Nellore: వన్యప్రాణి సంరక్షణపై కలెక్టర్ హిమాన్షు శుక్లా ప్రత్యేక దృష్టి
Nellore: నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా అధ్యక్షతన జిల్లా స్థాయి అటవీ, వన్యప్రాణి పరిరక్షణ కమిటీ సమావేశం జరిగింది.
Nellore: వన్యప్రాణి సంరక్షణపై కలెక్టర్ హిమాన్షు శుక్లా ప్రత్యేక దృష్టి
Nellore: మంగళవారం ఉదయం కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్, కమిటీ చైర్మన్ హిమాన్షు శుక్ల అధ్యక్షతన జిల్లా స్థాయి అటవీ, వన్యప్రాణి పరిరక్షణ కమిటీ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ..
అటవీ, పోలీస్, రెవెన్యూ శాఖల మధ్య సమన్వయాన్ని మరింత బలోపేతం చేసి అటవీ భూముల ఆక్రమణలు, అక్రమ రవాణాను కట్టడి చేయాలని ఆదేశించారు. నగరవనాల నిర్వహణ, వనరుల సమీకరణపై కూడా చర్చ జరిగింది.
అటవీ సంరక్షణలో భాగంగా ఎర్రచందనం రక్షణకు ప్రత్యేక దృష్టి సారించడంతో పాటు, తీరప్రాంతాల్లో ఒలివ్ రిడ్లీ సముద్ర తాబేళ్ల సంరక్షణ, అటవీ అగ్ని ప్రమాదాల నివారణ వంటి కీలక అంశాలపై విస్తృతంగా చర్చించారు. పెనుశిల నరసింహ వన్యప్రాణి అభయారణ్యానికి సంబంధించిన ఈకో సెన్సిటివ్ జోన్ జోనల్ మాస్టర్ ప్లాన్ సిద్ధీకరణ పురోగతిని కలెక్టర్ సమీక్షించారు. ఈకో సెన్సిటివ్ జోన్‌లో యూకలిప్టస్ తోటల ప్రతిపాదనలను కూడా పరిశీలించారు.
అదేవిధంగా రిజర్వ్ అటవీ ప్రాంతాలకు వెలుపల ఉన్న రెవెన్యూ భూముల్లో పర్యాటక అభివృద్ధికి అనుకూలమైన ప్రదేశాలను గుర్తించి జిల్లా టూరిజం మాస్టర్ ప్లాన్ రూపొందించాలని సూచించారు.
ఉదయగిరిలో క్రాఫ్ట్ వుడ్ బ్యాంక్ ఏర్పాటు ద్వారా కలప ఆధారిత జీవనోపాధులను ప్రోత్సహించడం, తీరప్రాంతంలో గ్రేట్ గ్రీన్ వాల్ అభివృద్ధి, రిజర్వ్ అటవీ ప్రాంతాలకు వెలుపల ఉన్న తడిబయళ్ల (వెట్‌లాండ్స్)పై డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ప్రతిపాదనలు కూడా కలెక్టర్ చర్చించారు.
అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి నిర్ణయించిన గడువుల్లో పనులు పూర్తి చేయాలని, అటవీ పర్యావరణ చట్టాల అమలులో కఠినంగా వ్యవహరించాలని కలెక్టర్ ఆదేశించారు. అటవీ, వన్యప్రాణి సంరక్షణను మరింత బలోపేతం చేయాలని సూచించారు.
ఒలివ్ రిడ్లీ సముద్ర తాబేళ్ల సంరక్షణలో భాగంగా TREE ఫౌండేషన్ రూపొందించిన రెండు అవగాహన పోస్టర్లను జిల్లా కలెక్టర్ విడుదల చేశారు. “భారత తూర్పు తీరాన్ని తీర్చిదిద్దే మౌన శిల్పులు – సముద్ర తాబేళ్లు” అనే పోస్టర్‌లో ఆంధ్ర తీరంలో కనిపించే నాలుగు రకాల తాబేళ్ల వివరాలు ఉండగా, “వలల్లో చిక్కుకున్న సముద్ర జీవులను సురక్షితంగా విడుదల చేసే విధానం” అనే పోస్టర్‌లో చేపల వలల్లో చిక్కుకున్న తాబేళ్లు తదితర సముద్ర జీవులను ఎలా రక్షించాలనే అంశాలు వివరించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అటవీ అధికారి కె. మహబూబ్ బాషా, నెల్లూరు, ఆత్మకూరు ఆర్డీవోలు అనూష, పావని, జిల్లా వ్యవసాయ అధికారి సత్యవాణి, జిల్లా పంచాయతీ అధికారి వసుమతి, ఏపీఐఐసీ జెడ్ ఎం శివకుమార్, జిల్లా సర్వే ల్యాండ్ రికార్డుల డిడి నాగ శేఖర్, TREE ఫౌండేషన్ చైర్‌పర్సన్, వ్యవస్థాపకురాలు డా. సుప్రజ ధారిణి, అటవీ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.




