Nellore: నిత్యావసరాల ధరల పెంపుపై సీపీఐ ఆధ్వర్యంలో నిరసన

Nellore: నెల్లూరులో నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయని, పేదల బతుకులు భారంగా మారాయని ఆందోళన వ్యక్తం చేస్తూ సీపీఐ ఆధ్వర్యంలో నిరసన.

V. Narasimhulu, Nellore
Published on: 9 Sept 2026 9:56 PM IST
Nellore
X

Nellore: నిత్యావసరాల ధరల పెంపుపై సీపీఐ ఆధ్వర్యంలో నిరసన

నెల్లూరు: ఆకాశాన్నంటుతున్న నిత్యావసర వస్తువుల ధరలతో పేదలు, కార్మికులు, రైతులు, ఉద్యోగులు, చిరు వ్యాపారులు, మధ్యతరగతికుటుంబాల బతుకులుభారంగా మారాయని సీపీఐ నెల్లూరు జిల్లా కార్యదర్శి అరిగెల సాయిఅన్నారు. బుధవారం సాయంత్రం నెల్లూరు నగరంలోని గాంధీ విగ్రహం వద్ద జరిగిన నిరసన కార్యక్రమంలో అరిగెల సాయి మాట్లాడుతూ....

ఒకవైపు ప్రజల ఆదాయాలు ఆశించిన స్థాయిలో పెరగకపోగా,మరోవైపురోజురోజుకూపెరుగుతున్ననిత్యావసరవస్తువులధరలుకుటుంబబడ్జెట్లను ఛిద్రం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు.. కూరగాయలు కొనలేనిపరిస్థితి, పప్పువండాలంటే ఆలోచించాల్సిన పరిస్థితి, వంటనూనె వినియోగించాలంటే జేబు చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని, సామాన్యుడి వంటిల్లు నేడు అగ్నిగుండంగా మారిందని పేర్కొన్నారు.

2014తో పోలిస్తే... నేడు నిత్యావసర వస్తువుల ధరలు భారీగా పెరిగినట్లు కేంద్రప్రభుత్వ అధికారిక గణాంకాలే వెల్లడిస్తున్నాయని సాయి తెలిపారు. బియ్యం కిలో ధర ₹28.06 నుంచి ₹45.69కు పెరిగిందని, అంటే సుమారు 63 శాతం పెరుగుదల నమోదైందన్నారు. కందిపప్పు ధర ₹75.94 నుంచి ₹122.06కు పెరిగి సుమారు 61 శాతం పెరిగిందని తెలిపారు. సన్‌ఫ్లవర్‌ వంటనూనె ధర ₹93.55 నుంచి ₹192.40కు పెరిగి 105 శాతం మేర పెరిగిందని, చక్కెర ధర ₹34.02 నుంచి ₹60.78కు పెరిగి సుమారు 79 శాతం, ఉల్లిపాయ ధర ₹26.46 నుంచి ₹50.19కు పెరిగి సుమారు 90 శాతం, టమాటా ధర ₹21.44 నుంచి ₹37.67కు పెరిగి సుమారు 76 శాతం పెరిగిందని వివరించారు.

ముఖ్యంగా వంటనూనె ధర రెట్టింపుకుపైగా పెరగడం, ఉల్లిపాయ ధర దాదాపు రెట్టింపు కావడం, బియ్యం, కందిపప్పు, చక్కెర, టమాటా ధరలు గణనీయంగా పెరగడం ప్రజలపై పడుతున్న ధరల భారానికి నిదర్శనమన్నారు. ధరలు ఇంత భారీగా పెరుగుతుంటే ప్రజల ఆదాయాలు కూడా అదేస్థాయిలోపెరిగాయా, సామాన్యుడి కొనుగోలు శక్తి పెరిగిందా అనిసాయి ప్రశ్నించారు.

రైతుపండించినపంటకు గిట్టుబాటు ధరదక్కడం లేదని, అదే పంట మార్కెట్‌ కు వచ్చేసరికి వినియోగదారుడు మాత్రం అధిక ధర చెల్లించాల్సి వస్తోందని అన్నారు. రైతు దగ్గర తక్కువ ధర, వినియోగదారుడి దగ్గర అధిక ధర ఉండగా, మధ్యలో దళారీ వ్యవస్థ భారీగా లాభపడుతోందని విమర్శించారు. రైతు నుంచి వినియోగదారుడి వరకు కొనసాగుతున్న ఈ దోపిడీ గొలుసును తెంచాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు.

కృత్రిమ కొరత,అక్రమ నిల్వలు, దళారీ వ్యవస్థ, బ్లాక్‌మార్కెట్‌ కారణంగా నిత్యావసర వస్తువుల ధరలు కృత్రిమంగా పెంచుతున్న వాటిని అరికట్టడంలో కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు విఫలమవుతున్నాయని అరిగెల సాయి విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం నిత్యావసర వస్తువుల ధరలను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని చెబుతున్నప్పటికీ, మార్కెట్‌లో ధరల మంట ఎందుకు అదుపులోకి రావడం లేదని ప్రశ్నించారు.. ప్రభుత్వాలు ధరలను పర్యవేక్షిస్తున్నామని చెబుతున్నా... ప్రజల కొనుగోలు శక్తి, కుటుంబాలపై పడుతున్న భారాన్ని పట్టించుకోవడం లేదన్నారు.

ధరల పెరుగుదల వల్ల ప్రజల కొనుగోలు శక్తి తగ్గిపోతుండగా, రైతుల ఆదాయం కుంచించుకుపోతోందని, మరోవైపు దళారీలు, నిల్వదారుల లాభాలు పెరుగుతున్నాయని అన్నారు. ఇది కేవలం మార్కెట్‌కు సంబంధించిన సమస్య కాదని, ప్రజల జీవనంపై నేరుగా ప్రభావం చూపుతున్న పాలకుల విధాన వైఫల్యమనిపేర్కొన్నారు.

నిత్యావసర వస్తువుల ధరలను వెంటనే తగ్గించాలని, బ్లాక్‌మార్కెట్‌, అక్రమ నిల్వలు, కృత్రిమ కొరతను అరికట్టాలని ఆయన డిమాండ్ చేశారు. అక్రమంగా నిల్వలుచేస్తున్నవ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని,మార్కెట్‌పైసమర్థవంతమైన పర్యవేక్షణ చేపట్టాలని కోరారు.. రైతు నుంచి వినియోగదారుడి వరకు మధ్యలో ఉన్న దళారీ వ్యవస్థను నియంత్రించి రైతుకు గిట్టుబాటు ధర, వినియోగదారుడికి సరసమైన ధర లభించేలా

చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రైతు బజార్లను మరింత బలోపేతం చేసి విస్తరించాలని, ప్రభుత్వఆధ్వర్యంలో నిత్యావసర వస్తువులను సరసమైన ధరలకు ప్రజలకుఅందుబాటులోకి తీసుకురావాలని అరిగెల సాయి కోరారు. పేదలు,కార్మికులు, రైతులు,మహిళలు, ఉద్యోగులు,చిరువ్యాపారులు, మధ్యతరగతి కుటుంబాలపై పడుతున్న ధరల భారాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని అన్నారు.

కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు చిన్న అంకయ్య, రూరల్ మండల సహాయ కార్యదర్శి ఆదినారాయణ, సిపిఐ నగర నాయకులు జిలానిఖాన్,ఆంజనేయులు, ముక్తియార్, శ్రీనివాసులురెడ్డి, సుబ్బరాయుడు, ప్రత్యూష, రేవంత్, శ్రీనివాసులు, మహిళా సంఘం జిల్లా నాయకులు సోఫియా, సాయిలత, జ్యోతి, ఆసిఫా, హసీనా, రత్నమ్మ, నెల్లూరు రూరల్ మండలం సిపిఐ నాయకులు సుబ్బయ్య, వేణు, శీను,రఫీ, లతో పాటు పలువురు సిపిఐ కార్యకర్తలతో అధిక సంఖ్యలో మహిళలు పాల్గొని నిరసన వ్యక్తం చేశారు.

V. Narasimhulu, Nellore

V. Narasimhulu, Nellore

Next Story