Nellore: మాదకద్రవ్యాల కట్టడికి కఠిన చర్యలు నెల్లూరు కలెక్టర్
Nellore: నెల్లూరులో మాదకద్రవ్యాల నివారణపై ఎన్‌కార్డ్ సమావేశం నిర్వహించిన కలెక్టర్ హిమాన్షు శుక్లా. గత రెండేళ్లలో 879 కిలోల గంజాయి స్వాధీనం.
Nellore: మాదకద్రవ్యాల కట్టడికి కఠిన చర్యలు నెల్లూరు కలెక్టర్
నెల్లూరు: మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగాన్ని అరికట్టేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పటిష్ట చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా అధికారులను ఆదేశించారు. మంగళవారం నెల్లూరు కలెక్టరేట్‌లోని తిక్కన భవన్‌లో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ఎన్‌కార్డ్ (NCORD) సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు చేపడుతున్న చర్యలు, నమోదైన ఎన్‌డీపీఎస్ కేసులు, అరెస్టులు, స్వాధీనం చేసుకున్న గంజాయి, సీజ్ చేసిన వాహనాల వివరాలను సమీక్షించారు.
ఈ సందర్భంగా ఎస్పీ డాక్టర్ అజితా వేజండ్ల జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు సంబంధించి చేపడుతున్న ఎన్‌ఫోర్స్‌మెంట్ చర్యలు, కేసుల వివరాలను సమావేశంలో వెల్లడించారు. 2025 సంవత్సరంలో 41 ఎన్‌డీపీఎస్ కేసులు నమోదు చేసి 129 మందిని అరెస్టు చేసినట్లు తెలిపారు. ఈ కేసుల్లో 546.085 కిలోల డ్రై గంజాయి, 0.527 లీటర్ల లిక్విడ్ గంజాయిని స్వాధీనం చేసుకుని 16 వాహనాలను సీజ్ చేసినట్లు వివరించారు.
2026లో ఆగస్టు 17వ తేదీ వరకు 9 ఎన్‌డీపీఎస్ కేసులు నమోదు చేసి 33 మందిని అరెస్టు చేసినట్లు ఎస్పీ తెలిపారు. ఈ కేసుల్లో 333.407 కిలోల డ్రై గంజాయిని స్వాధీనం చేసుకుని 5 వాహనాలను సీజ్ చేసినట్లు వెల్లడించారు.
దీంతో 2025, 2026 సంవత్సరాల్లో ఆగస్టు 17వ తేదీ వరకు జిల్లాలో మొత్తం 50 ఎన్‌డీపీఎస్ కేసులు నమోదు కాగా, 162 మంది నిందితులను అరెస్టు చేశారు. మొత్తం 879.5 కిలోల డ్రై గంజాయిని స్వాధీనం చేసుకుని 21 వాహనాలను సీజ్ చేసినట్లు ఎస్పీ వివరించారు.
గత ఎన్‌కార్డ్ సమావేశం నుంచి 2026 ఆగస్టు 17వ తేదీ వరకు జిల్లాలో 3 ఎన్‌డీపీఎస్ కేసులు నమోదు చేసి 7 మందిని అరెస్టు చేసినట్లు ఎస్పీ తెలిపారు. ఈ కేసుల్లో 314.545 కిలోల కాంట్రాబాండ్‌ను స్వాధీనం చేసుకుని ఒక వాహనాన్ని సీజ్ చేసినట్లు వివరించారు. పునరావృత నేరస్తులు ఎవరూ గుర్తించబడలేదని, ఒక కేసులో పీఐటీ ఎన్‌డీపీఎస్ చట్టం కింద చర్యలు ప్రారంభించినట్లు తెలిపారు.
"మాదకద్రవ్యాల నియంత్రణపై సమగ్ర కార్యాచరణ"
సమావేశంలో మాదకద్రవ్యాల అక్రమ రవాణాకు సంబంధించిన కేసులపై దర్యాప్తు, ఆర్థిక లావాదేవీల పరిశీలన, అక్రమ ఆస్తుల గుర్తింపు, మాదకద్రవ్యాల నెట్‌వర్క్‌ను విచ్ఛిన్నం చేసే చర్యలపై చర్చించారు. అలాగే మాదకద్రవ్యాల వినియోగం ఎక్కువగా ఉండే ప్రాంతాలను గుర్తించి ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడం, హిస్టరీ షీట్ల నిర్వహణ, విద్యా సంస్థల పరిసరాల్లో భద్రతా చర్యలను బలోపేతం చేయడంపై సమీక్షించారు.
పాఠశాలలు, కళాశాలల్లో మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం, తనిఖీలు ముమ్మరం చేయడం, హెల్ప్‌లైన్ సేవలపై ప్రచారం కల్పించడం, ప్రజలకు విస్తృత అవగాహన కల్పించడం ద్వారా మాదకద్రవ్యాల నిర్మూలనకు సమన్వయంతో చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ సూచించారు.
మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగాన్ని అరికట్టడంలో పోలీసు, రెవెన్యూ, వైద్య, విద్య, సంక్షేమ తదితర శాఖలు సమన్వయంతో పనిచేయాలని, యువత మాదకద్రవ్యాలకు బానిస కాకుండా ముందస్తు అవగాహన, నివారణ చర్యలకు ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ స్పష్టం చేశారు. డ్రగ్ ఇన్స్పెక్టర్, ఫుడ్ సేఫ్టీ అధికారులు విస్తృతంగా తనిఖీలు చేయాలన్నారు.
సమావేశంలో ఏఎస్పీలు దీక్ష, సౌజన్య, డిఆర్వో విజయ్ కుమార్, డిఎంహెచ్వో డా. సుజాత సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.




