Nellore: జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు పటిష్ట ఏర్పాట్లు

Nellore: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు పటిష్ట ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల ప్రకటన.

V. Narasimhulu, Nellore
Published on: 4 Nov 2026 8:33 PM IST
Nellore
X

Nellore: జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు పటిష్ట ఏర్పాట్లు

నెల్లూరు: జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నేపథ్యంలో జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల వెంకటాచలం, గూడూరులో ఏర్పాటుచేసిన రిసెప్షన్ డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల్లో ఎన్నికల సామాగ్రి పంపిణీ ప్రక్రియను పరిశీలించారు. ఎన్నికల విధులకు హాజరైన సిబ్బందితో మాట్లాడి, వారికి కేటాయించిన విధులు, ఏర్పాట్ల గురించి ఆరా తీశారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ... జిల్లాలో 34 మండలాల్లో ఎన్నికల నిర్వహణకు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి ఇప్పటికే శిక్షణ అందించినట్లు వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా 1,568 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పోలింగ్ కేంద్రాల వద్ద సీసీ కెమెరాలు, వెబ్ కెమెరాలను ఏర్పాటు చేసి ఎన్నికల ప్రక్రియను నిరంతరం పర్యవేక్షించేలా చర్యలు తీసుకున్నట్లు స్పష్టం చేశారు.

ఎన్నికల విధుల నిర్వహణకు సుమారు 11 వేల మంది సిబ్బందిని, భద్రతా ఏర్పాట్లలో భాగంగా 3 వేల మంది పోలీసులను నియమించినట్లు కలెక్టర్ తెలిపారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

ఓటర్లు ఎలాంటి భయాందోళనలకు గురికాకుండా స్వచ్ఛందంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల పిలుపునిచ్చారు.

V. Narasimhulu, Nellore

V. Narasimhulu, Nellore