Nellore: వినాయక చవితి ఉత్సవాలకు పటిష్ట భద్రత: నెల్లూరు కలెక్టర్ హిమాన్షు శుక్ల
Nellore: నెల్లూరు జిల్లాలో వినాయక చవితి ఉత్సవాలు, పెన్నా నదిలో నిమజ్జన ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల అధికారులను ఆదేశించారు.
Nellore: వినాయక చవితి ఉత్సవాలకు పటిష్ట భద్రత: నెల్లూరు కలెక్టర్ హిమాన్షు శుక్ల
నెల్లూరు: వినాయక చవితి ఉత్సవాలను జిల్లాలో శాంతియుత వాతావరణంలో, భక్తిశ్రద్ధలతో నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల ఆదేశించారు.
మంగళవారం ఉదయం కలెక్టరేట్లోని ఎస్ఆర్ శంకరన్ హాల్లో వినాయక చవితి ఉత్సవాల నిర్వహణపై సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్సవాల ఏర్పాట్లు, భద్రతా చర్యలు, నిమజ్జన కార్యక్రమాల నిర్వహణ తదితర అంశాలపై అధికారులతో కలెక్టర్ సమీక్షించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఈ నెల 14వ తేదీ నుంచి ప్రారంభమయ్యే వినాయక చవితి ఉత్సవాలు, 18వ తేదీన ఇరుగాలమ్మ గుడి సమీపంలోని గణేష్ ఘాట్, రంగనాథ స్వామి గుడి సమీపంలోని పెన్నా బ్రిడ్జి వద్ద నిమజ్జనానికి పకడ్బందీగా ఏర్పాటు చేయాలని, నిమజ్జన కార్యక్రమాలను ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు.
వినాయక విగ్రహాల ఏర్పాటు కోసం పోలీసు, రెవెన్యూ, విద్యుత్, ట్రాఫిక్, మున్సిపల్ తదితర శాఖల అనుమతులు తప్పనిసరిగా తీసుకునేలా చర్యలు చేపట్టాలని తెలిపారు. గణేష్ మండపాలకు అనుమతులు మంజూరు చేసే సమయంలో నిబంధనలు, భద్రతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించేలా చూడాలని ఆదేశించారు. సింగిల్ విండో విధానంలో అనుమతులను వేగంగా మంజూరు చేయాలని పోలీసులకు సూచించారు.
విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని, మండపాల వద్ద నాణ్యమైన విద్యుత్ వైర్లు, సురక్షిత విద్యుత్ కనెక్షన్లు ఉండేలా చూడాలని సూచించారు. నిమజ్జన ప్రాంతాల్లో క్రేన్లు, గజ ఈతగాళ్లు, పోలీసు సిబ్బంది, వైద్య బృందాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.
నిమజ్జన ప్రాంతాల్లో పూడికను తొలగించి, నీటి లోతును గుర్తించి, ప్రమాద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని కలెక్టర్ సూచించారు. నిమజ్జన కార్యక్రమం సందర్భంగా ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు.
ఊరేగింపు మార్గాల్లో రోడ్లపై ఉన్న గుంతలు, విద్యుత్ తీగలు, ఇతర అడ్డంకులను ముందుగానే గుర్తించి తొలగించాలని తెలిపారు. ఉత్సవాల్లో డీజేలు, మైకుల వినియోగం, ఊరేగింపుల సమయం తదితర అంశాల్లో నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
నిమజ్జన కార్యక్రమంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసు, రెవెన్యూ, మున్సిపల్, ట్రాఫిక్, ఫైర్, వైద్య శాఖలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సూచించారు. ప్రజలకు అసౌకర్యం కలగకుండా పారిశుధ్యం, తాగునీరు, విద్యుత్, వైద్య సేవలు, పార్కింగ్ తదితర మౌలిక సదుపాయాలు కల్పించాలని తెలిపారు.
జిల్లాలో వినాయక చవితి ఉత్సవాలను ప్రశాంతంగా, విజయవంతంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తోందని కలెక్టర్ తెలిపారు. అధికారులు, భక్తులు, ప్రజలు సమన్వయంతో సహకరించి ఉత్సవాలను విజయవంతం చేయాలని ఆయన కోరారు.
ఈ సమావేశంలో డిఆర్ఓ విజయ్ కుమార్, ఏఎస్పీ సౌజన్య, ఆర్డీవో అనూష, వివిధ శాఖల అధికారులు, విక్రమ సింహపురి గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.




