Nellore: దళితుడి ఇంటిపై జేసీబీ దాడి - రూ. 30 లక్షల ఇల్లు నేలమట్టం!
Nellore: కల్లూరుపల్లిలో దళితుడు తేజ రూ. 30 లక్షలతో నిర్మించుకున్న ఇంటిని రాత్రికి రాత్రే జేసీబీతో కూల్చేశారని, నిందితులపై చర్యలు తీసుకోవాలని బాధితుడు కోరారు.
Nellore: దళితుడి ఇంటిపై జేసీబీ దాడి - రూ. 30 లక్షల ఇల్లు నేలమట్టం!
Nellore: పడారిపల్లి పరిధిలోని కల్లూరుపల్లి ప్రాంతంలో ఓ దళితుడు నిర్మించుకున్న ఇంటిని రాత్రికి రాత్రే జేసీబీతో కూల్చివేశారనే ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. కల్లూరుపల్లి సర్వే నంబర్ 81-1లో 105 అంకణాల స్థలాన్ని కొనుగోలు చేసి, కాంపౌండ్‌తో పాటు ఇంటిని నిర్మించుకున్నానని బాధితుడు తేజ తెలిపారు.
ఇంటికి విద్యుత్ కనెక్షన్ తీసుకోవడంతో పాటు భద్రత కోసం సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేసుకున్నానని చెప్పారు. స్థలానికి సంబంధించిన ఒరిజినల్ డాక్యుమెంట్లు, ఈసీలు, సర్వే రిపోర్టులు, అగ్రిమెంట్లు తన వద్ద ఉన్నాయని తేజ పేర్కొన్నారు.
అయితే తన స్థలాన్ని కొందరు వ్యక్తులు తమకు ఇవ్వాలని ఒత్తిడి చేశారని, బెదిరింపులకు పాల్పడ్డారని తేజ ఆరోపించారు. స్థలం ఇవ్వకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించినట్లు తెలిపారు. ఇదే విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లామని, ఎస్సీ కమిషన్ చైర్మన్ దృష్టికి కూడా సమస్యను తీసుకెళ్లినట్లు తేజ చెప్పారు.
దళితుడు చట్టబద్ధంగా స్థలం కొనుగోలు చేసి ఇల్లు నిర్మించుకోవడానికి కూడా అడ్డంకులు ఎదురవుతున్నాయంటూ ప్రశ్నించారు. తన ఇంటిని కూల్చివేసిన వారిపై, తనను బెదిరించిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని తేజ డిమాండ్ చేశారు. న్యాయం జరగకపోతే దళిత సంఘాలతో కలిసి ఆందోళన చేపడతామని తెలిపారు.




