకు మెరుగైన మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించే అంశాలపై జిల్లా స్థాయి టాస్క్‌ఫోర్స్ సమావేశం విజయవంతంగా నిర్వహించారు.
ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ ,జాయింట్ కలెక్టర్‌గారు,ముఖ్య ప్రణాళిక అధికారి, లీడ్ బ్యాంక్ మేనేజర్, ఐటీడీఏ అధికారులు, జిల్లా వ్యవసాయ అధికారి, పి. సత్యవాణి,జిల్లా ఉద్యానవన శాఖ అధికారి, సుబ్బారెడ్డి , డీడీఏ, డీఆర్సీ V. సుమలత, వ్యవసాయ పరిశోధనా కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డా. వినీత,
జిల్లా వ్యవసాయ అధికారి కార్యాలయ సహాయ వ్యవసాయ సంచాలకులు D. సుజాత మరియు జిల్లాలోని అన్ని సహాయ వ్యవసాయ సంచాలకులు, ఇతర సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి అగ్రిస్టాక్ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశాలు, అమలు విధానం, వ్యవసాయ రంగంలో దాని ఉపయోగాలు, రైతులకు కలిగే ప్రయోజనాలను వివరించారు. వ్యవసాయ రంగానికి సంబంధించిన వివిధ శాఖల సమాచారాన్ని సమన్వయం చేసి, డిజిటల్ సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించడం ద్వారా రైతులకు మెరుగైన సేవలు అందించవచ్చని తెలిపారు.
అగ్రిస్టాక్ కార్యక్రమంలో భాగంగా గుర్తించిన తొమ్మిది ప్రధాన అంశాలపై అధికారులతో చర్చించారు.
వీటిలో వ్యవసాయ సమాచార నాణ్యత, భూముల వివరాల అనుసంధానం, రైతుల గుర్తింపు, ప్రభుత్వ పథకాల అమలు, పంటల ప్రణాళిక, పంటల పర్యవేక్షణ, పంటల బీమా, వ్యవసాయ మార్కెటింగ్, వ్యవసాయ రుణాలు, వ్యవసాయ గణాంకాలు, సమగ్ర వ్యవసాయ విలువ గొలుసు ప్రణాళిక, వినూత్న డిజిటల్ విధానాల ద్వారా రైతులకు ప్రయోజనం చేకూర్చడం వంటి అంశాలు ఉన్నాయి.
ప్రాంతాల వారీగా, పంటల వారీగా రైతుల సమాచారాన్ని సమన్వయం చేయాలి
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలోని ప్రాంతాల వారీగా, రైతుల వారీగా, పంటల వారీగా సమగ్ర వ్యవసాయ సమాచారాన్ని రూపొందించి, వ్యవస్థీకృత రిటైలర్లతో రైతులను అనుసంధానం చేయాలని అధికారులకు సూచించారు.
జిల్లాలో ప్రధానంగా సాగు చేస్తున్న పప్పుధాన్యాలు, కూరగాయలు, పండ్లు, వేరుశనగ వంటి వ్యవసాయ ఉత్పత్తులకు మెరుగైన మార్కెటింగ్ అవకాశాలు కల్పించే దిశగా చర్యలు చేపట్టాలని తెలిపారు. రైతులు పండించిన ఉత్పత్తులకు తగిన మార్కెట్ సౌకర్యాలు కల్పించడంతో పాటు, వ్యవసాయ ఉత్పత్తుల ప్రాసెసింగ్, విలువ జోడింపు, మార్కెట్ అనుసంధానం వంటి అవకాశాలను గుర్తించి కార్యాచరణ రూపొందించాలని సూచించారు.
రైతుల ప్రయోజనాలే లక్ష్యంగా అంతరశాఖల సమన్వయం
అగ్రిస్టాక్ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయడానికి వ్యవసాయ శాఖతో పాటు సంబంధిత అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ సూచించారు. జిల్లాలోని వాస్తవ వ్యవసాయ సమస్యలను గుర్తించి, అందుబాటులో ఉన్న సమాచారాన్ని వినియోగిస్తూ రైతులకు ప్రత్యక్ష ప్రయోజనం చేకూర్చే ఆచరణ సాధ్యమైన ప్రతిపాదనలు రూపొందించాలని తెలిపారు.
డిజిటల్ వ్యవసాయ సమాచారాన్ని సమర్థవంతంగా వినియోగించడం ద్వారా వ్యవసాయ ప్రణాళికను మెరుగుపరచడం, పంటల ఆధారంగా మార్కెటింగ్ అవకాశాలను గుర్తించడం, వ్యవసాయ ఉత్పత్తులకు విలువ జోడించడం, రైతులకు మెరుగైన సేవలు అందించడం వంటి లక్ష్యాలను సాధించేందుకు అధికారులు కృషి చేయాలని సూచించారు.
ఈ సమావేశంలో వివిధ శాఖల అధికారులు తమ తమ శాఖలకు సంబంధించిన వ్యవసాయ సమాచారాన్ని సమన్వయం చేసుకుంటూ, అగ్రిస్టాక్ కార్యక్రమం ద్వారా రైతులకు మెరుగైన ప్రయోజనాలు అందించే దిశగా పనిచేయాల్సిన అవసరాన్ని వివరించారు.సమావేశం అనంతరం వ్యవసాయా శాఖ అధికారులు మరియు ARS శాస్త్రవేత్తలు నెలవారీ సమీక్షా సమావేశం జరిగింది.




